మోదీ ప్యాకేజీపై విమర్శల జడివాన మామూలుగా లేదే!

Update: 2020-05-13 16:00 GMT
ప్రాణాంతక వైరస్ కరోనా నేపథ్యంలో రెండు నెలల తరబడి కోనసాగుతున్న లాక్ డౌన్ కారణంగా కుదేలైన ఆర్థిక రంగానికి జవసత్వాలను నింపేలా ప్రధాని నరేంద్ర మోదీ వరుసగా రెండో ఆర్థిక ప్యారేజీని ప్రకటించిన సంగతి తెలిసిందే. మంగళవారం రాత్రి మీడియా ముందుకు వచ్చిన మోదీ ‘ఆత్మ నిర్భర్ బారత్ అభియాన్’ పేరిట ప్రకటించిన భారీ ప్యాకేజీలో ఏకంగా రూ.20 లక్షల కోట్లను విడుదల చేస్తున్నట్లుగా ప్రకటించారు. ఈ ప్యాకేజీ పట్ల దేశవ్యాప్తంగా ప్రజలు హర్షాతిరేకాలు కురిపిస్తున్నా... బీజేపీ వైరి వర్గాల నుంచి ఆ ప్యాకేజీపై విమర్శల జడివాన కురుస్తోంది. ఇప్పటికే పలు పార్టీలకు చెందిన పలువురు కీలక నేతలు మోదీ ప్యాకేజీని తూర్పారబట్టగా... తాజాగా బుధవారం నాడు కేంద్ర ఆర్థిక శాఖ మాజీ మంత్ర, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పి.చిదంబరం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీలు తమదైన శైలి విమర్శలు సంధించారు.

మోదీ ప్రకటించిన భారీ ఆర్థిక ప్యాకేజీలో అసలు రూ.16.4 లక్షల కోట్లు ఎక్కడ? అంటూ చిదంబరం సెటైరికల్ విమర్శలు గుప్పించారు. మోదీ ప్రకటించిన రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీలో రూ.3.6 లక్షల కోట్లు మాత్రమే కనిపిస్తున్నాయని చెప్పిన చిద్దూ భాయ్.. మిగిలిన రూ.16.4 లక్షల కోట్లు ఎక్కడున్నాయంటూ ప్రశ్నించారు. మొత్తంగా నిర్భర్ ప్యాకేజీని గణంగా చెప్పుకున్న మోదీ... అందులోని డొల్లతనాన్ని తనకు తానే బయటపెట్టేసుకున్నారని చిదంబరం దుయ్యబట్టారు. అసలు మోదీ ప్రకటించిన ప్యాకేజీ అంతా డొల్లేనని కూడా చిదంబరం తనదైన శైలి వ్యాఖ్యలు గుప్పించారు. పేరు గొప్ప ఊరు దిబ్బ మాదిరిగా కనిపిస్తున్న మోదీ ప్యాకేజీ దేశ ఆర్థిక రంగాన్ని బలోపేతం చేస్తుందంటే నమ్మేదెలా? అని కూడా చిదంబరం విమర్శలు గుప్పించారు.

ఇక మోదీ పేరు వింటేనే అంతెత్తున ఎగిరిపడుతున్న దీదీ... నిర్భర్ ప్యాకేజీపై కూడా అదే స్థాయిలో విరుచుకుపడ్డారు. మోదీ ప్రకటించిన ప్యాకేజీని చూస్తే... అసంఘటిత రంగానికి ఎలాంటి కేటాయింపులు లేవని, ఈ నేపథ్యంలో ప్రజల వ్యయాన్ని పెంచడంతో పాటుగా ఉద్యోగ కల్పన కూడా ఈ ప్యాకేజీతో సాధ్యం కాదని దీదీ విమర్శించారు. లాక్ డౌన్ కారణంగా అందరికంటే ఎక్కువగా కష్టాలు పడుతున్న అసంఘటిత రంగ కార్మికులను వదిలేసి ఇతర వర్గాలకు ఏదో చేస్తానని ఏకంగా రూ.20 లక్షల కోట్లతో ప్యాకేజీని ప్రకటించడం వల్ల ఉపయోగం ఏమిటని కూడా దీదీ ప్రశ్నించారు. ఇప్పటికే లాక్ డౌన్ కారణంగా ఉన్న ఉద్యోగాలు కోల్పోతుంటే.. కొత్త ఉద్యోగాల కల్పన ఊసేలేని మోదీ ప్యాకేజీతో దేశానికి పెద్దగా ఒరిగేదేమీ లేదని కూడా దీదీ తనదైన శైలి విమర్శలు గుప్పించారు. ఇలా మోదీ ప్యాకేజీపై వరుసగా విమర్శల జడివాన కురుస్తుంటే... వాటికి సమాధానం ఇచ్చే దిశగా మోదీ సర్కారు పెద్దగా కదులుతున్నట్టుగానే కనిపించని వైనం ఆసక్తి రేకెత్తిస్తోంది.
Tags:    

Similar News