ఎమ్మెల్యే అన్నా రాంబాబుకు అపాయింట్ ఇచ్చేందుకు సీఎం జగన్ నో!

Update: 2021-01-23 15:30 GMT
ప్రజలు అధికారాన్ని కట్టబెట్టినప్పుడు దాన్ని నిలుపుకునే తెలివైనా ఉండాలి. కానీ.. అలాంటివేమీ లేకుండా.. అదే పనిగా ఎవరు పడితే వారి మీద నోరు వేసుకొని పడే వివాదాస్పద అధికారపక్ష ఎమ్మెల్యేగా మారారు గిద్దలూరు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు. ప్రజారాజ్యం పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచి తర్వాత కాలంలో కాంగ్రెస్ లో చేరారు. విభజన సమయంలో టీడీపీలో చేరి.. తర్వాత వైఎస్సార్ కాంగ్రెస్ లో చేరిన ఆయన 2019లో జరిగిన ఎన్నికల్లో పోటీ చేసిన ఆయన రాష్ట్రంలోనే రెండో అత్యధిక మెజార్టీ సాధించి అందరి కంట్లో పడ్డారు.

ఇలాంటి ఇమేజ్ వచ్చినప్పుడు జాగ్రత్తగా కాపాడుకోవాలి. కానీ.. వివాదాలతో సహవాసం చేసే ఆయన.. తరచూ ఎవరో ఒకరితో పంచాయితీలు పెట్టుకోకకుండా ఉండలేరంటారు. తన మాటను తప్పించి.. ఎదుటోడి నోటి నుంచి వచ్చే మాటల్ని పట్టించుకోవటంలో ఆయనకు అస్సలు ఓపిక ఉండదంటారు. ఎమ్మెల్యే అన్నాక ఒక మోస్తరు నేతలు మొదలు చోటా నేతల వరకూ ఎవరూ ఇప్పుడు ఆయన పక్కన ఉండటం లేదంటున్నారు.

సామాన్యులను సైతం వదలని ఆయన.. పనుల కోసం వచ్చే చాలు.. ఈసడింపులు తప్పవంటున్నారు. తన దగ్గరకు వచ్చి పనులు అడగొద్దని.. తన వల్ల కాదని అంటున్నట్లుగా చెబుతారు. ఇదిలా ఉంటే.. ఇటీవల జనసేన పార్టీకి చెందిన కార్యకర్త.. నియోజవర్గంలొ జరగని పనుల్ని ప్రశ్నిస్తే యమా సీరియస్ అయ్యారు. దీంతో.. ఆ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో ఏపీలో ఇప్పుడు మరో కొత్త కలకలం రేగింది. అన్నా రాంబాబు మీద టీవీ.. ప్రింట్ మీడియా ప్రతినిధులతోనూ ఏదో ఒక అంశం మీద ఇష్యూ నడుస్తూ ఉంటుందని చెబుతారు.

జనసేన కార్యకర్త సూసైడ్  చేసుకున్ నేపథ్యంలో  ఆయన పేరు బాగా పాపులర్ అయ్యింది. దీంతో.. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న అధికార వైఎస్సార్ కాంగ్రెస్ కు ఆయనో పెద్ద మైనస్ గా మారారు. కుర్రాడి ఆత్మహత్యకు కారణమైన అంశంపై పెరుగుతున్న రచ్చ నేపథ్యంలో నిఘా వర్గాల నుంచి సీఎం జగన్ నివేదిక తెప్పించుకున్నట్లుగా తెలిసింది. ఇప్పటికే పలుమార్లు.. పలు అంశాల్లో అభ్యంతరకరంగా వ్యవహరించిన ఎమ్మెల్యేపై ఇప్పటికే గుర్రుగా ఉన్న సీఎం జగన్.. తాజా పరిణామాలతో ఆయనకు అపాయింట్ మెంట్ ఇచ్చేందుకు సైతం నిరాకరించటం జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. యువకుడి ఆత్మహత్యపై నిఘా వర్గాల ద్వారా రిపోర్టు తెప్పించుకున్న సీఎం.. సొంత పార్టీ ఎమ్మెల్యేపై అసహనంతో ఉన్నట్లుగా తెలుస్తోంది. చేతిలో ఉన్న అధికారాన్ని.. ప్రజలు ఇచ్చిన ఎమ్మెల్యే పదవిని చెడగొట్టుకోవటం ఎలానో అన్నా రాంబాబును చూస్తే ఇట్టే అర్థమవుతుందని నియోజకవర్గ ప్రజల నోట తరచూ వినిపిస్తోంది.
Tags:    

Similar News