ఖాకీల కనుసన్నల్లోకి 'జీహెచ్ఎంసీ'.. 52 వేల మందితో పటిష్ట భద్రత

Update: 2020-11-30 13:10 GMT
జీహెచ్ఎంసీ ఎన్నికకు సర్వం సిద్ధమైంది. మంగళవారం పోలింగ్ కు సంబంధించిన పూర్తి కార్యక్రమాలను అధికారులు పూర్తిచేశారు. గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి జీహెచ్ఎంసీ ఎన్నికలు హోరాహోరీగా జరుగుతున్నాయి. ముఖ్యంగా బీజేపీ, ఎమ్ ఐఎమ్ పార్టీల నాయకులు  సవాళ్లు ప్రతిసవాళ్లు విసురుకున్న నేపథ్యంలో పరిస్థితులు కొంచెం ఉద్రిక్తకరంగా మారాయి. దీంతో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నగరమంతటా  52, 500 మంది పోలీసులతో బందోబస్తు చేపడుతున్నారు.

జీహెచ్ఎంసీ పరిధిలో మొత్తం 74.44 లక్షల ఓటర్లు ఉండగా మొత్తం 1132 మంది అభ్యర్థులు జీహెచ్ఎంసీ ఎన్నికల బరిలోకి దిగారు. మొత్తం 150 వార్డుల్లో పోలింగ్ కు సంబంధించి అధికారులు  ఏర్పాట్లు పూర్తి చేశారు. మంగళవారం ఉదయం 5:30 గంటల నుంచి పోలింగ్ కేంద్రాల్లో అధికారులు అందుబాటులో ఉంటారు. ఉదయం ఏడు గంటలనుంచి పోలింగ్ మొదలై సాయంత్రం ఆరు గంటల సమయంలో ముగుస్తుంది.  ఓటరు గుర్తింపు కార్డు కానీ, ఎన్నికల సంఘం అనుమతించిన గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి చూపించి ఓటు వేయాలని అధికారులు తెలిపారు.

 సమస్యాత్మక ప్రాంతాల్లో మోహరించిన పోలీసులు

 పోలింగ్ సందర్భంగా గొడవలు జరిగే సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసులు మోహరించారు. ఏ ప్రాంతాల్లో గొడవలు జరిగే అవకాశం ఉంటుందో ముందే ఒక నిర్ధారణకు వచ్చారు. ఏ ప్రాంతాల్లో గొడవలు అధికంగా జరుగుతాయి, ఈ ప్రాంతాల్లో జరగడానికి అవకాశం ఉండదు.. వంటి అంశాలపై విభజన చేసి సమస్యాత్మక ప్రాంతాల్లో ఎక్కువ మంది పోలీసు సిబ్బందిని కేటాయించారు. ఆ మేరకు  ఆయా ప్రాంతాల్లో పోలీసులు బందోబస్తు చర్యలు చేపట్టారు. పాతబస్తీ ప్రాంతంలో గొడవలు చెలరేగే అవకాశం ఉండడంతో ఆ  ప్రాంతంలో ఖాకీలు మరింత నిఘా పెట్టారు.
Tags:    

Similar News