ఆంజ‌నేయుడు పుట్టింద‌క్క‌డే.. ఆధారాలు బ‌య‌ట‌పెడ‌తాంః టీటీడీ

Update: 2021-04-14 04:43 GMT
శ్రీరాముడి జ‌న్మ‌స్థానంలో రామాల‌య నిర్మాణం జ‌రుగుతోంది. ఇలాంటి సంద‌ర్భంలో హ‌నుమంతుడి జ‌న్మ‌స్థానాన్ని కూడా నిర్ధారించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని టీటీడీ ఈవో కేఎస్ జ‌వ‌హ‌ర్ రెడ్డి అన్నారు. మంగ‌ళ‌వారం తిరుమ‌ల ఆల‌యంలో ఉగాది కార్య‌క్ర‌మాల త‌ర్వాత మీడియాతో మాట్లాడారు. హ‌నుమంతుడి జ‌న్మ‌స్థానాన్ని ఇప్పుడు తేల్చాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు.

అయితే.. ఏ రాష్ట్ర‌మూ హ‌నుమంతుడి జ‌న్మ‌స్థ‌లంపై స్ప‌ష్ట‌త ఇవ్వ‌లేద‌ని చెప్పారు. క‌ర్నాట‌క‌లోని హింపి ఆంజనేయుడి జ‌న్మ‌స్థ‌లంగా చెబుతున్నార‌ని అన్నారు. అయితే.. టీటీడీ వ‌ద్ద కూడా హ‌నుమంతుడు పుట్టిన ప్రాంతానికి సంబంధించి బ‌ల‌మైన ఆధారాలు ఉన్నాయ‌ని, వాటిని శ్రీరామ న‌వ‌మి రోజున బ‌య‌ట పెడ‌తామ‌ని ఆయ‌న చెప్పారు.

మిగిలిన రాష్ట్రాల‌ వ‌ద్ద ఏవైనా ఆధారాలు ఉంటే.. వారు కూడా వాటిని బ‌య‌ట పెట్టొచ్చ‌ని అన్నారు. న‌వ‌మి రోజున ఆధారాల‌ను ప్ర‌జ‌ల ముందు వివ‌రాలు వెల్ల‌డించి, వారి అభిప్రాయాల‌ను కూడా ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటామని జ‌వ‌హ‌ర్ రెడ్డి చెప్పారు.

అయోధ్య‌లో రామాల‌య నిర్మాణం జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే. ఇలాంటి స‌మ‌యంలోనే హ‌నుమంతుడి జ‌న్మ‌స్థానం అంశం చ‌ర్చ‌కు రావ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. మ‌రి, ఆంజ‌నేయుడి జ‌న్మ‌స్థానం గురించి టీటీడీ ఎలాంటి ఆధారాలు బ‌య‌ట‌పెడుతుందోన‌ని భ‌క్తులు ఎదురు చూస్తున్నారు.
Tags:    

Similar News