క్షీణించిన సోనియా ఆరోగ్యం.. కీల‌క నేత జైరాం ప్ర‌క‌ట‌న‌

Update: 2022-06-17 14:30 GMT
కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ఆరోగ్యం క్షీణించింది. క‌రోనా అనంత‌ర స‌మ‌స్య‌ల‌తో ఆమె తీవ్రంగా ఇబ్బంది ప‌డుతున్నారు. ఈ మేర‌కు పార్టీ కీల‌క నాయ‌కుడు.. ఏపీఐఐసీ స‌భ్యుడు.. ఎంపీ జైరాం ర‌మేష్ ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. అనారోగ్య ప‌రిస్థితి తీవ్ర త‌రం కావ‌డంతో ఈ నెల 12న ఆమెను ఢిల్లీలోని గంగారామ్ ఆసుప‌త్రిలో చేర్చిన‌ట్టు తెలిపారు. అయితే.. అక్క‌డ కొన్ని రోజులు నిల‌క‌డ‌గానే ఉన్న సోనియా ఆరోగ్యం శుక్ర‌వారం ఉద‌యానికి క్షీణించిన‌ట్టు జైరాం తెలిపారు.

ముక్కునుంచి ర‌క్తం కారుతోంద‌ని.. తెలిపారు. గ‌త ఏడాది క‌రోనా బారిన ప‌డ్డ సోనియా.. కొన్నాళ్ల‌కు కోలుకున్నారు. అయితే.. ఇటీవ‌ల కాలంలో క‌రోనా అనంత‌ర ఇన్ఫెక్ష‌న్ సోకింద‌ని.. దీంతో అనారోగ్యానికి గుర‌య్యార‌ని జైరాం వివ‌రించారు. గురువారం ఉద‌యం వ‌ర‌కు నిల‌క‌డ‌గానే ఉన్న సోనియా ఆరోగ్యం.. ఒక్క‌సారిగా క్షీణించింద‌ని తెలిపారు. లోయ‌ర్ రెస్పిరేట‌రీ ఫంగ‌ల్ ఇన్‌ఫెక్ష‌న్‌కు గురైంద‌ని తెలిపారు. ప్ర‌స్తుతం ఆమెకు అత్యవ‌స‌ర చికిత్స అందిస్తున్నార‌ని జైరాం వివ‌రించారు.

కాంగ్రెస్ శ్రేణులు ధైర్యంగా ఉండాల‌ని.. జైరాం ర‌మేష్ మ‌రో ట్వీట్ చేశారు. సోనియా కోసం ప్రార్థ‌న‌లు చేయాల‌ని.. ఆయ‌న పిలుపు నిచ్చారు. దేశ ప్ర‌జ‌ల కోసం.. సోనియా త‌న జీవితాన్ని త్యాగం చేశార‌ని.. ఆమె ఆరోగ్యంగా తిరిగి వ‌స్తార‌ని ఆకాంక్షించారు. ప్ర‌స్తుతం చికిత్సలు జ‌రుగుతున్నాయ‌ని వివ‌రించారు. ఇదిలావుంటే.. ఇటీవ‌ల రాజ‌స్థాన్‌లో నిర్వ‌హించిన చింత‌న్ శిబిర్ అనంత‌రం.. సోనియాకు క‌రోనా అనంత‌రం త‌లెత్తిన ఆరోగ్య స‌మ‌స్య‌లు పున‌రావృతం కావ‌డం.. గ‌మ‌నార్హం. ప్ర‌స్తుతం కేంద్ర ప్ర‌భుత్వం కూడా సోనియా ఆరోగ్యంపై నిరంత‌రం స‌మీక్షిస్తుండ‌డం విశేషం.
Tags:    

Similar News