చిదంబరం కాబోయే ప్రధాని.. అన్నదెవరో తెలుసా?

Update: 2019-08-24 04:17 GMT
అప్పుడెప్పుడో చేసిన తప్పునకు ఏళ్లకు ఏళ్ల తర్వాత విచారణకు రంగం సిద్ధం చేయటం.. నోటీసులు జారీ చేయటం.. అరెస్ట్ చేయటం మన దేశంలో మామూలే. తాజాగా మాజీ కేంద్ర హోంశాఖా మంత్రి చిదంబరాన్ని ఆయన ఇంటి గోడ దూకి మరీ లోపలకు వెళ్లిన సీబీఐ అధికారులు అరెస్ట్ చేయటం తెలిసిందే.

ఆయన అరెస్ట్ నేపథ్యంలో పాక్ ఎంపీ కమ్ మాజీ కేంద్రమంత్రి రెహ్మాన్ మాలిక్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసి సంచలనమయ్యాడు. భారత దేశ రాజకీయాలు తనకు బాగా తెలుసన్న రీతిలో ఆయన వ్యాఖ్యలు ఉన్నాయి. ఆర్టికల్ 370 నిర్వీర్యంపై ప్రధాని మోడీకి వ్యతిరేకంగా మాట్లాడినందుకే చిదంబరాన్ని అరెస్ట్ చేసినట్లుగా ఆరోపించారు. అంతేకాదు.. రానున్న రోజుల్లో చిదంబరం దేశ ప్రధాని కావటం ఖాయమన్న మాటను చెప్పి సంచలనంగా మారారు.

ఆయనో సమర్థ రాజకీయ నేత అని.. తాను చెబుతున్నది మరచిపోవద్దని.. రాబోయే రోజుల్లో చిదంబరం భారత దేశ కాబోయే ప్రధానిగా ఆయన వెల్లడించారు. పాక్ కు చెందిన ది నేషన్ అనే మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయనీ వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్ విషయంలో మోడీ ఏకపక్ష నిర్ణయాన్ని చిదంబరం ఎండగట్టటమే ఆయన చేసిన తప్పుగా అభివర్ణించారు. మిగిలిన విషయాలు ఎలా ఉన్నా.. ఆర్టికల్ 370 నిర్వీర్యంపై చిదంబరం రియాక్ట్ అయినందుకే ఆయన్ను అరెస్ట్ చేసినట్లుగా ఆరోపించటం ద్వారా.. ఆయనకు లేని మరో తలనొప్పిని తెచ్చిపెట్టారు పాక్ ఎంపీ.

ఆర్టికల్ 370 నిర్వీర్యం మీద దేశ వ్యాప్తంగా ప్రజల్లో సానుకూలత వ్యక్తం కావటమే కాదు.. ఆ నిర్ణయం తర్వాత మోడీ గ్రాఫ్ భారీగా పెరిగిపోవటాన్ని మర్చిపోకూడదు. చిదంబరానికి అనుకూలంగా మాట్లాడానని అనుకున్న సదరు ఎంపీ.. ఆయనకు కొత్త తలనొప్పులు తెచ్చి పెట్టారని చెప్పక తప్పదు.
Tags:    

Similar News