రాహుల్ కు ఇప్పుడంత ఓపిక లేదంట!

Update: 2018-01-07 04:10 GMT
రాహుల్  ఇన్నాళ్లూ ఏదో ఆఫ్ బీట్ గా అప్పుడప్పుడూ పార్టీ వ్యవహారాలను సీరియస్ గా పట్టించుకుంటూ.. తతిమ్మా సమయం మొత్తం.. తనకు తోచిన విధంగా.. హఠాత్తుగా అజ్ఞాతంలోకి వెళ్లిపోయి దేశాలు తిరుక్కుంటూ సరదాలకు తగ్గకుండా గడిపేశారు. కానీ ఇప్పుడు నెత్తి మీదకు కిరీటం వచ్చేసింది. పార్టీ అధ్యక్షుడిగా తల్లి బాధ్యతలు తనకి వచ్చేశాయి. ఇప్పుడు సాంతం దగ్గరుండి చూసుకోవాల్సిందే. ఈ నేపథ్యంలో.. ఈయన పార్టీ బరువును మోయాల్సిందే. రాహుల్.. బరువు మోయడానికి ఇంకా పూర్తి స్థాయిలో ప్రిపేర్ కాలేదన్నట్టుగా కనిపిస్తోంది. ఆయన అధ్యక్ష పగ్గాలు స్వీకరించగానే యావత్తు దేశంలోని అన్ని రాష్ట్రాల పీసీసీ కమిటీలను కూడా ప్రక్షాళన చేసేసి.. తన టీమ్ గా కొత్తవారిని ఏర్పాటుచేసుకుని.. కొత్త తరం రాజకీయాలను ప్రారంభిస్తారని తొలుత ప్రచారం జరిగింది. కాకపోతే.. తాజాగా అలాంటిదేం లేదని రాహుల్ తేల్చేశారు. పాత పీసీసీలే వాటి పదవీకాలాలు పూర్తయ్యేవరకు కొనసాగుతాయని.. ప్రస్తుతానికి ఎవ్వరినీ తాను మార్చబోయేది లేదని రాహుల్ ప్రకటించారు. చూడబోతే.. పీసీసీ లను మార్చేసే కీలక కసరత్తు చేసేందుకు పదవిలోకి వచ్చిన తొలిరోజుల్లోనే ఆయనకు అంత ఓపిక లేదని పార్టీ వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి.

రాహుల్ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన వెంటనే పార్టీ సంస్థాగత నిర్మాణం మొత్తం పునర్ వ్యవస్థీకరించడం జరుగుతుందని చాలా కాలం నుంచి కాంగ్రెస్ ప్రచారం చేసుకుంటూ ఉంది. అందుకే కొన్ని దఫాలుగా కొత్త పీసీసీ కమిటీల మీద కూడా దృష్టి పెట్టలేదు. అంతకుముందు ఉన్న వారినే కంటిన్యూ చేస్తూ వచ్చారు. రాహుల్ వచ్చిన తర్వాత.. పార్టీకి కొత్త లక్ష్యాలను నిర్ణయించి, కొత్త సారథులను ఎంపిక చేసి కొత్త తరహాలో పార్టీని వచ్చే ఎన్నికలకు సిద్ధం చేస్తారనే ప్రచారం బాగా జరిగింది. పార్టీకి పలు రాష్ట్రాల్లో ఉన్న పీసీసీలపై విపరీతమైన అంసతృప్తులు కూడా ఉన్నాయి. ముఠాల తగాదాలు ప్రతిచోటా విచ్చలవిడిగా ఉన్నాయి. ఇలాటి నేపథ్యంలో కొత్త జాతీయ అధ్యక్షుడిగా రాహుల్ జోక్యం చేసుకుని కొత్త కమిటీలను వేయడం వల్ల.. అంతా సెట్ అవుతుందని అందరూ ఎదురుచూశారు.

ప్రస్తుతం పార్టీ ఎన్నికల సంవత్సరంలోనే ఉన్నప్పటికీ.. పార్టీని యుద్ధానికి సిద్ధం చేయడానికి మాత్రం రాహుల్ కు తగినంత ఓపిక లేనట్లుగా కనిపిస్తోంది. ఎంతో కీలకం అయిన పీసీసీల పునర్ వ్యవస్థీకరణ అంశాన్నే ఎడతెగకుండా వాయిదా వేసేయడం అంటే.. పార్టీ గురించి ఇంకేం శ్రద్ధ చూపిస్తున్నట్లు అని పలువురు పెదవి విరుస్తున్నారు. మరి రాహుల్ పరిస్థితుల్ని ఎలా దారిలో పెడతారో చూడాలి.
Tags:    

Similar News