కేసీఆర్ ను అంత మాటా అనేసిన ‘గాలి’

Update: 2016-10-31 15:47 GMT
కొంతమంది అధినేతల్ని ఏ మాట పడితే ఆ మాట అనలేని పరిస్థితి ఉంటుంది. అదే సమయంలో.. కొందరు నేతలు మాత్రం ఇందుకు మినహాయింపుగా ఉంటారు. అలాంటి నేతల్లో టీడీపీ సీనియర్ నేత గాలి ముద్దుకృష్ణమ నాయుడు ఒకరు. ఆయన కానీ నోరు విప్పారంటే.. ఆయన మాటలు ఎక్కడి వరకూ వెళతాయో తెలీని పరిస్థితి.

సూటిగా.. ప్రత్యర్థులకు మంట పుట్టేలా మాట్లాడటంలో ఆయనకు ఆయనే సాటి. ఏపీ అధికార పక్షానికి ప్రాతినిధ్యం వహించే గాలి ముద్దుకృష్ణమ ఇటీవల కాలంలో తెలంగాణరాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఒంటి కాలిపై లేస్తున్నారు. తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలు సైతం తొందరపడి ఒక మాట అనలేని వైనానికి భిన్నంగా ముద్దుకృష్ణమ విరుచుకుపడుతున్న తీరు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

తాజాగా.. ఆయన తనదైన శైలిలో తెలంగాణ ముఖ్యమంత్రిపై విరుచుకుపడ్డారు. ఇటీవల వీడీపీ అసోసియేషన్స్ సంస్థ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి దేశంలోనే అత్యంత ప్రజాదరణ ఉన్న ముఖ్యమంత్రిగా తమ సర్వేలో వెల్లడైన విషయాన్ని ప్రకటిస్తూ.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్థానాన్ని ఏడుకు పరిమితం చేయటం తెలిసిందే.ఈ వ్యవహారాన్ని ప్రస్తావించిన గాలి.. ఫాంహౌస్ లో పడుకున్న కేసీఆర్ కు మొదటి ర్యాంకు రావటం విడ్డూరంగా ఉందంటూ ఆయన విరుచుకుపడ్డారు. తమ ముఖ్యమంత్రి అద్భుతంగా పని చేస్తున్న విషయాన్ని ప్రధాని మోడీ చేసిన మాటను గుర్తు చేసుకున్న గాలి.. చంద్రబాబు వీరత్వాన్ని విపరీతంగా పొగిడేశారు.
Read more!

బ్రిటీషోళ్లు సికింద్రాబాద్ ను నిర్మిస్తే.. చంద్రబాబు హైటెక్ సిటీని డెవలప్ చేసిన విషయాన్ని చెప్పటంతో పాటు.. హైదరాబాద్ ఆదాయాన్ని60 శాతం పెంచినట్లుగా గాలి పేర్కొన్నారు. హైదరాబాద్ మీద చంద్రబాబుకు హక్కు ఉందన్న ఆయన.. తన మాటలతో తెలంగాణ అధికారపక్షం చేత తమ అధినేతను తిట్టించే ప్రోగ్రాంను గాలి తన తాజా వ్యాఖ్యలతో అవకాశం ఇచ్చినట్లుగా రాజకీయ వర్గాల్లో అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఏమైనా.. ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఉద్దేశించి ఎంత మాట పడితే అంత మాటను అనే సత్తా మాత్రం గాలికే సొంతమన్న మాటలో నిజం ఉందని చెప్పక తప్పదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News