జోస్యం: మోడీ ప్రభుత్వం మధ్యలోనే పడిపోతుందా..?!

Update: 2015-06-29 06:14 GMT
కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తన పదవీ కాలాన్ని పూర్తి చేసుకోవడం కష్టం అని అంటున్నారు కమ్యూనిస్టు పార్టీ నేతలు.ఈ మేరకు ఆంధ్రప్రదేశ్‌ కు చెందిన సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఒకరు చేసిన ఒక ప్రకటన ఆసక్తికరంగా ఉంది. మోడీ ప్రభుత్వం ఐదు సంవత్సరాల పాటు మనుగడ సాగించడం కష్టం అని ఆయన అంటున్నాడు. ప్రభుత్వం పడిపోవచ్చని, మధ్యంతర ఎన్నికలు రావొచ్చని ఆయన అభిప్రాయపడ్డాడు.

    మరి మంచి మెజారిటీతో ఏడాది కిందటే ఏర్పాటు అయిన మోడీ ప్రభుత్వం అప్పుడే పడిపోవడం ఏమిటి? మధ్యంతర ఎన్నికలు ఏమిటి? అంటే.. దానికి ఎర్రన్నలు రీజన్లు చెబుతున్నారు. మోడీ ప్రభుత్వంలోని ముఖ్యులకు అవినీతి మరకలు అంటాయని.. వీటి ఫలితంగానే ప్రభుత్వం పడిపోవచ్చని అభిప్రాయపడుతున్నారు.

    సుష్మాస్వరాజ్‌, స్మ-తీఇరానీ, రాజస్థాన్‌, మహారాష్ట్ర ముఖ్యమంత్రులు ఇంకా భారతీయ జనతా పార్టీ నేతల మీద అవినీతి ఆరోపణలు వస్తున్న విషయాన్ని ఏపీకి చెందిన ఈ నేతలు ప్రస్తావించారు.వేల కోట్ల స్కామ్‌కు సూత్రధారి అయిన లలిత్‌ మోడీకి సుష్మాస్వరాజ్‌, వసుంధరరాజేలు కొమ్ముకాయడం అత్యంత దారుణమైన విషయం అని వీరు అభిప్రాయపడ్డారు.

    మరి మోడీ సర్కారుపై అవినీతి ఆరోపణలు చేస్తున్న వారు ఉన్నారు.. కేంద్రమంత్రులిద్దరు రాజీనామా చేయాలని, వసుంధరరాజే, పంకజముండేలు రాజీనామా చేయాలని డిమాండ్‌ చేసే వాళ్లూ ఉన్నారు. అయితే ఇలాంటి పరిణామాల నేపథ్యంలో మోడీ ప్రభుత్వం పడిపోతుందని అనేవాళ్లు మాత్రం ఇంత వరకూ కనపడలేదు. అయితే ఏపీ కమ్యూనిస్టు నేతలు ఆ లోటును భర్తీ చేశారు. మరి వీరి జోస్యం ఏ మేరకు ఫలిస్తుందో చూడాలి!

Tags:    

Similar News