జనసేనతో కటీఫ్.... ఎమ్మెల్సీ ఎన్నికల తరువాత పెద్ద మార్పు....?

Update: 2023-03-22 08:14 GMT
ఏపీలో రాజకీయాలు తొందరలోనే శరవేగంగా మారిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏపీలో పొత్తులు అంటే ఇప్పటిదాకా జనసేన బీజేపీల గురించి చెప్పుకునేవారు. ఇపుడు ఆ పొత్తులకు పెటాకులు అయ్యే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఏపీలో మూడున్నరేళ్ల క్రితం బీజేపీ జనసేనల మధ్య పొత్తు కుదిరింది. ఈ పొత్తు 2024 ఎన్నికల కోసం అని రెండు పార్టీలు ఆదికి ముందే ఆర్భాటంగా ప్రకటించాయి.

అయితే ఇపుడు ఆ పొత్తు చిత్తు అయ్యేందుకు కూడా ఆ రెండు పార్టీల వైఖరి కారణంగా ఉంది. బీజేపీ నుంచి దూరం జరగాలని జనసేన మానసికంగా డిసైడ్ అయింది అని అంటున్నారు. మచిలీపట్నం సభలోనే దీని మీద పవన్ ఇండైరెక్ట్ గా హింట్ ఇచ్చేశారు. అయితే నెపాన్ని ముస్లిం మైనారిటీల మీద పెట్టారు. వారికి ఏమైనా జరిగినా దాడులు చేసినా తాను పొత్తు తెంచేసుకుంటాను అని ఆయన హెచ్చరించారు.

నిజానికి ఏపీలో ముస్లిం మైనారిటీలకు అలాంటి పరిస్థితి ఎపుడూ లేదు. సడెన్ గా పవన్ అలా అన్నారూ అంటే పొత్తు విషయంలో మనసులో మాటను బయటపెట్టేందుకే అని అంటున్నారు. ఇంకో వైపు చూస్తే బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్ధులు ఏపీలో మూడు చోట్ల పోటీ చేస్తే అన్నింటా బోల్తా కొట్టారు. పైపెచ్చు చెల్లని ఓట్ల కంటే ఆ పార్టీకి తక్కువ ఓట్లు వచ్చి డిపాజిట్లు గల్లంతు అయ్యాయి.

దీంతో ఉత్తరాంధ్రా సిట్టింగ్ ప్లేస్ లో ఎమ్మెల్సీగా ఉన్న పీవీఎన్ మాధవ్ అయితే జనసేన మీద సంచలన కామెంట్స్ చేశారు. జనసేనతో పొత్తు ఉందో లేదో తెలియదు అన్నట్లుగా ఆయన మాట్లాడారు.  జనసేన తమకు ఏ మాత్రం సహకరించలేదు అన్ని మాధవ్ మాట్లాడారు. మిత్రపక్షంగా తమకు మద్దతు ఇవ్వాల్సిన జనసేన కనీసం ప్రకటన కూడా చేయకపోవడం పట్ల బీజేపీ నేతలు గుర్రు మీద ఉన్నారు.

కలసి నడవకపోతే జనాలు పొత్తు ఎలా అనుకుంటారు అని మాధవ్ ప్రశ్నించడం ద్వారా తమ మధ్య స్నేహం పొత్తులు ఏవీ లేవని తేల్చేశారు. తొందరలో కటీఫ్ అని చెప్పేయనున్నారు అంటున్నారు. ఇదిలా ఉంటే బీజేపీ పదాధికారుల సమావేశంలో జనసేన గురించి చర్చ సాగింది అని అంటున్నారు. ఏపీలో తమ దారి తాము చూసుకుని ఎదుదుదామనుకుంటే పొత్తు పేరుతో జనసేన వచ్చి ఏమీ కాకుండా చేసిందన్న వేదన అయితే కమలనాధులలో ఉంది.

పొత్తులు ఉంటాయనుకుని నెమ్మదించిన కమలనాధులకు ఇపుడు చూస్తూంటే వచ్చే ఏడాది లో ఎన్నికలు కనిపిస్తున్నాయి. దాంతో రెండు చట్ట సభలలో ఒక్క సభ్యుడు లేని విచిత్ర వాతావరణంలో ఎన్నికలను ఎలా ఎదుర్కోవడం అన్న చర్చ ఆ పార్టీలో తీవ్రంగా సాగుతోంది. ఇక బీజేపీ నుంచి జనసేన మీద ఫస్ట్ టైం అసంతృప్తి బాహాటం అయిన వేళ పవన్ కోరుకున్నట్లుగానే అటు వైపు నుంచే కటీఫ్ అంటే రాజకీయ వ్యూహం పారినట్లేనా అన్నదే చూడాల్సిన మ్యాటర్.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Similar News