అర్థరాత్రి వేళ జీహెచ్ఎంసీ వార్నింగ్ అలెర్టు.. నగర ప్రజలకు నిద్ర లేకుండా చేశారు

Update: 2020-10-20 04:30 GMT
వర్షం మాట వింటేనే హైదరాబాద్ మహానగర ప్రజలు ఉలిక్కిపడుతున్నారు. గడిచిన కొద్దిరోజులుగా కురిసిన భారీ వర్షాల కారణంగా చోటు చేసుకున్న వరద తీవ్రత నుంచి ఇప్పటికి కోలుకోలేని వారికి.. మరో మూడురోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉండే అవకాశం ఉందన్న ముందస్తు అంచనాలు వణికిస్తున్నాయి. ఇప్పటికి జరిగింది సరిపోదా? మళ్లీ వానలు కురిస్తే.. తమ పరిస్థితి ఏమిటని వారు ఆందోళన చెందుతున్నారు. ఇలాంటివేళ.. సోమవారం అర్థరాత్రి 12 గంటలకు కాస్త ఇటుగా ఉన్న వేళలో టీవీల్లో బ్రేకింగ్ న్యూస్ లు పడ్డాయి.

మరో మూడు గంటల వ్యవధిలో నగరంలో వర్షాలు కురవనున్నాయని.. లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలన్నది సారాంశం. జీహెచ్ఎంసీ విడుదల చేసిన ప్రకటన ఆధారంగా ఈ అలెర్టును టీవీలు టెలికాస్ట్ చేశాయి. జీహెచ్ఎంసీకి  ఈ అలెర్టును ఐఎండీ ఇవ్వటంతో ఒక్కసారిగా అంతా ఉలిక్కిపడ్డారు. వాతావరణ శాఖ వారి లెక్కల ప్రకారం సోమవారం అర్థరాత్రి రెండున్నర లేదంటే మూడు గంటల నుంచి వర్షాలు పడే అవకాశం ఉందన్న అంచనాలు వేశారు.

దీంతో.. అర్థరాత్రి వేళ వర్షం కురిస్తే.. ఏమవుతుందో అన్న భయంతో.. ఆందోళనతో పలువురు తెలిసిన వారి ఇళ్లకు పయనమైతే.. మరికొందరు వర్షం పడ్డాక చూద్దామంటూ వెయిట్ చేశారు. ఇంకొందరు తమ వాహనాల్ని సురక్షిత ప్రాంతాలకు తీసుకెళ్లి పెట్టే ప్రయత్నం చేశారు. ఇంత హడావుడి మధ్య నిద్ర సంగతిని కొందరు మర్చిపోయారు. మరి.. ఐఎండీ.. జీహెచ్ఎంసీ ప్రకటన నేపథ్యంలో వర్షం పడిందా? అన్న విషయంలోకి వెళితే.. అందరూ ఫుల్ అలెర్టుగా ఉండటంతో వర్షం పడింది.కానీ.. తేలికపాటి నుంచి ఒక మోస్తరు స్థాయిలో వర్షం కురిసింది.

ఖైరతాబాద్ నుంచి అమీర్ పేట వరకు.. బేగంపేటలోని పలు ప్రాంతాలు.. ప్యారడైజ్.. బోయినిపల్లి.. కుత్భుల్లాపూర్.. జీడిమెట్ల.. బాలానగర్.. కొంపల్లి.. నాంపల్లి.. పాతబస్తీలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసాయి. పడిన వర్షానికి.. టీవీల్లో పడిన బ్రేకింగ్ న్యూస్ ల స్థాయికి సంబంధం లేకపోవటం గమనార్హం. ఏమైనా అర్థరాత్రి వేళ అలెర్టు నగర ప్రజలను హడావుడికి.. ఆందోళనకు గురి చేసిందని చెప్పక తప్పదు.
Tags:    

Similar News