వాలెంటైన్స్‌ డే రోజు ఆ కాలేజ్‌ అమ్మాయిలు ప్రతిజ్ఞ... మాటమీద నిలబడతారా?లేదా ?

Update: 2020-02-15 11:10 GMT
గత కొన్ని రోజులుగా ప్రపంచమంతా వాలెంటైన్‌ ఫీవర్‌తో ఊగిపోతోంది. ప్రపంచ దేశలన్ని ప్రేమికుల దినోత్సవ సంబరాల్లో మునిగితేలాయి. భారత్‌లో కూడా ఈ సంబరాలు గట్టిగానే జరిగాయి. ప్రేమికుల రోజునాడు , ప్రేమికులు ఒకరితో ఒకరు గడుపుతూ, తమ ప్రేమ బలంగా ఉండాలని, జీవితాంతం ఒకరికొకరు తోడుగా ఉంటామని వాగ్దానాలు చేసుకుంటూ ఉంటారు. అయితే, ఇందుకు భిన్నంగా మహారాష్ట్ర లోని అమరావతి జిల్లా చాందూర్‌ లోని మహిళా ఆర్ట్స్ అండ్ కామర్స్ కాలేజీ యాజమాన్యం అమ్మాయిల చేత తాము ఎప్పుడూ ప్రేమ లో పడమని, ప్రేమ వివాహం చేసుకోమని చెప్పిస్తూ వాలెంటైన్స్ డే ప్రమాణం చేయించింది.

ఆ ప్రతిజ్ఞలోని అంశం ఏంటంటే ... నాకు మా అమ్మానాన్నల మీద పూర్తి నమ్మకం ఉంది. నా చుట్టూ జరిగే సంఘటనలకు నేను బయపడను. నేను ఎట్టిపరిస్థితుల్లోనూ ఎవరితోనూ ప్రేమలో పడను. ప్రేమ వివాహం చేసుకోను. అలాగే, కట్నం అడిగే వారిని కూడా పెళ్లిచేసుకోను. ఒకవేళ సామాజిక పరిస్థితుల దృష్ట్యా నా తల్లిదండ్రులు నాకు కట్నం ఇచ్చి పెళ్లిచేస్తే... భవిష్యత్తు లో ఓ తల్లిగా నేను నా కూతురికి ఎలాంటి కట్నం ఇవ్వకుండా పెళ్లి చేస్తాను. ఏ మాత్రం కట్నం తీసుకోకుండా నా కోడలిని తెచ్చుకుంటాను. బలమైన, ఆరోగ్య వంతమైన భారత్ కోసం నేను ఈ ప్రతిజ్ఞ చేస్తున్నాను' అంటూ కళాశాల విద్యార్ధినులంతా ప్రతిజ్ఞ చేశారు.

మహారాష్ట్రలోని అమరావతి జిల్లాలో ఉన్న మహిళా వాణిజ్య మహా విద్యాలయంలో ఈ వింత సంఘటన జరిగింది. ఆ కాలేజీ పరిపాలనా విభాగం ఈ వాలెంటైన్స్‌ డే సందర్భంగా విద్యార్థినుల చేత ఇలా వింతైన ప్రతిజ్ఞ చేయించింది. నేషనల్ సర్వీస్ క్యాంప్‌ లో భాగంగా ఈ ప్రతిజ్ఞ చేయించారు. అయితే, పిల్లలు ప్రేమ పేరుతో దారి తప్పకుండా చదువు మీద దృష్టి పెట్టి, అది పూర్తయిన తర్వాత పెళ్లి గురించి ఆలోచించేలా చేయడానికే ఇలాంటి ప్రతిజ్ఞ చేయించినట్టు కళాశాల యాజమాన్యం చెబుతోంది. అయితే కాలేజీ యాజమాన్యం చేసిన ఈ పని పై విమర్శలు కూడా వస్తున్నాయి. ఇకపోతే , ప్రతిజ్ఞ అయితే చేశారు కాని వీరు తమ ప్రతిజ్ఞ పై నిలబడుతారా అనేది చూడాలి.ప్రేమ అనేది చాలా సున్నితమైన విషయం.ఆ విషయంలో ఎప్పుడు ఎవరి భావన ఎలా ఉంటుందో చెప్పలేం.అందుకే ఈ అమ్మాయిలు చేసిన ప్రతిజ్ఞ పై నిలబడాలని కోరుకుందాం.
Tags:    

Similar News