రాహుల్ అయినా బే ఖాతర్ : అర్ధమవుతోందా .. కాంగ్రెస్ నావ మునుగుతోందని...?

Update: 2022-06-19 08:30 GMT
కాంగ్రెస్ దేశంలోనే శతాధిక వృద్ధ పార్టీ. ఆ పార్టీ అంత వయసు కానీ అనుభవం కానీ మరో దానికి లేదు అనే చెప్పాలి. ఇక కాంగ్రెస్ పార్టీకి ఎందరో నాయకత్వం వహించారు. ఎందరో ఆ పార్టీ తరఫున ప్రధానులుగా గెలిచి దేశాన్ని ఏలారు. అలాంటి బలమైన  కాంగ్రెస్ పార్టీ ఇపుడు అయిదవ తరం నాయకుడు రాహుల్ గాంధీ చేతిలో పడ్డాక చిక్కి శల్యమవుతోందా.  రాహుల్ గాంధీ వంటి అగ్ర నేత గాంధీల వారసుడు గంటల తరబడి రోజుల తరబడి ఈడీ ఎదుట కూర్చుని ఉంటే అంతటి కాంగ్రెస్ పార్టీలో ఏ కోశానా కదలిక లేకపోవడం అంటే నిజంగా షాకింగ్ పరిణామమే.

అన్నారంటే అన్నారు అంటారు కానీ కాంగ్రెస్ లో చేవ లేకుండా పోయిందా తెగువ అన్నది అసలు  కనిపించడం లేదా అన్న ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. నిజానికి కేంద్రంలోని బీజేపీ కాంగ్రెస్ అగ్ర నేతలను టార్గెట్ చేసింది. ఆ విధంగా కాంగ్రెస్ పార్టీకి మహత్తర అవకాశాన్ని ఇచ్చింది.  దీని అడ్డం పెట్టుకుని ఊరూ వాడా రచ్చ చేసి జనాల సానుభూతిని పొందేందుకు ఆ పార్టీకి అంది వచ్చిన గోల్డెన్  చాన్స్ ఇది.

అయితే తొలి రోజు రాహుల్ ఈడీ ముందుకు వెళ్ళే వేళ కొంత హడావుడి చేసిన కాంగ్రెస్ పార్టీ ఆనక చతికిలపడింది. ఎవరి వ్యాపకాల్లో   నేతలు వారున్నారు. రాహుల్ మాత్రం యధావిధిగా ప్రతీ రోజూ ఈడీ ముందు హాజరు వేయించుకుంటున్నారు. ఇక సోమవారం నుంచి మొదలయ్యే విచారణకు ఆయన మళ్లీ రావాల్సి ఉంటుంది. నిజానికి రాహుల్  కి ఈడీ పిలుపు వెనక ఒక వ్యూహం ఉందని అంటున్నారు. ఈ విచారణను కొనసాగిస్తూనే కాంగ్రెస్ శ్రేణుల నుంచి వచ్చే స్పందనను అంచనా వేసుకుని పరిస్థితి  తమకు అనుకూలంగా ఉంటే మాత్రం అరెస్ట్ చేస్తారన్న వార్తలు వస్తున్నాయి.

మరి రాహుల్ లాంటి నేత ఇలా రాజకీయ వేధింపులకు గురి అవుతూంటే అదే పార్టీలో బడా నాయకులుగా చెప్పుకున్న నేతలు అంతా చడీ చప్పుడూ లేకుండా కూర్చోవడం మీద దేశ రాజకీయం ఆశ్చర్యకరంగా చూస్తోంది. కాంగ్రెస్ వరసబెట్టి దేశంలో ఓడుతోంది. అయినా చలనం లేదు, ఆ పార్టీ నుంచి నేతలు క్యూ కట్టి మరీ వెళ్ళిపోతున్నారు. అయినా నో రెస్పాన్స్.

ఇక ఇపుడు అగ్ర నాయకుల వంతు వచ్చింది. వారిని  పూర్తిగా కట్టడి చేసే ప్రయత్నం జరుగుతోంది. అయినా కాంగ్రెస్ లో ఏ మాత్రం అలికిడి అలజడి ఏ కోశానా  లేదంటే మాత్రం ఆ పార్టీకి ప్రమాద ఘంటికలే అని విశ్లేషణలు ఉన్నాయి. దీని మీద టీయారెస్ నేత మంత్రి కేటీయార్ ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. ఒక విధంగా కాంగ్రెస్ వీటిని  నిష్టుర సత్యాలుగా తీసుకోవాల్సి ఉంది.

ఆయన ఏమన్నారు అంటే  కాంగ్రెస్  పని అయిపోయింది అని బాంబు లాంటి మాట వాడేశారు. రాహుల్ గాంధీని ఈడీ పిలిపించుకుని ప్రశ్నిస్తూంటే ఆ పార్టీలో అడిగే దిక్కు లేదంటే ఎంత నిర్లిప్తతలో కాంగ్రెస్ ఉంది అని కేటీయార్ అంటున్నారు. కాంగ్రెస్ ఇపుడు ఎన్నడూ చూడని దౌర్భాగ్య‌పు స్థితిలో ఉందని, చావడానికి సిద్ధంగా ఉన్న  పార్టీ, పాడె మీద పీనుగులా ఉన్న  పార్టీ కాంగ్రెస్ అని ఒక్క లెక్కన చెడుగుడు ఆడేశారు.

కేటీయార్ అన్నారని కాదు, ఆయన టీయారెస్ నాయకుడే కావచ్చు. రాజకీయ ప్రత్యర్ధి కావచ్చు కానీ ఆయన చెప్పిన మాటల్లో సత్యం ఉంది కదా రాహుల్ సోనియాలకే దిక్కు లేకపోతే ఇక కాంగ్రెస్ ఎక్కడ ఉంటుంది గాంధీ టోపీలూ అంటే జవాబు ఉందా. ఇంతటి నిస్సహాయత. ఉదాశీనత బహుశా కాంగ్రెస్ చరిత్ర పుటలలోని ఏ పేజీలో కూడా ఎవరూ చూసి ఉండరేమో.
Tags:    

Similar News