కరోనా వేళ.. ఆ చట్టం తెలంగాణలో ఏడాది పాటు అమలు

Update: 2020-03-23 00:30 GMT
‘‘కరోనాతో కంగారు లేదు. నాకో సైంటిస్టు ఫోన్ చేశాడు. ఉత్తినే ఆగం కావాల్సిన అవసరం లేదని చెప్పి.. కరోనా కారణంగా తెలంగాణకు ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. పారాసిటమాల్ గోళి వేసుకుంటే సరిపోతుందని చెప్పారు’’ అంటూ కొద్దిరోజుల క్రితం ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు చాలామందికి ఇంకా గుర్తుండే ఉంటాయి. అయితే.. తాను తొందరపడి ఏదైనా మాట చెబితే.. దాన్ని గుర్తించి.. మళ్లీ రిపీట్ కాకుండా చూసుకోవటమే కాదు.. తనకు తెలీని విషయం మీద మరింత అవగాహన పెంచుకొని అప్రమత్తంగా మాట్లాడే అలవాటు కేసీఆర్ లో కాస్త ఎక్కువే.

ఇదే అలవాటుతోనే కేసీఆర్ మరోసారి పారాసిటమాల్ జోలికి వెళ్లకుండా ఉండిపోయారు. కరోనా విషయంలో మరింత వేగంగా నిర్ణయాల్ని తీసుకోవాల్సిన అవసరాన్ని గుర్తించినట్లుగా చెప్పాలి. దీనికి నిదర్శనంగా సారు సర్కారు వరుస పెట్టి తీసుకుంటున్న నిర్ణయాలుగా చెప్పాలి. కరోనాతో యుద్ధం చేయటం చిన్న విషయం కాదన్నది గుర్తించిన తెలంగాణ సర్కారు తాజాగా కొత్త చట్టాన్ని తెర మీదకు తెచ్చింది.

రూల్ బుక్ లో ఉన్న అంటువ్యాధుల నివారణ చట్టాన్ని తాజాగా బయటకు తీసిన కేసీఆర్ సర్కారు.. ఇందులో ఉన్న అంశాల్ని అమల్లోకి తీసుకురావటమే కాదు.. ఏడాది పాటు ఉంచుతామన్న నిర్ణయాన్ని తీసుకున్నారు. ఈ చట్టంలో భాగంగా తమకు తెలిసీతెలియని విషయాల్ని.. విశ్వసనీయ వర్గాల నుంచి అందిన సమాచారం లాంటి మాటల్ని ఏ వేదిక మీదా ఎవరూ చెప్పే అవకాశం ఈ చట్టం ఇవ్వదు. తేడా కొడితే.. కేసులు నమోదు చేయటంతో పాటు.. కొత్త చిక్కుల్లో పడేసే కరకు చట్టంగా దీన్ని చెప్పాలి. ఇదంతా చూసినప్పుడు అనిపించేది ఒక్కటే.. కరోనా విసయంలో కేసీఆర్ మరింత అప్రమత్తతతో వ్యవహరిస్తున్నారని చెప్పక తప్పదు.
Tags:    

Similar News