వృద్ధుల భయం.. మోసగాళ్ల పెట్టుబడి.. $1,00,000 బంగారం కాజేసిన తెలుగు విద్యార్థి..
సాన్ ఆంటోనియోలో విద్యార్థి వీసాపై నివసిస్తున్న వెంకటేశ్వర చగంరెడ్డి తన సహచరులతో కలిసి ఒక వ్యవస్థీకృత నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసుకున్నాడు.;
అమెరికాలో ఉన్నత చదువుల కోసం వెళ్లి అడ్డదారిలో అపారమైన ధనాన్ని సంపాదించాలనే దురాశతో ఓ తెలుగు విద్యార్థి చేసిన ఘోర మోసం వెలుగులోకి వచ్చింది. టెక్ సపోర్ట్ నెపంతో వృద్ధులను లక్ష్యంగా చేసుకుని లక్షలాది డాలర్ల విలువైన బంగారాన్ని కాజేసిన ఈ ఘటనలో నిందితుడైన వెంకటేశ్వర చగంరెడ్డిని అమెరికా ఫెడరల్ కోర్టు దోషిగా నిర్ధారిస్తూ సంచలన తీర్పునిచ్చింది. అమెరికాలో పెరుగుతున్న ఈ 'గోల్డ్ స్కామ్' కలకలం రేపుతోంది.
టెక్ సపోర్ట్ నుంచి ట్రెజరీ డిపాజిట్ వరకు..
సాన్ ఆంటోనియోలో విద్యార్థి వీసాపై నివసిస్తున్న వెంకటేశ్వర చగంరెడ్డి తన సహచరులతో కలిసి ఒక వ్యవస్థీకృత నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసుకున్నాడు. వీరి ప్రధాన లక్ష్యం సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన తక్కువగా ఉండే వృద్ధులే. ఓ వృద్ధుడు తన కంప్యూటర్‌లో ఎదురైన సాంకేతిక సమస్య కోసం ఇంటర్నెట్‌లో దొరికిన ఒక నంబర్‌కు కాల్ చేయగా స్కామర్లు రంగంలోకి దిగారు. బాధితుడి కంప్యూటర్‌లో అశ్లీల చిత్రాలు లేదా నేరపూరిత కార్యకలాపాలు జరుగుతున్నాయని దీనివల్ల అతను జైలుకు వెళ్లాల్సి ఉంటుందని భయపెట్టారు. సమస్య నుంచి గట్టెక్కేందుకు ఒక "ఫెడరల్ ఏజెంట్" మీకు సహాయం చేస్తాడని నమ్మబలికారు. కొద్దిసేపటికే మరో వ్యక్తి ఫోన్ చేసి తను ప్రభుత్వ అధికారినని చెబుతూ ఒక నకిలీ ఐడీ కార్డును కూడా చూపించాడు. బాధితుడి బ్యాంక్ ఖాతా సురక్షితం కాదని, అందులోని నగదును వెంటనే బంగారంగా మార్చి ప్రభుత్వ ట్రెజరీ విభాగంలో భద్రపరచాలని సూచించారు. దీన్ని నమ్మిన వృద్ధుడు భారీ మొత్తంలో బంగారాన్ని కొనుగోలు చేశాడు. సరిగ్గా ఇక్కడే చగంరెడ్డి పాత్ర మొదలైంది. ప్రభుత్వ ప్రతినిధిగా నటిస్తూ బాధితుడి ఇంటికి నేరుగా వెళ్లి ఆ బంగారాన్ని సేకరించి అక్కడి నుంచి పరారయ్యాడు.
బయటపడ్డ మరిన్ని నేరాలు
మొదటిసారి విజయం సాధించడంతో నిందితులు రెండోసారి కూడా అదే బాధితుడిని సంప్రదించి మరికొంత బంగారం సిద్ధం చేయాలని ఒత్తిడి తెచ్చారు. అయితే అనుమానం వచ్చిన బాధితుడు తన కుటుంబ సభ్యులకు విషయం చెప్పడంతో వారు పోలీసులను ఆశ్రయించారు. గత ఏడాది ఆగస్టులో పక్కా ప్లాన్‌తో పోలీసులు చగంరెడ్డిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
విచారణలో దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఓక్లహోమాలో ఈ మోసానికి పాల్పడటానికి ముందే కెన్సాస్ రాష్ట్రంలో ఒక 75 ఏళ్ల వృద్ధురాలిని కూడా ఇదే పద్ధతిలో మోసం చేసి ఆమె వద్ద నుంచి భారీగా బంగారాన్ని కాజేసినట్లు అధికారులు గుర్తించారు. నిందితుడి వద్ద నుంచి సుమారు $100,000 (సుమారు 80 లక్షల రూపాయలకు పైగా) విలువైన బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన అమెరికాలో ప్రవాస భారతీయులను, ముఖ్యంగా విద్యార్థి లోకాన్ని విస్మయానికి గురిచేసింది. ఫెడరల్ అధికారులు ఈ సందర్భంగా ప్రజలకు కొన్ని కీలక సూచనలు చేశారు. ఏ ప్రభుత్వ అధికారి కూడా నగదును బంగారంగా మార్చమని లేదా వ్యక్తిగతంగా వచ్చి డబ్బులు తీసుకెళ్తామని చెప్పరు. కంప్యూటర్ స్క్రీన్‌పై వచ్చే పాప్-అప్ నంబర్లకు కాల్ చేయవద్దు. అపరిచిత వ్యక్తులకు తమ ఇంటి చిరునామాను లేదా బ్యాంకింగ్ వివరాలను పంచుకోవద్దు.
వెంకటేశ్వర చగంరెడ్డిపై మోసం.. కుట్ర పూరిత నేరాల కింద ఫెడరల్ కోర్టు తీర్పు వెలువరించింది. ఈ కేసులో అతనికి భారీ జరిమానాతో పాటు సుదీర్ఘ కాలం జైలు శిక్ష పడే అవకాశం ఉంది. చదువుకోవడానికి వెళ్లి నేరాల బాట పట్టిన విద్యార్థుల వల్ల దేశానికి సమాజానికి మాయని మచ్చ వస్తుందని విశ్లేషకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ తీర్పు ఇతర మోసగాళ్లకు ఒక గట్టి హెచ్చరికగా నిలుస్తుందని న్యాయ నిపుణులు భావిస్తున్నారు.