గన్నవరం గాలి మారుతోందా?

Update: 2023-03-25 05:00 GMT
టీడీపీ కంచుకోటల్లో గన్నవరం ఒకటి. 1982లో టీడీపీ ఏర్పాటయ్యాక ఒక్క 1989 ఎన్నికల్లో మాత్రమే ఇక్కడ ఓడిపోయింది. 2004లో కాంగ్రెస్‌ గాలి వీచినప్పుడు, 2019లో వైసీపీ ప్రభంజనంలోనూ గన్నవరంలో టీడీపీనే విజయబావుటా ఎగురవేసింది. అయితే గత ఎన్నికల్లో గన్నవరంలో టీడీపీ తరఫున గెలుపొందిన వల్లభనేని వంశీ ఆ తర్వాత కొద్ది కాలానికే వైసీపీతో అంటకాగుతూ వస్తున్నారు.

ఈ క్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్‌ లపై వంశీ చేసిన వ్యక్తిగత విమర్శలు కాకరేపాయి. వంశీ తల తెచ్చినవారికి రూ.50 లక్షలు ఇస్తానని ఖమ్మం జిల్లా టీడీపీ నేత ప్రకటించే స్థాయికి వంశీ విమర్శలు వెళ్లాయి. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో వల్లభనేని వంశీ టీడీపీ మొదటి టార్గెట్‌ గా మారారని అంటున్నారు.

గన్నవరం నియోజకవర్గంలో కమ్మ ఓటర్ల సంఖ్య ఎక్కువ. 55 వేల మంది ఓటర్లు కమ్మ సామాజికవర్గానికి చెందినవారే ఉన్నారు. కమ్మ ఓటర్ల తర్వాత యాదవుల ఓట్లు 38 వేల వరకు ఉన్నాయని సమాచారం. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో కమ్మ ఓట్లన్నీ టీడీపీకే పడే చాన్సు ఉందని చెబుతున్నారు. మరోవైపు యాదవుల ఓట్లను ఆకట్టుకోవడానికి బచ్చుల అర్జునుడిని గన్నవరం ఇంచార్జిగా టీడీపీ అధిష్టానం నియమించింది. అయితే ఆయన గుండెపోటుతో ఇటీవల కన్నుమూశారు.

ఈ నేపథ్యంలో టీడీపీ అధికార ప్రతినిధిగా ఉన్న కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌ గన్నవరం నుంచి పోటీ చేయొచ్చని ప్రచారం జరుగుతోంది. లేదా ఎన్నికల నాటికి కొత్త అభ్యర్థి ఎవరైనా రావచ్చని అంటున్నారు. మరోవైపు వల్లభనేని వంశీ గన్నవరం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేయనున్నారు. ఈ మేరకు ఇప్పటికే ఆయనకు వైసీపీ అధినేత జగన్‌ భరోసా ఇచ్చారు.

అయితే వంశీని వైసీపీ అభ్యర్థిగా ప్రకటించడాన్ని వైసీపీ నేతలు యార్లగడ్డ వెంకట్రావు, దుట్టా రామచంద్రరావు వ్యతిరేకిస్తున్నారు. యార్లగడ్డ వెంకట్రావు గత ఎన్నికల్లో వల్లభనేని వంశీపై వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. మరోవైపు దుట్టా రామచంద్రరావు వైసీపీ పొలిటికల్‌ అడ్వయిజరీ కమిటీ సభ్యుడిగా ఉన్నారు. దివంగత సీఎం వైఎస్సార్‌ కు స్నేహితుడు కూడా. ఈ నేపథ్యంలో యార్లగడ్డ వెంకట్రావు, దుట్టా రామచంద్రరావు వర్గాలు బహిరంగంగానే వంశీని వ్యతిరేకిస్తున్నాయి.

మరోవైపు చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్‌ పై వంశీ చేసిన అసభ్య వ్యాఖ్యల ప్రభావంతో కమ్మ సామాజికవర్గం వంశీకి దూరమైందని అంటున్నారు. కమ్మల తర్వాత అత్యధిక సంఖ్యలో ఉన్న యాదవులు కూడా వంశీ వ్యవహార శైలి పట్ల అసంతృప్తితో ఉన్నారని అంటున్నారు. ఈ నేపథ్యంలో వంశీ గెలుపొందడం ఈసారి నల్లేరుపై నడక కాదని అంటున్నారు.

Similar News