మరో ఆసక్తికరం.. కమలం ఖాతా తెరవక ముందే కాంగ్రెస్ బోణీ

Update: 2020-12-04 08:34 GMT
గ్రేటర్ ఎన్నికల్లో తుది ఫలితం ఎలా ఉన్నప్పటికి.. ఓట్ల లెక్కింపు సందర్భంగా ఆసక్తికర పరిణామాలకు కొదవ ఉండటం లేదు. పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో బీజేపీ అనూహ్యంగా అధిక్యతను ప్రదర్శించటం.. టీఆర్ఎస్ రెండో స్థానంలో నిలవటం షాకింగ్ గా మారింది. ప్రభుత్వ ఉద్యోగులు.. సీనియర్ సిటిజన్లలో ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉందన్నది నిజమే అయినా.. మరీ ఇంత ఎక్కువా? అన్న సందేహం కలిగేలా ఫలితాలు ఉన్నాయని చెప్పాలి.

బీజేపీ నేతలు సైతం ఊహించని రీతిలో పోస్టల్ బ్యాలెట్ ఫలితాలు ఉన్నాయని చెప్పాలి. కాకుంటే.. 74 లక్షల మంది ఓటర్ల తీర్పును పక్కన పెట్టి.. కేవలం 1900 మంది వేసిన పోస్టల్ ఓట్లకు మరీ అంత ప్రాధాన్యతను ఇవ్వాల్సిన అవసరం లేదన్న విరుపు పలువురు గులాబీనేతల మాటల్లో వినిపించింది. పోస్టల్ బ్యాలెట్ తోనే తుది ఫలితం ఫైనల్ కాకున్నా.. ప్రజల మూడ్ ఎలా ఉందన్న విషయాన్ని తెలియజేసేలా ఉందని చెప్పాలి.

గ్రేటర్ ఓట్ల లెక్కింపు సందర్భంగా పలు ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పోస్టల్ బ్యాలెట్ లో వచ్చిన తీర్పు బీజేపీని సంతోషంలో ముంచెత్తితే.. గ్రేటర్లో తొలి డివిజన్ ను గెలుచుకున్న సంతోషం మజ్లిస్ కు లభించింది. మెహదీపట్నం డివిజన్ లో ఎంఐఎం అభ్యర్థి గెలుపొందారు. ఇదిలా ఉంటే.. ఎగ్జిట్ పోల్స్ తో పోలిస్తే.. బీజేపీ ఎక్కువ డివిజన్లలో గెలిచే వీలుందన్న విషయాన్ని తాజాగా వెలువడుతున్న ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. ముందుగా అంచనా వేసుకున్న దాని కంటే ఎక్కువ డివిజన్లు బీజేపీ ఖాతాలో పడతాయన్నట్లుగా ఉంది.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మీద పెద్దగా అంచనాలే లేవు. అందుకు భిన్నంగా ఆ పార్టీ తన తొలి బోణీ  కొట్టింది. ఏఎస్ రావు నగర్ డివిజన్ లో కాంగ్రెస్ అభ్యర్థి సింగిరెడ్డి శిరీషా రెడ్డి విజయం సాధించారు. దీంతో.. ఇప్పటివరకు తమ ఉనికి చాటుకోలేదన్న బాధ కాంగ్రెస్ కు తీరింది. కాంగ్రెస్ బోణీ కొట్టిన సమయానికి బీజేపీ అధికారికంగా విజయం ఖరారు కాలేదు. ఈ రకంగా చూస్తే.. కాంగ్రెస్ నేతలు అంతోఇంతో సంతోషానికి గురయ్యారని చెప్పాలి. మొత్తంగా చూస్తే.. గ్రేటర్ ఎన్నికల ఫలితాలు ఆద్యంతం ఆసక్తికరంగా ఉన్నాయని చెప్పక తప్పదు.
Tags:    

Similar News