బీజేపీకి ఏమైంది? పార్టీ అగ్రనేతలంతా వెళ్లిపోతున్నారే?

Update: 2019-08-25 04:51 GMT
కేవలం ఏడాది వ్యవధిలో ఒక పార్టీకి చెందిన అగ్రనేతలు శాశ్వితంగా వీడిపోవటం అనూహ్యమే కాదు.. తీరని లోటు కూడా. ఒక రాజకీయ పార్టీకి అగ్రనేతలు చాలా కీలకం. ఒక అగ్రనేత తయారు కావాలంటే అందుకు ఏళ్లకు ఏళ్లు పడుతుంది. అందునా.. సిద్ధాంతాలతో పాటు.. నీతి నిజాయితీకి నిలువుటద్దంలా నిలిచే నేతల కొరతను ఎవరూ తీర్చలేరు.

మాజీ ప్రధాని వాజ్ పేయ్ లాంటి నేతను సమీప భవిష్యత్తులో భారత్ చూడగలదా?  ఆయనంటే పాతకాలపు నేత అనుకుందాం. దివంగత గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారీకర్ సంగతే చూద్దాం. అలాంటి ఆదర్శాలు ఉన్న ముఖ్యనేతను రాజకీయాల్లో కనిపించాలంటే ఇంకెన్నాళ్లు పడుతుందో కదా?  ఇలా చూసినప్పుడు.. గడిచిన ఏడాదిలో అధికార బీజేపీ ఐదుగురు అగ్రనేతల్ని కోల్పోవటం చూసినప్పుడు.. ప్రజలతో పాటు.. ఆ పార్టీ తీవ్రమైన నష్టం కలిగిందని చెప్పక తప్పదు.

బీజేపీ మూలస్తంభాల్లో ఒకరైన మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయ్ నిష్క్రమణను కొంతమేర అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే.. సుదీర్ఘ కాలంగా అనారోగ్యంతో ఉండి.. మంచానికే పరిమితం కావటమే కాదు.. ఎవరిని గుర్తించలేని పరిస్థితుల్లో ఆయన వెళ్లిపోవటాన్ని జీర్ణించుకోవచ్చు. ఆయన మరణం గత ఏడాది ఆగస్టు 16న చోటు చేసుకుంది. ఆయన తర్వాత నుంచి కేవలం పన్నెండు నెలల వ్యవధిలో మరో నలుగురు ముఖ్యనేతలు వెళ్లిపోవటం కమలం పార్టీకి తీరని లోటుగా చెప్పక తప్పదు.

వాజ్ పేయ్ మరణం తర్వాత.. సరిగ్గా మూడు రోజుల తక్కువ మూడు నెలల్లో కేంద్రమాజీ మంత్రి అనంత్ కుమార్ తుదిశ్వాస విడిచారు. అనంతకుమార్ మరణం తర్వాత కాస్త అటుఇటుగా ఐదు నెలల వ్యవధిలో గోవా ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న మనోహర్ పారీకర్ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. నీతికి.. నిజాయితీకి నిలువెత్తు రూపంగా నిలిచిన ఆయన నిష్క్రమణం దేశ ప్రజల్ని ఆవేదనకు గురి చేసింది.

మనోహర్ పారీకర్ తర్వాత కేవలం నాలుగున్నర నెలల వ్యవధిలో అనూహ్యంగా..ఎవరో పిలుస్తుంటే పరుగులు తీసినట్లుగా  వెళ్లిపోయారు మాజీ కేంద్రమంత్రి సుష్మా స్వరాజ్. ఆమె మరణం అనూహ్యం. అంతకు మించి జీర్ణించుకోలేనిది. ఆమె మరణించి మూడు వారాలు కాక ముందే బీజేపీ వ్యూహకర్తల్లో ఒకరు.. పార్టీ థింక్ టాక్ లో ముఖ్యమైన వారిలో ఒకరైన మాజీ కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ అనారోగ్యంతో తుదిశ్వాస విడవటం సాకింగ్ గా మారింది. ఇలా కేవలం ఏడాది వ్యవధిలో ఐదుగురు ముఖ్యనేతల్ని కోల్పోయిన కమలం పార్టీ కాస్త కళ తప్పినట్లుగా చెప్పక తప్పదు.  
Tags:    

Similar News