సరిహద్దుల వద్ద ఉగ్రవాదులతో భీకర పోరు.. మనోళ్ల వీరమరణం

Update: 2020-11-09 07:30 GMT
ఉగ్రవాదులు.. భద్రతా బలగాల మధ్య సాగిన భీకర పోరులో నలుగురు సైనికులు వీర మరణం చెందారు. ఉత్తర కశ్మీర్ లోని వాస్తవాధీన రేఖకు సమీపంలోని మచిల్ సెక్టార్ లో అనుమానస్పద కదలికల్ని గుర్తించిన పెట్రోలింగ్ బలగాలు నిఘాను మరింతగా పెంచాయి. ఈ క్రమంలో శనివారం అర్థరాత్రి వేళ.. భద్రతా బలగాలపై ముష్కర మూక కాల్పుల్ని జరిపింది. దీన్ని తిప్పి కొట్టే ప్రయత్నం చేశారు మన జవానులు.

దాదాపు మూడు గంటల పాటు సాగిన భీకర పోరులో ఒకఉగ్రవాదితో పాటు.. బీఎస్ఎఫ్ కు చెందిన కానిస్టేబుల్ ఒకరు మరణించారు. ఇదే ప్రాంతంలో ఆదివారం ఉదయం మరోసారి ఉగ్రవాదులు చొరబాట్లకు ప్రయత్నించటంతో.. సైన్యానికి.. ఉగ్రవాదులకు మధ్య మరోసారి పోరు నెలకొంది. ఈ సందర్భంగా చోటుచేసుకున్న కాల్పుల్లో ఇద్దరు సైనికులతో పాటు.. ఒక ఆర్మీ అధికారి వీర మరణం చెందగా.. ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు.

ఈ ఉదంతంలో రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇద్దరు వీర జవానులు తమ ప్రాణాల్ని పణంగా పెట్టారు.వారిలో ఒకరు ఏపీకి చెందిన చిత్తూరు జిల్లా ఐరాలపంచాయితీకి చెందిన ప్రవీణ్ కుమార్ రెడ్డి కాగా.. మరొకరు తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాకు చెందిన మహేశ్. వీరిద్దరి మరణం తెలుగు రాష్ట్రాల్లో విషాదాన్ని నింపింది. ప్రవీణ్ కుమార్ రెడ్డి విషయానికి వస్తే.. పద్దెనిమిదేళ్ల క్రితం మద్రాస్ రెజిమెంట్ లో సైనికుడిగా పని చేస్తున్నారు. హవల్దార్ గా పని చేస్తూ.. కమాండో శిక్షణ తీసుకున్నారు. ప్రస్తుతం కశ్మీర్ లో విధులు నిర్వహిస్తున్న ఆయనకు భార్య.. కుమారుడు.. కుమార్తె ఉన్నారు. ఆయన భౌతికకకాయాన్ని స్వగ్రామానికి పంపుతున్నారు.  

తెలంగాణ రాష్ట్రానికి చెందిన మహేశ్ విషయానికి వస్తే.. నిజామాబాద్ జిల్లా వేల్పూరు మండలం కోమన్ పల్లికి చెందిన వాడు. 2015లో ఆర్మీ జవానుగా విధుల్లో చేరిన అతడు.. ఏడు నుంచి పదో తరగతి వరకు వేల్పూరు లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదివారు. ఏడాది క్రితమే సుహాసిని అనే అమ్మాయిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. అప్పట్లో ఇంటికి వచ్చి నెల రోజులు వచ్చిన ఉన్న మహేశ్.. తాజాగా మరణించారన్న వార్త.. గ్రామంలో విషాదం నెలకొనేలా చేసింది.  
Tags:    

Similar News