వెంకయ్యకు ‘చంద్రగ్రహణం’ వదిలేలాలేదు

Update: 2017-08-08 17:30 GMT
బిడ్డ చచ్చినా పురిటి వాసన పోలేదని మన తెలుగు పల్లెల్లో ఒక సామెత వినిపిస్తూంటుంది. చూడబోతే ప్రస్తుతం ఉపరాష్ట్రపతి కాబోతున్న వెంకయ్యనాయుడు పరిస్థితి కూడా అలాగే తయారయ్యేలా వుంది. రాజకీయాలను వదిలేసుకుని కొన్ని దశాబ్ధాల భాజపా అనుబంధానికి కూడా తిలోదకాలు ఇచ్చేసి... రాజ్యాంగబద్ధ పదవిలోకి తరలిపోతూవుంటే- ఇప్పటికీ కొన్ని ఇబ్బందులు తప్పేలాలేవు. తెలుగురాష్ట్రాల నాయకులు ఆయన నుంచి ఇంకా ఆశిస్తున్న తీరును గమనిస్తే.. రాజకీయ వొత్తిళ్లు, రాజకీయ అనుబంధాలతో కేంద్ర ప్రభుత్వంలో పైరవీలు ఆయన ఇంకా మరికొంతకాలం చేయాల్సివచ్చేలావుంది.

వివరాల్లోకి వెళ్తే సాధారణ- సాధారణంగా అయితే రాజ్యాంగబద్ధ పదవిలోకి వెళ్లిన తర్వాత కేంద్ర ప్రభుత్వంలోని మంత్రులు, అధికారులతో తరచుగా కలుస్తూ పనులు పురమాయించేందుకు యాక్సెస్ తగ్గుతుంది. ఇన్నాళ్లూ తానొక కేంద్రమంత్రి గనుక.. మిగిలిన మంత్రులతో తరచూ మాట్లాడుతూ.. తెలుగు రాష్ట్రాల అవసరాలకు తగినట్లు అక్కడ పావులు కదపడంలో ఆయన చురుగ్గా ఉండేవారు. ఇప్పుడు విధినిర్వహణలో చాలా భాగం బంగళాలోని నాలుగ్గోడలకి పరిమితం కావాల్సివుంటుంది. అయితే సరే ఆయనను ఇప్పటికి, మరెప్పటికి కూడా ఎడా పెడా వాడేసుకోవడం గురించి ఏపీలోని తెలగుదేశం పార్టీ నాయకులకు చాలా ఆలోచనలే ఉన్నటున్నాయి. ఏకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే మంగళవారం నిర్వహించిన పార్టీ సమావేశంలో ఇలాంటి సంకేతాలు ఇచ్చారు. వెంకయ్య ఇప్పటికే రాష్ట్రనికి తనకి చేతనైనంత చేశారని, అయినా ఇక మునుపు కూడా ఆయన పరపతిని మనం ఉపయోగించుకోవాలని  చంద్రబాబు నాయుడు అంటుండడం విశేషం.

కేంద్రం నుంచి రాష్ట్రానికి దక్కవలసిన వాటిని ప్రభుత్వం హక్కుగా సాధించుకోవాలి. అవసరమైతే పోరాడాలి. న్యాయ పోరాటానికైనా వెనుకాడకూడదు. కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉనప్పుడు ఇంత పోరాటం అవసరం కూడా ఏర్పడకూడదు. అంతే తప్ప వెంకయ్యనాయుడు తెలుగు వాడు కావడం వలన ఆయన చేయగల ‘ఫేవర్’ మీద ఆధారపడి రాష్ట్ర ప్రగతిని ప్లాన్ చేసుకోకూడదు. చంద్రబాబు నాయుడు రాష్ట్ర అవసరాలకోసం ఆయన పరపతిని వాడుకోవడానికి ప్రయత్నిస్తే ఆయన పార్టీలోని మరికొందరు నాయకులు.. తమ సొంత పనులకోసం అదే పరపతిని వాడుకోవడానికి ప్రయత్నించవచ్చు. ఇలా వెంకయ్య పరపతిని ఇంకా వాడుకోవాలనే చంద్రబాబు అలోచన వల్ల అత్యున్నత పదవిలో వుండే ఆయనపై మరక పడకూడదు అని పలువురు భావిస్తున్నారు.
Tags:    

Similar News