హర్మూజ్ జలసంధిలో ‘డిజిటల్’ బాంబు.. ఇరాన్ తదుపరి టార్గెట్ డేటా కేబుల్స్..?
ఒకప్పుడు యుద్ధాలు కేవలం సరిహద్దుల్లో ఆయుధాలతో జరిగేవి.. కానీ ఇప్పుడు 'డిజిటల్' రూపం సంతరించుకున్నాయి.;
ఒకప్పుడు యుద్ధాలు కేవలం సరిహద్దుల్లో ఆయుధాలతో జరిగేవి.. కానీ ఇప్పుడు 'డిజిటల్' రూపం సంతరించుకున్నాయి. చమురు సరఫరా అడ్డుకోవడం ద్వారా ప్రపంచాన్ని వణికించిన ఇరాన్, ఇప్పుడు ‘సముద్రగర్భ డేటా కేబుల్స్’పై దృష్టి సారించిందన్న వార్త ఆధునిక ప్రపంచానికి వెన్నులో వణుకు పుట్టిస్తోంది. చమురు లేకపోతే బండ్లు ఆగుతాయి, కానీ డేటా లేకపోతే దేశాలే ఆగిపోతాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ఫిజికల్ వార్ నుంచి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వార్‌గా మారుతుంది. హర్మూజ్ జలసంధి కేవలం నౌకలు వెళ్లే దారి మాత్రమే కాదు, అది ప్రపంచాన్ని కలిపే డిజిటల్ హైవే కూడా. ఇరాన్ మీడియా నుంచి అందుతున్న సంకేతాల ప్రకారం.., అమెరికా, ఇజ్రాయెల్ దేశాలను దెబ్బతీయడానికి ఇరాన్ ఇప్పుడు ‘సముద్రగర్భ కేబుల్స్’ను ఆయుధంగా వాడుకోవాలని చూస్తోంది. ఇది జరిగితే, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఊహించని విపత్తును ఎదుర్కోవాల్సి ఉంటుంది.
డిజిటల్ ధమని
మనకు ఇంటర్నెట్ శాటిలైట్ల ద్వారా వస్తుందని చాలా మంది అనుకుంటారు. కానీ వాస్తవానికి 95 శాతానికి పైగా అంతర్జాతీయ డేటా ట్రాఫిక్ సముద్రం అడుగున ఉండే కేబుల్స్ ద్వారానే సాగుతుంది. గల్ఫ్ దేశాలను యూరప్, ఆసియాతో కలిపే అనేక ప్రధాన కేబుల్ వ్యవస్థలు హర్మూజ్ జలసంధి గుండా వెళ్తాయి. అంతర్జాతీయ బ్యాంకింగ్ లావాదేవీలు, క్లౌడ్ డేటా స్టోరేజ్, గ్లోబల్ స్టాక్ మార్కెట్లు, ప్రభుత్వాల మధ్య కమ్యూనికేషన్ అంతా ఈ కేబుల్స్ పైనే ఆధారపడి ఉంటుంది.
అసలు వ్యూహం ఇదేనా?
చమురు ట్యాంకర్లను అడ్డుకోవడం వల్ల ఇరాన్ ఇప్పటికే ప్రపంచ దేశాల ఆగ్రహానికి గురైంది. ఇప్పుడు డేటా కేబుల్స్ ను లక్ష్యంగా చేసుకోవడం ద్వారా మరింత ఒత్తిడి తీసుకురావాలని చూస్తోంది. ఈ కేబుల్స్ సముద్రం అడుగున కొన్ని అడుగుల లోతులో ఉంటాయి. ఒక చిన్న లంగరు ద్వారా లేదా ఉద్దేశపూర్వకంగా సబ్‌మెరైన్లతో వీటిని కట్ చేయడం చాలా సులభం. ప్రధాన కేబుల్స్ దెబ్బతింటే, పెర్షియన్ గల్ఫ్ దేశాల్లో ఇంటర్నెట్ పూర్తిగా స్తంభించిపోతుంది. బ్యాంకింగ్ సర్వీసులు ఆగిపోయి, ప్రజలు నగదు విత్‌డ్రా చేసుకోలేక, ఆన్‌లైన్ పేమెంట్స్ చేయలేక గందరగోళం నెలకొంటుంది.
ఇరాన్ గనుక ఈ డేటా యుద్ధానికి దిగితే, అది కేవలం అమెరికా-ఇజ్రాయెల్ దేశాలనే కాదు, మొత్తం ప్రపంచాన్ని ప్రభావితం చేస్తుంది. ఆధునిక ప్రపంచం ఎంతగా టెక్నాలజీపై ఆధారపడి ఉందో, ఆ టెక్నాలజీ ఎంత సులభంగా దెబ్బతినవచ్చో ఈ పరిణామం హెచ్చరిస్తోంది. చమురు సరఫరాను పునరుద్ధరించడానికి ఆరు నెలలు పడుతుందని పెంటగాన్ చెబుతున్న తరుణంలో.. డేటా కేబుల్స్ కు నష్టం జరిగితే పరిస్థితి ఎంత భయంకరంగా ఉంటుందో ఊహించుకోవడమే కష్టం.