కేంద్రాన్నే వణికించేస్తున్న ఉద్యమం

Update: 2020-12-04 06:14 GMT
దాదాపు నెల రోజుల క్రితం పంజాబ్ లో మొదలైన అన్నదాతల ఉద్యమం ఇపుడు ఏకంగా కేంద్రాన్నే వణికించేస్తోంది. కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన నూతన వ్యవసాయ చట్టానికి వ్యతిరేకంగా పంజాబులో రైతుల ఉద్యమం మొదలైన విషయం తెలిసిందే. అయితే ఆ ఉద్యమం మెల్లిగా ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్ధాన్, హర్యానా రాష్ట్రాలకూ పాకింది.  తమ డిమాండ్లను నెరవేర్చుకునే లక్ష్యంతో లక్షల సంఖ్యలో రైతులు ఢిల్లీకి వెళ్ళేందుకు ప్రయాణం కట్టారు. ఇదే సమయంలో భారీ ఎత్తున చేరుకున్న రైతులను ఢిల్లీ-హర్యానా సరిహద్దుల్లోనే పోలీసులు నిలిపేశారు. దాంతో లక్షలాది మంది రైతులు సరిహద్దుల్లోని గడచిన తొమ్మిది రోజులుగా క్యాంపు వేసున్నారు. తమ డిమాండ్లను పరిష్కరించేంత వరకు తాము ఆందోళనను విరమించేది లేదంటూ రైతు సంఘాల ఆధ్వర్యంలో రైతులు భీష్మించుకుని కూర్చున్నారు. దాంతో ఏమి చేయాలో కేంద్రానికి అర్దం కావటం లేదు. నరేంద్రమోడి ప్రధానమంత్రి అయిన తర్వాత ఎదురైనా అతిపెద్ద ఆందోళన ఇదే అని చెప్పాలి.

నూతన వ్యవసాయ చట్టం వల్ల రైతాంగానికి తీరని నష్టం జరుగుతుంది కాబట్టి ఏకంగా చట్టాన్నే రద్దు చేయాలనే డిమాండ్ తో రైతులు ఆందోళన మొదలుపెట్టారు. ఇప్పటికి రెండుసార్లు చర్చలు జరిపినా రెండువైపులా సర్దుబాటు కాలేదు. తాజాగా గురువారం కేంద్రమంత్రులు, రైతు సంఘాల ప్రతినిధుల మధ్య జరిగిన చర్చలు కూడా అర్ధాంతరంగా ముగిసింది.  చలికాలమంటే ఉత్తరాధిలో వాతావరణం ఎలాగుంటుందో ప్రత్యేకించి ఎవరికీ చెప్పక్కర్లేదు. అలాంటి ఎముకలు కొరికేసే చలిని కూడా లెక్క చేయకుండా లక్షలాది మంది రైతులు రోడ్లపైనే క్యాంపులు వేసుకున్నారు.

రైతుల పట్టుదల చూసిన కేంద్రానికి ఇంత చలిలో కూడా చెమటలు పడుతున్నదనే చెప్పాలి. ఎందుకంటే మరో రెండు రోజులు ఆలస్యమైతే ఈ ఉద్యమం దేశవ్యాప్తంగా పాకే ప్రమాదం ఉందని కేంద్రంలో ఆందోళన పెరిగిపోతోంది. రైతుల ఆందోళనకు రాజస్ధాన్ లో కూడా మద్దతు పెరుగుతోంది. అలాగే పశ్చిమబెంగాల్లోని రైతు సంఘాలు కూడా ఉద్యమంలోకి ప్రవేశిస్తామని చెబుతున్నాయి.

ఇదే సమయంలో గతంలో తాను అందుకున్న పద్మవిభూషణ్ పురస్కారాన్ని తిరిగిచ్చేస్తున్నట్లు  అకాలీదళ్ నేత ప్రకాష్ సింగ్ బాదల్ చేసిన ప్రకటన సంచలనంగా మారింది. తనకింత గుర్తింపు వచ్చిందంటు అందుకు కారణం రైతులే అన్నారు. అలాంటిది వాళ్ళ సమస్యలే పరిష్కారం కానపుడు తనకు పురస్కారం అవసరం లేదన్నారు. అలాగే అకాలీదళ్ తిరుగుబాటు నేత సుఖ్ దేవ్ సింగ్ థిండ్సా కూడా తన పద్మ విభూషణ్ పురస్కారాన్ని తిరిగిచ్చేస్తున్నట్లు ప్రకటించారు. మొత్తానికి ఆలస్యమయ్యేకొద్దీ రైతుల ఉద్యమం మొత్తం దేశానికి పాకేట్లుంది. కాబ్టటి వెంటనే మోడి సర్కార్ మేల్కొనకపోతే కష్టమే.
Tags:    

Similar News