హైదరాబాద్ కు మళ్లీ డబుల్ డెక్కర్​ కళ.. బస్సులు తిరిగే మార్గాలివే!

Update: 2020-12-04 03:47 GMT
హైదరాబాద్​లో డబుల్​ డెక్కర్​ బస్సులు మళ్లీ ప్రారంభం కానున్నట్టు కొంత కాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఏయే ప్రాంతాల్లో బస్సులు అనే విషయంపై రవాణాశాఖ అధికారులు సర్వే చేస్తున్నారు. చాలా ఏళ్ల క్రితం హైదరాబాద్​లో డబుల్​ డెక్కర్​ బస్సులు పెద్ద సంఖ్యలో తిరిగేవి. అయితే ఆ తర్వాతి కాలంలో అవి  ఆగిపోయాయి. జనానికి కూడా ఆ బస్సులు అంటే క్రేజ్ ఉండేది. ఆ తర్వాత ఎందుకో కారణాలు తెలియదు కానీ అవి నిలిచి పోయాయి.

అయితే ఇటీవల ఓ నెటిజన్​ హైదరాబాద్​లో డబుల్​డెక్కర్​ బస్సులు తిరగి ప్రారంభించొచ్చు కదా.. అంటూ మున్సిపల్​ శాఖ మంత్రి కేటీఆర్​కు ట్విట్టర్​లో విజ్ఞప్తి చేశారు. దీనిపై వెంటనే స్పందించిన కేటీఆర్​.. రవాణాశాఖ అధికారులను సంప్రదించారు. హైదరాబాద్​లో డబుల్​ డెక్కర్​ బస్సులు తిప్పవచ్చా.. సాధ్యమేనా ఈ విషయంపై క్లారిటీ ఇవ్వాలని అధికారులను కోరారు. దీంతో డబుల్​ డెక్కర్​ బస్సులను పునరుద్ధరించాలని వారు నిర్ణయించారు. ఇందుకోసం సర్వే నిర్వహిస్తున్నారు. మంత్రి పువ్వాడ అజయ్​ చొరవతో రవాణాశాఖ అధికారులు హైదరాబాద్​ లో పర్యటించారు.  5 మార్గాల్లో ఈ బస్సులను నడపొచ్చని ప్రాథమికంగా గుర్తించారు.

ఈ మార్గాల్లో తొలుత 10 డబుల్‌ డెక్కర్‌ బస్సులు నడపనున్నారు. మెట్రోరైళ్లు, ఫ్లై ఓవర్లు లేనిచోట ఈ బస్సులను నడుపనున్నారు. గతంలో మెహిదీపట్నం - సికింద్రాబాద్, మెహిదీపట్నం-చార్మినార్, సికింద్రాబాద్‌ - చార్మినార్, సికింద్రాబాద్‌-జూపార్కు మార్గాల్లో డబుల్ డెక్కర్ బస్సులను నడిపేవారు. అయితే ప్రస్తుతం సికింద్రాబాద్, కోఠి నుంచి ప్రస్తుతం పటాన్‌ చెరుకు సాధారణ బస్సులు మంచి ఆక్యుపెన్సీతో తిరుగుతున్నాయి. ఆ మార్గానికి మంచి డిమాండ్‌ ఉండటంతో ఆ మార్గాల్లోనే వీటిని తిప్పితే బాగుంటుందని భావిస్తున్నట్లు సమాచారం. వీటితోపాటు మేడ్చల్‌ రూట్‌లో ఉండే సుచిత్ర, కొంపల్లి వరకు, దుర్గం చెరువు వద్దకు కూడా ఓ సర్వీసు ఉండేలా చూడాలని భావిస్తున్నారు. త్వరలోనే ఈ విషయంపై అధికారికంగా నిర్ణయం తీసుకొనే అవకాశం ఉన్నది.
Tags:    

Similar News