ఏపీ మహిళలకు వరం ఈ నెంబరు.. 7837018555

Update: 2020-11-02 07:30 GMT
రూ.వందల కోట్లు ఖర్చు ఉండదు. కానీ.. వేలాది మంది అభయంగా మారేందుకు చిన్న ఆలోచన చాలు. అలాంటి  వాటి విషయంలో మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే.. ఏపీ స్టేట్ ముందంజలో ఉందని చెప్పాలి. వినూత్నంగా ఆలోచిస్తూ సరికొత్త సదుపాయాల్ని ప్రజలకు చేరువ చేయటంలో జగన్ సర్కారు చురుగ్గా వ్యవహరిస్తోంది. తాజాగా అలాంటి కార్యక్రమాన్ని తెర మీదకు తీసుకొచ్చారు.

కారణం ఏమైనా కానీ రాత్రి వేళలో ఒంటరిగా ప్రయాణించాల్సిన పరిస్థితుల్లో రక్షణ పెద్ద సమస్యగా మారింది. ఇలాంటి వాటికి చెక్ పెట్టేలా జగన్ ప్రభుత్వం సరికొత్త పథకాన్ని ప్రకటించారు. ఏపీలోని పోలీసులు రాత్రి 10 గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకు వాహన సౌకర్యం లేని మహిళల్ని.. వారు కోరుకున్న చోట ఉచితంగా దింపుతారు. ఏపీ వ్యాప్తంగా ఈ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకురానున్నారు.

రాత్రి వేళ ఒంటరిగా ఇంటికి వెళ్లటం కష్టమైన వారికి ఈ సదుపాయం వరంగా మారుతుందనటంలో సందేహం లేదు. దీనికోసం చేయాల్సింది ఒక్కటే. పోలీసు హెల్ప్ లైన్ నెంబరు 1091 కానీ.. 7837018555 నెంబరుకు కానీ ఫోన్ చేస్తే.. వారి సమీపంలోని కంట్రోల్ రూమ్ కు సమాచారం అందిస్తారు. అక్కడి పోలీసులు స్పందించి.. వాహనంతో పాటు స్పాట్ వద్దకు వెళ్లి.. సదరు మహిళలు వెళ్లాల్సిన చోటుకు ఉచితంగా తీసుకెళతారు. ఆడబడుచుల రక్షణ కోసం జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ సదుపాయాన్ని తెలంగాణ రాష్ట్రం కోసం అమలు చేస్తే బాగుంటుంది.
Tags:    

Similar News