వలంటీర్ల ద్వారా లబ్ధిదారుల సొమ్ముకాజేస్తున్న సైబర్ నేరగాళ్లు!

Update: 2020-10-17 09:50 GMT
ఏపీలోని వైఎస్ జగన్ సర్కార్ ఇప్పుడు వివిధ పథకాల్లో పేదలకు ప్రత్యక్షంగా నగదు బదిలీ చేస్తూ వారికి అండగా నిలుస్తోంది. అయితే ఇదే సైబర్ నేరగాళ్లకు వరంగా మారింది. పేదలు, మధ్యతరగతి ప్రజలకు ఈ సైబర్ మోసాలపై పెద్దగా అవగాహన లేకపోవడంతో మోసగాళ్లకు వరంగా మారింది.

ఏపీలోని రాష్ట్ర ప్రభుత్వం వివిధ సంక్షేమ పథకాల కింద ప్రజలకు ఇప్పుడు వేలల్లో వారికి ఖాతాల్లో డబ్బులు జమ చేస్తోంది. ఈ క్రమంలోనే టెక్నాలజీ సాయంతో సైబర్ నేరగాళ్లు ఈ కొత్త దారులు వెతుక్కుంటున్నారు. తాజాగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పథకాల వైపు సైబర్ నేరగాళ్లు మళ్లారు.

తాజాగా కొలిమిగుండ్లకు చెందిన వలంటీర్లకు పలు ఫోన్ నంబర్లతో అమరావతి సెక్రటేరియట్ నుంచి మాట్లాడుతున్నామని ఫోన్ చేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు భరోసా, అమ్మఒడి తదితర పథకాలు రాని వారి బ్యాంక్ అకౌంట్, ఏటీఎం కార్డ్ నంబర్ సేకరిస్తున్నారు. నిజమేనని భావించిన కొలిమిగుండ్లకు చెందిన ఓ వలంటీర్ తన 50 ఇళ్ల పరిధిలోని ఓ లబ్ధిదారుడి ఫోన్ నంబర్ ఇవ్వడంతో అతడి బ్యాంక్ అకౌంట్ లో ఉన్న రూ.10వేలు మాయమయ్యాయి.

ఈ మోసం వెలుగుచూడడంతో లబ్దిదారులకు వలంటీర్లు ఫోన్ చేసి అలెర్ట్ చేశారు. ఎవరు అడిగినా పథకాల గురించి.. బ్యాంక్ అకౌంట్ గురించి చెప్పవద్దని సూచించారు. దీంతో 50మందికి ఫోన్లు వచ్చినా వారంతా అప్రమత్తమయ్యారు. మండల పరిధిలో పలు గ్రామాల వలంటీర్లకు ఇదే తరహాలో సైబర్ కేటుగాళ్లు ఫోన్ చేసినట్లు సమాచారం. దీంతో జగన్ అందిస్తున్న నిధులను కాజేసేందుకు పెద్ద ఎత్తున సైబర్ నేరగాళ్లు మోహరించినట్లు అర్థమవుతోంది.
Tags:    

Similar News