లుంగీ.. చొక్కాతో ఎరువుల షాపుకు వెళ్లింది ఆ సబ్ కలెక్టరా?
లుంగీ.. సాదాసీదా చొక్కా.. ముఖానికి మాస్కు.. చూసినంతనే యువకుడైన పల్లెటూరు రైతుకు ఏ మాత్రం తీసిపోని ఆహార్యంతో వెళ్లిన విజయవాడ సబ్ కలెక్టర్ సూర్యసాయి ప్రవీణ్ చంద్ పెను సంచలనంగా మారారు. అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెత్తేలా చేయటమే కాదు.. కక్కుర్తి వ్యాపారులు చేసే దారుణాల్ని తానే స్వయంగా బయటపెట్టిన వైనం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇంతకూ అసలేం జరిగిందంటే..
ఒక రైతు మాదిరి వేషం మార్చుకొని కైకలూరులోని ఎరువుల షాపుకు వెళ్లారు. ఎరువులు కావాలని అడిగితే.. షాపులో ఎరువుల స్టాక్ ఉన్నా.. స్టాక్ లేదని చెప్పాడు. మరో షాపులో ఎమ్మార్పీ కంటే కూడా ఎక్కువ ధరకు అమ్ముతున్నట్లుగా గర్తించారు. ఎమ్మార్పీ రేటుకు అమ్మలేమని చెప్పేశారు. మరో వ్యాపారి బిల్లు ఇవ్వకుండా స్టాక్ ఇస్తామని చెప్పారు. ఇలా రైతుల హక్కులకు భంగం కలిగేలా.. వారి మీద భారం మోపేలా వ్యవహరిస్తున్న వ్యాపార సంస్థల తీరును గుర్తించిన సబ్ కలెక్టర్.. తన కింది స్థాయి అధికారులకు ఫోన్ చేసి.. తాను వెళ్లిన ప్రతి షాపునకు పంపారు. వారు చేస్తున్న తప్పుడు పనులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
కైకలూరు నుంచి ముదినే పల్లికి వెళ్లి ఎరువుల షాపుల్ని తనిఖీ చేసిన ఆయన.. రైతుల ప్రయోజనాల్ని దెబ్బ తీసేలా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ సందర్భంగా కౌకలూరులోనిరెండు ఎరువుల షాపుల్ని సీజ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. సబ్ కలెక్టర్ దెబ్బకు ఆ చుట్టుపక్కల ఊరి వారు హడలిపోయినట్లుగా చెబుతున్నారు. ఇలాంటి అధికారి ప్రతి జిల్లాకు పది మంది ఉంటే చాలు.. మొత్తంగా మార్పులు చోటు చేసుకోవటం ఖాయమని చెప్పక తప్పదు.