50 కోట్ల హెలికాప్టర్ ఆస్ప‌త్రికి దానం చేసిన గుజరాతీ వ‌జ్రాల వ్యాపారి

Update: 2022-02-05 06:30 GMT
సావజీ ఢోలకియా... సూరత్‌కు చెందిన‌ ఈయన ఓ వజ్రాల వ్యాపారి. వ‌జ్రాల వ్యాపారి కంటే సూరత్‌లో మానవ సేవా కార్యకలాపాలకు పేరొందిన వ్యక్తి. తన డైమండ్‌ కంపెనీలో పనిచేసే ఉద్యోగులకు 500 కార్లు, 471 నగల సెట్లు, 280 డబుల్‌ బెడ్రూం ఇళ్ల‌ను కానుకగా ఇచ్చి వార్తల‌లో నిలిచారు.  ప్రభుత్వం అందుకు గుర్తింపుగా ఇటీవల పద్మశ్రీతో సత్కరించింది. అయితే, ఇక్క‌డే అస‌లు ట్విస్ట్ చోటు చేసుకుంది. యాభై కోట్ల విలువైన‌ హెలీకాప్ట‌ర్‌ను ఆయ‌న ఉప‌యోగించుకున్న తీరు చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

సావ‌జీకి ప‌ద్మశ్రీ వ‌చ్చిన  సందర్భంగా కుటుంబ సభ్యులు ఆయనకు 50 కోట్ల విలువ చేసే ఓ హెలికాప్టర్‌ను కానుకగా ఇచ్చారు. సావజీకి తానొక్కడే హెలికాప్టర్‌లో చక్కర్లు కొట్టడం నచ్చలేదు.  సేవాభావంలో ఆద‌ర్శ‌ప్రాయుడైన సావ‌జీ అందుకే ఓ ఆస్ప‌త్రికి  విరాళంగా ఇచ్చేశారు. దీంతో షాక్ తిన‌డం అంద‌రి వంతు అయింది. అస‌లు ఎందుకు ఇలా చేశారు అంటే దానికి ఆయ‌న ఆస‌క్తిక‌ర రిప్లై ఇచ్చారు. ‘ఎప్పటి నుంచో దవాఖానకు ఓ హెలికాప్టర్‌ కొనివ్వాలనుకున్నా. కుదరలేదు. ఇప్పుడు చెప్పాపెట్టకుండా కుటుంబ సభ్యులు హెలికాప్టర్‌ కొనిచ్చారు. వెంటనే దానిని రోగుల సేవకు విరాళంగా ఇచ్చేశాను’ అని చెప్పారు.

సౌరాష్ట్రలోని అమ్రేలీ జిల్లా లాఠీ తాలూకా సావ‌జీ స్వ‌స్థ‌లం. బడి చదువు మానేసిన ఢోలకియా జేబులో పన్నెండున్నర రూపాయలతో 1977లో తన ఊరి నుంచి సూరత్‌కు వచ్చారు. అక్క‌డే వివిధ ర‌కాల ప‌నులు చేసి అనంత‌రం వ‌జ్రాల వ్యాపారంలోకి అడుగుపెట్టారు. 59 సంవత్సరాల సావజీ స్వస్థలంలో ఆయన ఇప్పటివరకు 75 చెరువులను తవ్వించారు.
Tags:    

Similar News