మనమరాలిని కన్న అమ్మమ్మ

Update: 2016-01-09 04:29 GMT
వినేందుకు విచిత్రంగా ఉన్నా ఇది నిజం. కుమార్తె బిడ్డను కనేందుకు ఓకే చెప్పేయటమే కాదు.. పండంటి బిడ్డను కనేసి ఈ అమ్మమ్మ.. కూతురికి జీవితంలో మర్చిపోలేని బహుమతిని అందించింది. సినిమాటిక్ గా ఉండే ఈ వ్యవహారంలోకి వెళితే..

అమెరికాలోని టెక్సాస్ చెందిన కెల్లీ.. అరోన్ దంపతులకు పిల్లల్లేరు. పిల్లల కోసం వారు చాలానే జాగ్రత్తలు తీసుకున్నారు. అయితే.. కెల్లీకి ఉన్న అనారోగ్య సమస్య కారణంగా ఆమెకు పిల్లలు పుట్టే అవకాశం లేదని వైద్యులు తేల్చారు. సర్ గోసీ (అద్దెగర్భం) సాయంతో పిల్లకు జన్మనివ్వొచ్చని వైద్యులు కెల్లీ దంపతులకు సూచన చేశారు. దీంతో.. సర్ గోసీ ఎలా అని వారిద్దరూ తీవ్రంగా ఆలోచిస్తున్న సమయంలో కెల్లీ తల్లి ట్రెసీ థాంప్సన్ తానే సర్ గోసీ అవుతానని ముందుకొచ్చారు.

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. తనకు పిల్లలు పుట్టే అవకాశం లేకుంటే.. తన పిల్లలకు జన్మనివ్వాలంటూ కెల్లీ తన తల్లిని టీనేజ్ లో ఉన్నప్పుడు ఆట పట్టించేదట. అది కాస్త నిజమైన పరిస్థితి. సర్ గోసీ పద్ధతిన కూతురు బిడ్డను కడుపులో వేసుకున్న అమ్మమ్మ ట్రెసీ థాంప్సన్ తాజాగా పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. దీంతో మనమరాలికి జన్మనిచ్చిన ‘అమ్మ’మ్మగా మారింది. మూడున్నర కేజీల బరువుతో బిడ్డ ఆరోగ్యంగా ఉన్నారని.. తన తల్లి తన జీవితానికి ఇచ్చిన అతి విలువైన బహుమతిగా కెల్లీ మురిసిపోతోంది.
Tags:    

Similar News