న్యూయార్క్ లో 150 సెకన్లకు ఒకరు చొప్పున చనిపోతున్నారు

Update: 2020-04-05 04:45 GMT
రెండున్నర నిమిషాలు. సరిగ్గా నూటయాభై సెకన్లు. వేడివేడిగా ఉండే ఒక కప్పు కాఫీ తాగటానికి పట్టే సమయంలో పావు భాగం. ఆ కాస్త సమయం గడిచినంతనే.. ఒక ప్రాణం పోయేంత దారుణ పరిస్థితి న్యూయార్క్ మహానగరంలో నెలకొంది. కరోనా ముందు వరకూ భూతల స్వర్గంగా.. ప్రపంచంలోని ఏ దేశానికి చెందిన వారైనా.. తమ జీవితంలో ఒక్కసారైనా ఆ మహానగరాన్ని చూడాలన్న తలంపు ఉండేది. ఇప్పుడా నగరంలో ఉండటమే పెద్ద శాపంగా మారింది.

కేరాఫ్ న్యూయార్క్ అని చెప్పుకోవటమే ఒక ప్రివిలైజ్ గా ఫీలైన వారు.. ఆకలి నుంచి తప్పించుకోవటానికి బ్రెడ్ ప్యాకెట్లు కొనుక్కోవటానికి సైతం బారులు తీరాల్సి దుస్థితి తాజాగా ఆ నగరంలో చోటు చేసుకుంది. కరోనా విరుచుకుపడుతున్న వేళ.. ఆ నగరం తీవ్రంగా ప్రభావితమైంది. అమెరికాలో మరే మహానగరంలో లేని రీతిలో న్యూయార్క్ లో పరిస్థితులు ఉన్నట్లు చెబుతున్నారు. కరోనా ధాటికి ప్రపంచానికి పెద్దన్నగా చెప్పుకునే అమెరికా ఎంతలా విలవిలలాడుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

అంతకంతకూ విస్తరిస్తున్న కరోనా వైరస్ ను కట్టడి చేసేందుకు ట్రంప్ సర్కారు ఏమీ చేయలేకపోతుందన్న విమర్శలు పెరుగుతున్నాయి. దీనికి తగ్గట్లే.. ఆ దేశంలో మరణాల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఇప్పటివరకూ మరే దేశంలో చోటు చేసుకోని రీతిలో ఒక్క శనివారం రోజునే 1100 మంది కరోనా కారణంగా మరణించారు. ఇందులో న్యూయార్క్ నగరానికి చెందిన వారు 600 మంది ఉండటం చూస్తే.. ఆ మహానగరం ఎలాంటి పరిస్థితుల్లో ఉందో ఇట్టే అర్థమైపోతుంది.

కరోనా కారణంగా ప్రపంచంలోని దేశాలన్ని ప్రభావితమైనా.. ఇంత దారుణంగా మాత్రం మరే దేశంలో లేదని చెప్పాలి. రోజులో 1100 మంది మరణించటం ఇప్పటివరకూ ఏ దేశంలోనూ చోటు చేసుకోలేదు. ఇదిలా ఉంటే ప్రపంచ వ్యాప్తంగా 190 దేశాల్లో కరోనా వ్యాపించింది. మొత్తం 11.30లక్షల కేసులు నమోదయ్యాయి. వీరిలో 2.11 లక్షల మంది కోలుకోగా.. 60వేలమంది మరణించారు. శనివారం ఒక్కరోజునే స్పెయిన్ లో 809 మంది.. ఇటలీలో 766 మంది మరణించారు. బ్రిటన్ లోనూ మరణాలు ఎక్కువగానే చోటు చేసుకున్నాయి. ఇంతవరకూ ఆఫ్రికా దేశాల్లో కరోనా మరణాలు పెద్దగా లేవు. తాజాగా మరణాల సంఖ్య 313కు చేరుకున్నట్లు చెబుతున్నారు. ఏమైనా.. కరోనా దెబ్బకు అగ్రరాజ్యం అతలాకుతలమైందని చెప్పకతప్పదు.
Tags:    

Similar News