అమెరికా–ఇరాన్ మధ్య చర్చల ప్రతిష్టంభన.. కాల్పుల విరమణ పొడిగించిన ట్రంప్
మరోవైపు ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బఘాయీ అమెరికా ఉద్దేశాలను తప్పుబట్టారు.;
పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ అంతర్జాతీయ సమాజానికి ఊరటనిచ్చే కీలక పరిణామం చోటుచేసుకుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌తో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని పొడిగిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఇప్పటికే ఇరు దేశాల మధ్య దాడులు, ప్రతిదాడులతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం వ్యూహాత్మక ప్రాధాన్యతను సంతరించుకుంది.
పాకిస్థాన్ మధ్యవర్తిత్వం.. ట్రంప్ ప్రకటన
ఈ కాల్పుల విరమణ పొడిగింపు వెనుక పొరుగు దేశం పాకిస్థాన్ కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. తన సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ 'ట్రూత్ సోషల్' వేదికగా ట్రంప్ ఈ వివరాలను వెల్లడించారు. పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ (ఫీల్డ్ మార్షల్) ఆసిమ్ మునీర్, ప్రధాని షెహబాజ్ షరీఫ్ చేసిన ప్రత్యేక అభ్యర్థన మేరకు మానవతా దృక్పథంతో తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇరాన్‌తో శాంతి చర్చలు కొనసాగేందుకు ఇదొక అవకాశమని ఆయన అభిప్రాయపడ్డారు.
ఒప్పందం నేపథ్యం.. షరతులు
గతంలో ఈ నెల 8వ తేదీన అమెరికా, ఇరాన్ మధ్య రెండు వారాల పాటు కాల్పుల విరమణకు ఒప్పందం కుదిరింది. ఈ గడువు ముగియడానికి కేవలం కొన్ని గంటల ముందు ట్రంప్ పొడిగింపు నిర్ణయాన్ని ప్రకటించడం గమనార్హం. అయితే ఈ శాంతి ఒప్పందానికి ట్రంప్ కొన్ని కీలక షరతులను విధించారు. ఇరాన్ ఒక స్పష్టమైన, ఆచరణాత్మకమైన శాంతి ప్రతిపాదనతో ముందుకు వచ్చే వరకు అమెరికా దాడులు చేయదు. కాల్పుల విరమణ అమల్లో ఉన్నప్పటికీ వ్యూహాత్మకమైన హర్మూజ్ జలసంధి వద్ద ఇరాన్ నౌకలపై విధించిన దిగ్బంధనం మాత్రం కొనసాగుతుంది.
ఆర్థికంగా ఇరాన్‌కు గట్టి దెబ్బ
హర్మూజ్ జలసంధిపై నియంత్రణ విషయంలో ట్రంప్ అత్యంత కఠినమైన వైఖరిని అవలంబిస్తున్నారు. "ఇరాన్ ఈ జలసంధిని తిరిగి తెరవాలని గట్టిగా ప్రయత్నిస్తోంది. ఒకవేళ అది తెరుచుకుంటే ఇరాన్‌కు రోజుకు సుమారు 500 మిలియన్ డాలర్ల ఆదాయం వస్తుంది. కానీ ప్రస్తుతం మా దిగ్బంధనం కారణంగా వారు ఆ భారీ ఆదాయాన్ని కోల్పోతున్నారు" అని ట్రంప్ విశ్లేషించారు. ఒకవేళ ఇప్పుడే దిగ్బంధనాన్ని ఎత్తివేస్తే ఇరాన్ చర్చలకు రాదని, అందుకే ఒత్తిడి కొనసాగించాలని అమెరికా భావిస్తోంది. అవసరమైతే భవిష్యత్తులో మరింత కఠిన చర్యలు తీసుకునేందుకు కూడా వెనుకాడబోమని ఆయన హెచ్చరించారు.
దౌత్యపరమైన చిక్కుముడులు
ఒకవైపు కాల్పుల విరమణ పొడిగించినప్పటికీ ప్రత్యక్ష చర్చలకు మార్గం ఇంకా సుగమం కాలేదు. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ నేతృత్వంలోని ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం చేపట్టాల్సిన పాకిస్థాన్ పర్యటన వాయిదా పడటం ఇందుకు నిదర్శనం. పాక్ వేదికగా ఇరాన్‌తో పరోక్ష చర్చలు జరపాలన్నది వైట్‌హౌస్ వ్యూహం. అయితే ఇరాన్ నుంచి ఆశించిన స్థాయిలో సానుకూల సంకేతాలు రాకపోవడంతోనే ఈ పర్యటనను వాయిదా వేసినట్లు సమాచారం.
మరోవైపు ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బఘాయీ అమెరికా ఉద్దేశాలను తప్పుబట్టారు. అమెరికా ఒకవైపు శాంతి అంటుూనే మరోవైపు వాణిజ్య నౌకలను స్వాధీనం చేసుకోవడం, ఆర్థిక దిగ్బంధనాలు విధించడం వంటి చర్యలకు పాల్పడుతోందని.. ఇది చర్చల వాతావరణాన్ని దెబ్బతీస్తుందని విమర్శించారు. అమెరికా నిజాయితీని తాము నమ్మడం లేదని ఆయన స్పష్టం చేశారు.
ప్రస్తుతానికి కాల్పుల విరమణ పొడిగింపుతో తక్షణ యుద్ధ ప్రమాదం తప్పినట్లు కనిపిస్తున్నా అది కేవలం తాత్కాలిక ఉపశమనం మాత్రమేనని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇరు దేశాల మధ్య నమ్మకానికి బదులు అనుమానాలు పెరగడం.. హర్మూజ్ జలసంధి వద్ద ఉద్రిక్తతలు కొనసాగుతుండటంతో శాశ్వత పరిష్కారం ఇంకా అందని ద్రాక్షగానే మిగిలింది. రాబోయే రోజుల్లో ఇరాన్ ఎలాంటి శాంతి ప్రతిపాదనలతో వస్తుంది? దానికి అమెరికా ఎలా స్పందిస్తుంది? అనే అంశాలపైనే పశ్చిమాసియా భవిష్యత్తు ఆధారపడి ఉంది.