కొత్త పార్టీ..ఎంజీఆర్ అమ్మ దీప పెరవై

Update: 2017-02-24 16:49 GMT
తమిళ రాజకీయాలు రోజుకో కొత్త మలుపు తిరుగుతున్నాయి. నిన్నటి వరకూ జయలలిత మేనకోడలు దీప జయకుమార్ మాజీ సీఎం పన్నీర్ సెల్వంతో కలిసి నడుస్తారని ఊహాగానాలు వెల్లువెత్తాయి. కానీ వాటన్నింటికీ దీప జయకుమార్ ఇవాళ ఫుల్ స్టాప్ పెట్టారు. తాను పన్నీర్ సెల్వం క్యాంపులో చేరబోనని ఆమె స్పష్టం చేశారు. ప్రస్తుతమున్న ఏఐఏడీఎంకే నాయకత్వాన్ని ప్రజలు ఆదరించడం లేదని దీప జయకుమార్ అభిప్రాయపడ్డారు. అమ్మ ఆశయాలను సాధించేందుకు ప్రజా క్షేత్రంలోకి దిగుతానని తెలిపారు. ఆర్‌కే నగర్ నుంచి పోటీ చేస్తానని తెలిపారు. కొత్త పార్టీ పెడతారా లేక పన్నీర్‌ తో ఉంటారా అనే ఆలోచనలకు ఇవాళ్టితో దీప తెర దించారు.

మరోవైపు దీప సారథ్యంలో తమిళనాడులో మరో కొత్త రాజకీయ పార్టీ ఏర్పడింది. ఎంజీఆర్ అమ్మ దీప పెరవై పేరుతో దీప జయకుమార్ రాజకీయ వేదికను ప్రకటించారు. ఈ సందర్భంగా పార్టీ జెండాను దీప ఆవిష్కరించారు. జెండాపై ఎంజీఆర్, జయలలితల చిత్రాలతో పాటు కాగడా గుర్తు ఉన్నాయి. జయలలితకు నిజమైన వారసురాలిని నేనేనని దీప అన్నారు. ఇది రాజకీయ పార్టీ కాదు, ఇది ఒక రాజకీయ వేదిక అని దీప తెలిపారు. అమ్మ బాటలో ఈ వేదిక నడుస్తుందని చెప్పారు. నిజమైన అన్నాడీఎంకే కార్యకర్తలకు ఈ రాజకీయ వేదిక అండగా ఉంటుందని దీప వెల్లడించారు.

పోయెస్‌ గార్డెన్‌ తమకే వస్తుందని తన సోదరుడు దీపక్‌ అంటుండటాన్ని ప్రస్తావిస్తూ ఆస్తిని మీరు క్లెయిమ్‌ చేసుకుంటారా? అని దీపను మీడియా ప్రశ్నించగా తన అత్తమ ఆస్తిపాస్తులేవీ అవసరం లేదని స్పష్టం చేశారు. ఆఖరికి ఆమె పెన్ను కూడా అవసరం లేదన్నారు. కేవలం తన అత్తమ్మ ఆశిస్సులు ఉంటే సరిపోతుందని చెప్పారు. జయలలిత మరణంతో ఖాళీ అయిన ఆర్కేనగర్ ఉపఎన్నికలో తాను పోటీ చేస్తానని దీప ప్రకటించారు. తాను పన్నీర్ సెల్వంతో కలిసి ముందుకు సాగనని సొంతంగా ముందుకు సాగుతానని వివరించారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News