ఒంగోలులోనూ కరోనా డేంజర్ బెల్
ప్రపంచంలోని ఒక్కో ప్రాంతాన్ని కబళిస్తూ వస్తున్న కరోనా ప్రకాశం జిల్లా ఒంగోలుకు కూడా వ్యాపించిందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నయి. కరోనా లక్షణాలతో ఓ యువకుడు రిమ్స్ లో చేరాడు. కొన్నాళ్ల క్రితం లండన్ నుంచి ఒంగోలు వచ్చిన ఆ యువకుడు ప్రస్తుతం జలుబు, దగ్గు జ్వరంతో బాధ పడుతున్నాడు. కరోనా అనుమానంతో రిమ్స్ లో చేరాడు. అతన్ని స్పెషల్ వార్డులో ఉంచి డాక్టర్లు పర్యవేక్షిస్తున్నారు. రక్త నమూనాలు సేకరించి టెస్టుల కోసం పంపారు. ఆ రిపోర్టులు వస్తేగానీ కోరానానా, సాధారణ ఫ్లూనా అన్నది తేలదు. ఇప్పటివరకు ప్రశాంతంగా ఉన్న ప్రకాశం జిల్లాలోనూ కరోనా బెల్ మోగడంతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. కర్నూలు జిల్లాలోనూ కరోనా లక్షణాలున్న ఓ వ్యక్తి ఆస్పత్రి నుంచి కనిపించకుండా పోయాడన్న వార్తలు జనాన్ని కంగారు పెట్టాయి.
పుట్టినిల్లు చైనాలో శాంతించిన కరోనా... అక్కడి కంటే మిగిలిన దేశాల్లోనే ఎక్కువ డ్యామేజీ సృష్టిస్తోంది. చైనాలో కంటే మిగిలిన దేశాల్లో పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయని, డెత్ టోల్ ఎక్కువగా ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ -WHO ప్రకటించింది. AFP లెక్కల ప్రకారం కరోనా వైరస్ ప్రస్తుతం 162 దేశాల్లో ఉనికిని చాటుతోంది. ప్రపంచ వ్యాప్తంగా లక్షా 82 వేల 547 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మృతుల సంఖ్య 7,164కు చేరుకుంది. ఇందులో చైనా లెక్క 3,226 మంది కాగా... ఇటలీలో 2,158, ఇరాన్‌లో 853, స్పెయిన్‌లో 342 మంది మరణించారు. ఒక్కో వారం మారేకొద్దీ కరోనా స్పీడు కూడా ఊహించనంతగా పెరుగుతోంది. ఫ్రాన్స్‌లో తొలివారం 12గా ఉన్న కేసుల సంఖ్య... నాలుగో వారానికల్లా నాలుగున్నర వేలకు చేరింది. ఇరాన్ లో నాలుగో వారంలో 12 వేల 700 కేసులు రిజిస్టర్ అయ్యాయి. ఇటలీని ఈ వైరస్ సునామీలా చట్టేసింది. అక్కడ నెల రోజుల్లోనే 24వేల మందికి వైరస్ సోకింది. స్పెయిన్ లో తొలివారంలో 8గా ఉన్న కేసుల సంఖ్య నాలుగు వారాల వ్యవధిలోనే 6 వేలకు చేరుకుంది. భారతదేశంలో ఇప్పటివరకు 124 కరోనా కేసులు నమోదయ్యాయి.