ఈటలతోపాటు మరికొందరు మంత్రులపై వేటు?

Update: 2021-05-02 03:35 GMT
తెలంగాణ వైద్యఆరోగ్యశాఖ మంత్రి పదవి నుంచి ఈటల రాజేందర్ ను పక్కనపెట్టేశారు. వైద్యఆరోగ్యశాఖను సీఎం కేసీఆర్ తన ఆధీనంలో తీసుకున్నారు. ఈటలపై వచ్చిన భూకబ్జా ఆరోపణలు నిజం అని తేల్చడంతో కేసీఆర్ ఈ చర్య తీసుకున్నారు. ఈ పరిణామం టీఆర్ఎస్ వర్గాల్లో తీవ్రంగా చర్చనీయాంశమైంది.

అయితే సీఎం కేసీఆర్ మాత్రమే కాదు.. మరికొంతమంది మంత్రులపై కూడా సీఎం కేసీఆర్ వేటు వేయనున్నారు అన్న చర్చ జోరుగా సాగుతోంది.

ఇప్పటికే పలు అవినీతి ఆరోపణలు, భూకబ్జాలు ఎదుర్కొన్న మంత్రులు ఇప్పుడు ఈటల ఎపిసోడ్ తో భయంతో ఉన్నట్టు ప్రచారం సాగుతోంది.. తమ పోస్టుకు కూడా కేసీఆర్ ఎసరు పెడుతాడేమోనన్న ఆందోళన వారిలో కనిపిస్తోంది.

ఈ క్రమంలోనే ఈటలతోపాటు జీహెచ్ఎంసీ పరిధిలోని ఒకరిద్దరు మంత్రులపైన కూడా సీఎం కేసీఆర్ వేటు వేయడానికి రంగం సిద్ధం చేశారన్న ప్రచారం టీఆర్ఎస్ పార్టీ వర్గాల్లో కనిపిస్తోంది.

ఇప్పటికే కీలక శాఖను నిర్వహిస్తున్న మంత్రికి ప్రభుత్వ పెద్దల నుంచి సంకేతాలు కూడా వెళ్లినట్లు సమాచారం. జీహెచ్ఎంసీ పరిధిలోనే కాకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మిగతా మంత్రులపై కూడా చాలా ఆరోపణలు వస్తున్నాయి. ఉత్తర తెలంగాణకు కేంద్రమైన ఓ జిల్లా మంత్రి, అటు ఆంధ్ర సరిహద్దున మూలాలున్న మరో మంత్రి, జీహెచ్ఎంసీ పరిధిలోని ఓ వివాదాస్పద మంత్రి.. ఇలా మొత్తం ఐదుగురు మంత్రులు ఇప్పుడు టెన్షన్ లో ఉన్నట్టు ప్రచారం సాగుతోంది.

కేసీఆర్ నిర్ణయాలు ఊహకు అందవు అంటారు.ఆయన ఎప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనేది బయటకు రావు. సడెన్ గా బ్రేకింగ్ న్యూస్ లు అవుతాయి. ఇప్పుడు కూడా ఈటల ఎపిసోడ్ ఎవ్వరూ ఊహించలేదు. ఈ క్రమంలోనే మొత్తం ఐదుగురు మంత్రులకు చెక్ పడుతోందన్న చర్చ జోరుగా సాగుతోంది.
Tags:    

Similar News