కోవిడ్ రోగి ఆత్మహత్య.. కాలదన్నిన కుటుంబం.. ముస్లిం యువత అంత్యక్రియలు

Update: 2021-04-18 12:30 GMT
కరోనా దారుణాలకు కారణమవుతోంది. ఈ వైరస్ బారిన ఇక జీవితం లేదనుకొని.. మరణమే శరణ్యం అని అత్మస్థైర్యం కోల్పోతున్నారు. తాజాగా ఓ యువకుడు కరోనా బారిన పడి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకోవడం విషాదం నింపింది.

వికారాబాద్ జిల్లా తాండూర్ లో ఈ దారుణం చోటుచేసుకుంది. తాండూర్ పట్టణానికి చెందిన హనుమంతు (35) కరోనా బారినపడ్డాడు. ఐదురోజులుగా హోం క్వారంటైన్ లో ఉంటున్నాడు.

తాజాగా ఇక రోగం తగ్గదని.. చావే శరణ్యం అనుకొని మానసిక స్థైర్యం కోల్పోయిన యువకుడు హనుమంతు తాండూర్ పట్టణంలోని ఫ్లైఓవర్ కింద రైలుపట్టాలపై పడి ఆత్మహత్య చేసుకున్నాడు. కేసు నమోదు చేసుకున్న రైల్వే పోలీసులు మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.

అయితే కరోనాతో చనిపోయాడన్న కారణంగా ఆ శవాన్ని తీసుకోవడానికి కుటుంబ సభ్యులు ముందుకురాలేదు. అంత్యక్రియలు నిర్వహించలేదు.

విషయం తెలుసుకున్న తాండూర్ పట్టణ ముస్లిం వెల్ఫేర్ యూత్ సభ్యులు హనుమంతు శవాన్ని తీసుకొని హిందూ సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించారు. యువత చూపిన మానవత్వంపై ప్రజలంతా అభినందించారు.

తాండూర్ కు చెందిన హనుమంతుకు పదేళ్ల కిందట వివాహమైంది. భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.




Tags:    

Similar News