హైదరాబాద్ కు బైక్ మీద వస్తూ మాజీ ఎమ్మెల్యే కొడుకు మృతి

Update: 2020-11-04 05:30 GMT
చావు రాసి పెట్టి ఉంటే ఎవరూ ఆపలేరేమో. తాజా ఉదంతం చూస్తే.. ఇది నిజమనిపించక మానదు. రోడ్డు ప్రమాదంలో మాజీ ఎమ్మెల్యే కుమారుడు మరణించిన వైనం చూస్తే.. ఈ భావన కలుగక మానదు. గుంటూరు మాజీ ఎమ్మెల్యే హసన్ అలీ కుమారుడు 22 ఏళ్ల షేక్ షారుఖ్ తాజాగా రోడ్డు ప్రమాదంలో మరణించారు. గుంటూరు నుంచి హైదరాబాద్ కు స్నేహితుడితో కలిసి బైక్ మీద వస్తున్నారు.

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం ధర్మోజి గూడెం వద్ద మంగళవారం రాత్రి చోటు చేసుకున్న ప్రమాదంలో మరణించారు. హైదరాబాద్ కు బైక్ మీద వస్తున్న వారు.. చలి తీవ్రంగా ఉండటంతో స్వెట్టర్ వేసుకునేందుకు ధర్మోజీ క్రాస్ రోడ్ వద్ద బైక్ ను ఆపారు. హైవే పక్కన బైక్ ఆపిన వారు స్వెట్టర్ వేసుకుంటున్నారు.

ఈ సమయంలో చౌటుప్పల్ నుంచి హైదరాబాద్ కు వెళుతున్న కారు అతి వేగంగా వచ్చి వీరిని ఢీ కొట్టింది. విషాదకరమైన విషయం ఏమంటే.. బైక్ మీద కూర్చొని ఉన్న షారుక్ అక్కడికక్కడే మరణించగా.. స్వెట్టర్ వేసుకునేందుకు కిందకు దిగిన అతడి స్నేహితుడికి మాత్రం ఎలాంటి గాయం కాలేదు.

మృతదేహానికి పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మాజీ ఎమ్మెల్యే కుమారుడై ఉండి బైక్ మీద హైదరాబాద్ కు రావాలనుకోవటం ఏమిటి? చలి ఉందని స్వెట్టర్ వేసుకునేందుకు కూడా వచ్చిన స్నేహితుడు కిందకు దిగితే.. వెనుక నుంచి కారు వచ్చి బైక్ ను ఢీ కొట్టటం.. ఆ వెంటనే మరణించటం చూస్తే.. అయ్యో అనిపించక మానదు.
Tags:    

Similar News