ఎర్రన్నాయుడి మనవళ్లతో చంద్రబాబు సెల్ఫీలు

Update: 2016-07-23 09:19 GMT
దివంగత టీడీపీ నేత - మాజీ కేంద్ర మంత్రి ఎర్రన్నాయుడిపై చంద్రబాబుకు ఉన్న ప్రత్యేక అభిమానం గురించి వేరేగా చెప్పనవసరం లేదు. ఎర్రన్నాయుడి మరణం తరువాత తనకు కుడిభుజం పోయిందని సందర్భం వచ్చిన ప్రతిసారీ చంద్రబాబు చెబుతుంటారు. ఎర్రన్నాయుడి కుటుంబసభ్యులనూ చంద్రబాబు అంతే అభిమానంగా చూస్తుంటారు. ఏపీ మంత్రివర్గంలో ఉన్న ఎర్రన్నాయుడి తమ్ముడు అచ్చెన్నకు కూడా చంద్రబాబు మంచి ప్రాధాన్యం ఇస్తుంటారు. ఎర్రన్నాయుడి కుమారుడు ఎంపీ రామ్మోహన్ నాయుడుకు కూడ పార్టీలో మంచి ప్రయారిటీయే దక్కుతోంది. తాజాగా చంద్రబాబు అనుకోకుండా ఎర్రన్నాయుడి మనవళ్లతో కాసేపు సరదాగా గడిపారు. అది కూడా వైసీపీ నుంచి టీడీపీలోకి ఫిరాయించిన ఓ నేతను పార్టీలో చేర్చుకున్న సందర్భంగా కావడం విశేషం.

ఇక అసలు విషయంలోకి వస్తే.. వైసీపీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు నిన్న చంద్రబాబు సమక్షంలో విజయవాడలో టీడీపీలో చేరారు. ఆ కార్యక్రమాన్ని ఆదిరెడ్డి కుటుంబమంతా వచ్చింది. ఆదిరెడ్డి భార్య - కొడుకు - కోడలు అందరూ హాజరయ్యారు. కాగా ఆదిరెడ్డి కోడలు భవానీ ఎవరో్ కాదు. ఎర్రన్నాయుడి కుమార్తె. ఆమెతో పాటు ఆమె ఇద్దరు కొడుకులు కూడా వచ్చారు. దాంతో వేదికపై భవానీని చూసిన చంద్రబాబు ఆమెను ఆప్యాయంగా పలకరించి మాట్లాడారు. ఆమె బాగోగులు తెలుసుకోవడంతో పాటు ఎర్రన్నాయుడితో ఉన్న అనుబంధాన్ని ఆ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.

ఆ తరువాత భవానీ ఇద్దరు పిల్లలను దగ్గరకు తీసుకుని వారితోనూ మాట్లాడారు. అంతేకాదు చంద్రబాబు వారితో  సెల్ఫీలు కూడా దిగడం అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది.  కాగా చంద్రబాబు తన మనవడు దేవాన్ష్ తో కూడా గడపలేనంతగా పాలనలో మునిగితేలుతున్నారని తరచూ లోకేశ్ చెబుతున్నారు. ఈ క్రమంలోనే చంద్రబాబు చిన్నపిల్లలను చూడగానే తన మనవడు గుర్తుకొచ్చి వారితో సరదాగా గడిపారని టీడీపీ వర్గాలు అంటున్నాయి.
Tags:    

Similar News