రాత్రి బైకులు ఆపి ఫింగర్ ప్రింట్ టెస్టులు.. షాకిచ్చిన పోలీసులు

Update: 2022-09-25 16:31 GMT
బయటకు వెళ్లాలంటేనే నిబంధనల పేరిట పోలీసులు భయపెడుతున్నారు. హెల్మెట్ నుంచి లైసెన్స్ ల వరకూ రాంగ్ డ్రైవ్ లంటూ ఫైన్ లు వేస్తూనే ఉంటారు. చలాన్లు కట్టలేక జనాలు బెంబేలెత్తిపోతున్న రోజులు ఇవీ.. ఇక ఇవి చాలవన్నట్టు రాత్రి పూట మరో తనిఖీలకు పోలీసులు తెరలేపారు. అయితే ఇవి దొంగతనాలను అరికట్టడానికే కావడం విశేషం.

సిలికాన్ సిటీ బెంగళూరులో రాత్రి సమయంలో చోరీలకు తెగబడే దొంగలకు అడ్డుకట్ట వేయడానికి నగర పోలీసులు కొత్త పథకం రూపొందించారు. రాత్రి సమయంలో గస్తీలు, వాహనాల తనిఖీల సమయంలో అనుమానితులు, వాహనదారుల వేలిముద్రలు, వాహనాల నంబర్లు పరిశీలనకు నాంది పలికారు.

ఇందులో నేరపూరిత చరిత్ర ఉంటే అక్కడే వాహనాలను లాక్ చేస్తారు. వాహన సమాచారం కూడా డేటా బేస్ లో వస్తుంది కాబట్టి దొంగ వాహనమైతే సీజ్ చేస్తారు. తద్వారా రాత్రి వేళల్లో దొంగతనాలకు, అసాంఘిక శక్తులకు అడ్డుకట్ట పడుతుందని పోలీసులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.

ఈ క్రమంలోనే పోలీసులు గస్తీ, నాకాబందీ సమయాల్లో జనం వేలిముద్రలు తమ మొబైల్ ఫోన్లో సీసీటీఎన్ఎస్ అప్లికేషన్ లో పరిశీలిస్తారు. సాధారణ పౌరులైతే వదిలేస్తారు. నేరాల్లో భాగస్వామి అయితేనే అతడిపై నమోదైన కేసుల వివరాలు తెలుస్తాయి. తద్వారా అదుపులోకి తీసుకొని విచారణ చేపడుతారు. సరైన కారణాలు లేకపోతే తగిన చర్యలు తీసుకొని అరెస్ట్ చేస్తారు. వాహనం నంబర్ ను బట్టి నేరాలకు ఉపయోగిస్తున్నారా? సొంతదా? అన్నది తేలుతుంది కాబట్టి నేరాలను మొదటే అడ్డుకట్ట వేయడానికి ఈ ప్రయత్నం ఉపయోగపడనుంది.

కర్ణాటకలో  ఇందుకోసం ప్రత్యేకంగా ప్రతీ పోలీస్ స్టేషన్ సీఐ, ఎస్ఐలకు శిక్షణ అందించి ఉపకరణాలు అందజేశారు. నిత్యం తలా 20 మందిని తనిఖీ చేయడం తప్పనిసరి. దశలవారీగా నగరవ్యాప్తంగా విస్తరిస్తారు. పోలీసులు ప్రజలు వేలిముద్రలు తీసుకుంటే వ్యక్తిగత సమాచారం చోరీకి గురి అవుతుందనే భయం వద్దని.. కేవలం వేలిముద్రలు స్కాన్ అవుతాయని.. రహస్య సమాచారం సేకరణ జరగదని పోలీసులు భరోసానిస్తున్నారు. రాత్రి సమయాల్లో దొంగలు, నేరచరిత్రలను కనిపెట్టి జరగబోయే నేరాలను అడ్డుకోవచ్చని.. ప్రజలు సహకరించాలని కోరుతున్నారు.
Tags:    

Similar News