నిజంగానే; 101 యూనిట్ ఖరీదు రూ.70.70

Update: 2016-06-24 06:00 GMT
వినేందుకు విచిత్రంగా అనిపించినా ఇది కఠిన వాస్తవం. హానీమూన్ కాలం ముగిశాక ఇలాంటి నిర్ణయాలే ఉంటాయి. గడిచిన రెండేళ్ల వ్యవధిలో తెలంగాణ సర్కారు ప్రజల మీద భారం మోపేందుకు ఏ మాత్రం ఇష్టపడని వైఖరిని భిన్నంగా తాజాగా పరిస్థితి నెలొకొంది. వీలైనంతవరకూ ఫ్రెండ్లీ సర్కారుగా వ్యవహరించేందుకు ప్రయత్నించి.. పన్నుల పెంపు విషయంలో ఎలాంటి పెద్ద నిర్ణయాలు తీసుకోని దానికి భిన్నంగా కేసీఆర్ సర్కారు కీలక నిర్ణయం తీసుకున్నారు.

విద్యుత్ ఛార్జీలు.. బస్సు ఛార్జీల పెంచాలన్న నిర్ణయాన్ని తీసుకున్న కేసీఆర్ కారణంగా తెలంగాణ ప్రజల మీద పడనున్న భారం ఏకంగా రూ.1527  కోట్లు. విద్యుత్ ఛార్జీల పెంపు ప్రతిపాదన తెర మీదకు వచ్చినప్పుడు వంద యూనిట్లు వినియోగించే వారి మీద ఎలాంటి భారం ఉండదని.. ఇలాంటి వారి సంఖ్య మొత్తం మినియోగదారుల్లో 55 శాతానికి మించే ఉంటుందంటూ లెక్కలు చెప్పుకొచ్చారు.

తాజాగా విద్యుత్ ఛార్జీల పెంపునకు ప్రభుత్వం ఓకే అన్నాక.. భారం పడే లెక్క తెర మీదకు వచ్చింది. భారం లేదన్న ప్రభుత్వం మాటకు భిన్నంగా విద్యుత్ వినియోగదారుల మీద ప్రభుత్వ వడ్డన ఓ రేంజ్ లో ఉండటం గమనార్హం. వంద యూనిట్ల వినియోగం వరకూ ఎలాంటి ఇబ్బంది లేకున్నా.. 101 యూనిట్ల నుంచే వడ్డింపు భారం మీద పడనుంది.  

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే వంద యూనిట్ల వరకూ ఎలాంటి భారం లేని దానికి భిన్నంగా 101 యూనిట్ ఒక్కదాని విలువ ఏకంగా 70 రూపాయిలు అంటే ఆశ్చర్యం కలిగించినా నిజమని చెప్పక తప్పదు. అదెలానంటే.. వంద యూనిట్లు దాటిన తర్వాత మొదటి యూనిట్ విద్యుత్ వినియోగానికి భారీ భారం పడుతుంది. 101 యూనిట్ల విద్యుత్ ను వినియోగిస్తే.. మొదటి 100 యూనిట్లకు గతంలో ఉన్న రూ.2.60 నుంచి రూ.3.30కు పెరుగుతుంది. అంటే.. ముందు వాడిన 100 యూనిట్లకు రూ.70 అదనంగా చెల్లించాల్సి వస్తుంది. ఇక.. 101 యూనిట్ వినియోగం నుంచి గతంలో ఉన్న రూ.3.30 కాస్తా రూ.4.30గా మారుతుంది. ఈ రెండింటిని కలిపితే.. 101వ యూనిట్ విలువ ఏకంగా 70.70 రూపాయిలుగా చెప్పొచ్చు.
Tags:    

Similar News