రాహుల్ కే ఇలాంటి ఇబ్బంది పరిస్థితులు ఎందుకు?

Update: 2022-05-27 08:30 GMT
ఏ చిన్న అవకాశం లభించినా కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ ఇమేజ్ ను డ్యామేజ్ చేయటానికి సిద్దంగా ఉంటుంది బీజేపీ. అవును.. ప్రతి విషయాన్ని నెగిటివ్ గా చూడటాన్ని అర్థం చేసుకోవచ్చు. కానీ.. అంతకు మించి అన్నట్లుగా ప్రచారం చేయటంలో కమలనాథుల తర్వాతే ఎవరైనా. నిజానికి రాహుల్ గాంధీని వ్యక్తిగతంగా చూసినప్పుడు ఆయనలో అధికార దాహం అస్సలు కనిపించదు. నిజానికి ఈ విషయంలో ఆయన్ను మెచ్చుకోవాల్సిందే. మిగిలిన రాజకీయ నేతల మాదిరి అధికారం కోసం తహతహలాడటం ఉండదు. కొందరైతే.. రాహుల్ లోని ఈ గుణమే కాంగ్రెస్ కు శాపంగా మారిందని తిట్టిపోసే వారు లేకపోలేదు.

ఆయన్ను తరచూ యువరాజుగా అభివర్ణించటం ద్వారా ఆయనకు అర్హత లేకున్నా దక్కిందన్నట్లుగా విమర్శలు వినిపిస్తూ ఉంటాయి. నిజానికి ఆయన్ను సరైన రీతిలో ఇమేజ్ బిల్డింగ్ చేయటంలో కాంగ్రెస్ వ్యూహకర్తలు చేసిన తప్పులకు రాహుల్ బాధ్యత వహించాల్సి వస్తోంది. ప్రధానమంత్రి మోడీని తీసుకోండి. ఆయన మీడియాకు అస్సలు అందుబాటులో ఉండరు. ఆయన ప్రధానమంత్రి కావటానికి ముందు మౌన ప్రధానిగా పేరున్న మన్మోహన్ సైతం ఏడాదికి ఒకసారి అయినా మీడియాతో మాట్లాడేవారు. వారు అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చేవారు.

మోడీ విషయానికి వస్తే.. ఆయన అధికారంలోకి వచ్చిన ఎనిమిదేళ్లలో ఎన్ని మీడియా భేటీలు నిర్వహించారు? ఎన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారన్న లెక్క చూస్తే.. విషయం అర్థమవుతుంది. విచిత్రమైన విషయం ఏమంటే.. మేకిన్ ఇండియా నినాదాన్ని తరచూ ప్రస్తావించే మోడీ.. దేశీయ మీడియా సంస్థల కంటే కూడా విదేశీ మీడియాతో మాట్లాడటానికే ఎక్కువ ఆసక్తిని చూపిస్తారన్న విషయం తెలిసిందే. ఈ కారణంతోనే ఆయన విదేశీ మీడియా సంస్థలు.. వారి ప్రతినిధులకు ఇంటర్వ్యూ చేసే సదవకాశాన్ని ఇస్తుంటారు. రాహుల్ విషయానికి వస్తే.. అందుకు భిన్నమైన పరిస్థితి.

అధికారం చేజారిన తర్వాత ఆయన తరచూ ఏదో ఒక పర్యటనలు చేస్తుంటారు. పలు చర్చా గోష్ఠులకు హాజరువుతుంటారు. తన అభిప్రాయాల్ని వెల్లడించటం ద్వారా తన విజన్ ఏమిటన్న విషయాన్ని తెలియజేసే ప్రయత్నం చేశారు. ఆ క్రమంలో కొన్ని సందర్భాల్లో ఇబ్బంది పడతారు. అయితే.. ఆయన ప్రయత్నాన్ని కాకుండా.. ఆయన పడిన ఇబ్బందిని హైలెట్ చేయటం ద్వారా ఆయన ఇమేజ్ ను మరింత డ్యామేజ్ చేస్తుంటారు. తాజాగా అలాంటి ఉదంతమే ఒకటి చోటు చేసుకుంది.

కేంబ్రిడ్జి వర్సిటీలో రాహుల్ ను ఇంటర్వ్యూ చేసిన వ్యక్తి.. 'భారత సమాజంలో హింస.. అహింస' అనే అంశంపై ప్రశ్నను సంధించినప్పుడు.. దానికి సమాధానం చెప్పేందుకు కాస్తంత లాగ్ తీసుకున్నారు. కొన్ని క్షణాలు మౌనంగా ఉన్న ఆయన తర్వాత సమాధానం చెబుతూ.. 'ఈ విషయంలో మొదట నాకు గుర్తుకు వచ్చే పదం క్షమాపణ. ఇది కచ్ఛితమైందేమీ కాదు' అంటూ ఆయన ఇచ్చిన సమాధానం ఒక ఎత్తు అయితే.. ప్రశ్న అడిగినంతనే జవాబు చెప్పటంలో జరిగిన ఆలస్యంపై బీజేపీ నేతలు ఇప్పుడు వేళాకోళం చేస్తూ.. దానికి సంబంధించిన వీడియోను ఇప్పుడు వైరల్ చేస్తున్నారు.

నిజమే.. ప్రశ్నలు అడగటానికే అవకాశం ఇవ్వని అధినేతలు ఉన్న పార్టీ వారి నుంచి ఇంతకు మించి ఇంకేం ఆశించగలం. అయితే.. రాహుల్ కే ఇలాంటి ఇబ్బందులు ఎందుకంటే.. నలుగురిని కలవటం.. వారు వేసే ప్రశ్నలకు సమాధానాలు చెప్పే ప్రయత్నం చేయటం వల్లనే. అలాంటిదేమీ లేకుండా తనదైన ప్రపంచంలో మాత్రమే ఉండే వారికి సమాధానాలు చెప్పే తిప్పలు ఉండవు కదా?
Tags:    

Similar News