హైదరాబాద్ మునగడానికి కారణం తెలిసింది?

Update: 2020-11-04 04:00 GMT
హైదరాబాద్ వరదలకు కారకులెవరు? అధికారంలో ఉన్న టీఆర్ఎస్సా? లేక గతంలో పాలించిన కాంగ్రెస్ నా? మధ్యలో వచ్చిన టీడీపీనా..? లేక చెరువులను కబ్జా చేసి.. నాలాలను కూడిపేసి కట్టుకున్న ప్రజలదా? అంటే ఖచ్చితంగా కబ్జా చేసిన వారిదేనని ఓ చిత్రం కళ్లకు కడుతోంది. ఇందులో అందరి పాపం ఉంది.

హైదరాబాద్ లో ఒకప్పుడు గొలుసుకట్టు చెరువులు.. వాటికి అనుసంధానంగా కాలువలు.. నాలాలు ఉండేవి. నాటి ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం.. నేతలు కబ్జా చేయడం.. ప్రజలు కూడా నాలాలు కబ్జా చేసి కట్టుకున్నారు. ప్రభుత్వాలు, అధికారులు , ప్రజలు ముగ్గురు ఎవరి అవసరార్థం వారు డబ్బులు వెదజల్లో.. ఓటు బ్యాంకు రాజకీయాలో.. లేక కోట్ల విలువైన భూమి అనో మొత్తానికి కబ్జా చేసేశారు. అయితే ఆ పాపం ఊరికే పోతుందా? ఇప్పుడు చూపిస్తోంది.

1965 నాటి హైదరాబాద్ కు ఇప్పటి హైదరాబాద్ కు చాలా తేడా ఉంది. తాజాగా బయటపడ్డ నాటి-నేటి శాటిలైట్ చిత్రాలు చూస్తే నిజంగానే హైదరాబాద్ లో ఎంత కబ్జాలు జరిగాయో తేటతెల్లమవుతుంది.

ఒకప్పుడు లేక్ ఆఫ్ సిటీగా హైదరాబాద్ ను చెప్పుకునేవారు. గొలుసుకట్టు చెరువులతో హైదరాబాద్ చుట్టుపక్కల ఆహ్లాదంగా ఉండేది. 1965నాటి శాటిలైట్ చిత్రంలో అది స్పష్టంగా కనిపించింది.

1965లో ఎల్బీనగర్, సరూర్ నగర్, పరిసర ప్రాంతాల 1965 నాటి శాటిలైట్ చిత్రం తాజాగా బయటపడింది. సరూర్ నగర్, మీర్ పేటలోని మంత్రుల చెరువు, చందన చెరువులను అనుసంధానిస్తూ నాలా స్పష్టంగా కనిపిస్తోంది. నాగోల్సాయినగర్,  పెద్ద చెరువులూ గొలుసుకట్టుగా ఉన్నాయని చిత్రంలో చూపిస్తోంది.

ఇక ఇప్పుడు అక్టోబర్ లో శాటిలైట్ చిత్రం బయటపడింది. అందులో చెరువులే లేకుండా పోయాయి. విస్తీర్ణం తగ్గిపోయింది. వాటికి అనుసంధానంగా అప్పుడు ఉన్న నాలాలు ఏవీ లేవు. ఇంత భారీగా కబ్జా చేశాక వరద ఎటు పోతుంది. అందుకే హైదరాబాద్ ను ముంచెత్తింది. ఇది ప్రజలు, పాలకులు చేసుకున్న పాపం అనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రకృతితో ఆటలాడితే పరిస్థితి ఇలానే ఉంటుంది.
Tags:    

Similar News