గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే సాయికల్పన టీడీపీలోకి?!

Update: 2017-02-19 05:31 GMT
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్థాపించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ద్వారా ప్రజాదరణ పొందడం, అధికార పక్షం వైపు ఫిరాయించడం.. ఈ ఫిరాయింపు సూత్రాన్ని ఏపీలో ఇప్పటికే ఇరవై మంది ఎమ్మెల్యేలు పఠించారు. పలాయనవాదంతో అధికార పార్టీ వైపు వెళ్లి పోయారు. తమకు ఓటేసిన ప్రజలకు వెన్నుపోటు పొడుస్తూ.. జగన్ కు ద్రోహం చేస్తూ .. వీళ్లు నిస్సిగ్గుగా ఫిరాయింపు రాజకీయాలకు పాల్పడుతున్నారు. చివరకు జనాలే ఛీ కొట్టినా, ఛీత్కరించుకున్నా.. ఫిరాయింపుదారులు తుడుచుకుని వెళ్లిపోతున్నారు.

ఆ సంగతలా ఉంటే.. ఒకవైపు వైఎస్సార్ కాంగ్రెస్ లో కొనసాగుతూ, జగన్ పేరు చెప్పుకొంటూ ప్రజాదరణను పొందుతున్న కొంతమంది లోపాయికారీగా తెలుగుదేశంతో సన్నిహిత సంబంధాలు నెరుపుతున్న దాఖలాలూ కనిపిస్తున్నాయి. ఇప్పుడు గిద్దలూరు నియోజకవర్గంలో ఇలాంటి వ్యవహారం ఒకటి హాట్ టాపిక్ గా మారింది!

ఇక్కడి నుంచి వైకాపా తరపున గెలిచిన అశోక్ రెడ్డి ఇప్పటికే ఫిరాయింపుకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పార్టీలో పనిచేస్తున్న ఈ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే సాయి కల్పన రెడ్డి.. తీరు నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది. ఈమె తెలుగుదేశంలో చేరవచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయిప్పుడు. జగన్ పేరు చెప్పుకొంటూ రాజకీయం చేస్తున్న ఈమె.. పరోక్షంగా తెలుగుదేశంతో సన్నిహిత సంబంధాలు నెరుపుతుండటమే ఈ ఊహాగానాలకు కారణం! ఈమె తీరును చూసి.. ఈమె వైకాపా తరపున ప్రజాదరణ పొంది, తెలుగుదేశంలోకి చేరిపోయే జంప్ జిలానేనేమో అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

సాయి కల్పన రాజకీయ నేపథ్యాన్ని పరిశీలించి చూస్తే.. ఈమె మూలాలు తెలుగుదేశంలోనే కనిపిస్తాయి. (ఇటీవల ఫిరాయించిన చాలా మంది ఎమ్మెల్యేల మూలాలు కూడా తెలుగుదేశం పార్టీ వే కావడం గమనార్హం.) జగన్ పార్టీ తరపున గెలవడం.. తాము గతంలో పని చేసిన పార్టీలోకి చేరిపోవడం చాలామంది చేసిన పని ఇదే. సాయి కల్పనకు ఇప్పటికీ తెలుగుదేశం పార్టీతో సత్సంబంధాలు ఉన్నాయనే విషయం తాజాగా స్పష్టం అయ్యింది.

సాయి కల్పన తనయ అర్చన ‘రెసిపీ ఫర్ సక్సెస్’ అనే పుస్తకం ఒకటి రచించింది. విస్మయకరమైన విషయం ఏమిటంటే.. ఈ పుస్తకం కాపీలను ఆమె తెలుగుదేశం అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్ బాబులను కలిసి బహుకరించింది! ఒకవైపు అర్చన తల్లి సాయి కల్పన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతగా చలామణీ అవుతోంది. కూతురేమో.. ‘రెసిపీ ఫర్ సక్సెస్’పుస్తకంతో చంద్రబాబును, లోకేష్ బాబును కలిసి తమ సాన్నిహిత్యాన్ని బహిర్గతం చేసింది!

అసలు.. తెలుగుదేశం అధినేత చంద్రబాబు సాధించిన విజయమే.. మోసపూరితం! అబద్ధపు హామీలు, బూటకపు మాటలతో బాబు విజయం సాధించారు. మరి ఆయనకు ‘రెసిపీ ఫర్ సక్సెస్’ రచయిత్రి కలవడం ఒక చమత్కారం! బాబునే కాకుండా.. లోకేష్ బాబును కూడా కలవడం ఈ ఎపిసోడ్ లో మరో చిత్రమైన అంశం! మరి ఏ హోదాలో ఉన్నాడని లోకేష్ ను కలిసి.. ఈ పుస్తకాన్ని బహుకరించారో అర్థం కాని విషయం.

ఇదంతా సాయి కల్పన కు తెలుగుదేశం పార్టీతో గల సాన్నిహిత్యానికి నిదర్శనం అని నియోజకవర్గంలో చర్చ జరుగుతోంది. చంద్రబాబు, లోకేష్ లతో సాయి కల్పన రెడ్డికి వ్యక్తిగతంగా మంచి సంబంధాలు ఉన్నాయని.. ఆఖరికి కూతురు రచించిన పుస్తకంతో జగన్ ను కలవాల్సింది పోయి..  చంద్రబాబు, లోకేష్ లతో కలిసేంత సాన్నిహిత్యం వీరిదని స్థానికులు అనుకుంటున్నారు.
4

అలాగే ఇప్పటికే ఫిరాయించిన ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే అశోక్ రెడ్డితో కూడా సాయికల్పనకు సన్నిహిత సంబంధాలే ఉన్నాయి! మరి ఇలాంటి వారు నియోజకవర్గంలో వైకాపా నేతలుగా చలామణి అవుతుండటం ఆ పార్టీ అభిమానులను విస్మయానికి గురి చేస్తోంది. ఇలాంటి వారిని జగన్ ఆదరించినా.. మళ్లీ వెన్నుపోట్లు పొడిచి, ఫిరాయింపు ద్రోహానికి పాల్పడుతారేమో అని ఆ పార్టీ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. మరి ఒకసారి ఇదే నియోజకవర్గంలో జగన్ మోసపోయారు.. ప్రజలూ మోసపోయారు. కాబట్టి.. ఇలాంటి వ్యవహారాలను వైకాపా అధినేత పరిశీలించాల్సిన అవసరం ఎంతైనా ఉంది!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News