కేసీఆర్ మీద కోపంతో టీడీపీని బీజేపీలోకి విలీనం?

Update: 2019-08-11 14:30 GMT
తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ మీద తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడుకు ఏ రేంజ్ లో కసి ఉందో వేరే చెప్పనక్కనర్లేదు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలప్పుడు తను కోరినట్టుగా పొత్తుకు ఒప్పుకోకపోవడంతోనే కేసీఆర్ మీద చంద్రబాబు నాయుడు కస్సుమనడం ప్రారంభించారు. ఆ విషయాన్ని చంద్రబాబు నాయుడు ఓపెన్ గా చెప్పారు కూడా. తను పొత్తు కోసం ప్రయత్నించినట్టుగా - అయితే కేసీఆర్ మాత్రం పొత్తుకు ఒప్పుకోలేదని చంద్రబాబు నాయుడు పబ్లిక్ గా వాపోయారు.

ఆ తర్వాత కేసీఆర్ మీద కసితో చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ తో చేతులు కలిపారు. కాంగ్రెస్ వ్యతిరేకతే పునాదిగా ఏర్పడిన తెలుగుదేశం పార్టీని కాంగ్రెస్ తో పొత్తుతో ఎన్నికల బరిలోకి దించిన ఘనుడు చంద్రబాబు. అయితే కాంగ్రెస్ తో చేతులు కలిపి చంద్రబాబు నాయుడు తన పతనావస్థను ఆ పార్టీకి కూడా అంటించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ  గనుక చంద్రబాబుతో పొత్తు పెట్టుకోకపోయుంటే కచ్చితంగా మెరుగైన ఫలితాలను సాధించేది.

చంద్రబాబును చూసి ఎక్కువగా ఊహించుకుని కాంగ్రెస్ పార్టీ మొత్తానికే దెబ్బ తింది. అయితే లోక్ సభ సార్వత్రిక ఎన్నికల దగ్గరకు వచ్చేసరికి కూడా చంద్రబాబు కు వాస్తవాలు అర్థం కాలేదు. తెలంగాణలో తన రాజకీయానికి ఎదురుదెబ్బ పడినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు అలర్ట్ కాలేదు. ఆ తర్వాత దేశంలో బీజేపీ ఓడిపోతుందనే లెక్కలతో చంద్రబాబు నాయుడు ఏదేదో చేశారు.

తీరా ఏపీలో ఇరవై మూడు సీట్లకు పరిమితం అయ్యారు. ఇప్పుడు బీజేపీతో రాజీపడాలన్నా జనాలు నవ్వే పరిస్థితి ఉంది చంద్రబాబు విషయంలో. మోడీని అంతలా తిట్టి అప్పుడే మోడీ చెంతకు పోతే జనాలు నవ్వుతారు. అయితే జనాలతో చంద్రబాబుకు అవసరం లేదు. తను చేయాలనుకున్నదే ఆయన చేస్తారు.

అందులో భాగంగా ఇప్పుడు తన వారిని  బీజేపీలోకి పంపుతున్నారు. చంద్రబాబు నాయుడు ఆమోదముద్రతోనే రాజ్యసభ సభ్యులు ఒక్కొక్కరుగా బీజేపీలోకి జంప్ అవుతున్నారనే అభిప్రాయాలే సర్వత్రా వినిపిస్తూ ఉన్నాయి. ఇప్పటికే చేరిన రాజ్యసభ సభ్యులకు తోడూ త్వరలోనే మిగిలిన వారు కూడా జంప్ కాబోతున్నారనే మాట వినిపిస్తూ ఉంది.

ఇక తెలంగాణలోని మిగిలిన తెలుగుదేశం నేతలను కూడా చంద్రబాబు నాయుడే దగ్గరుండి కమలం పార్టీలోకి పంపుతున్నారట. వారు తెలంగాణ రాష్ట్ర సమితిలోకి వెళ్లే అవకాశాలున్న నేపథ్యంలో అలా వద్దని బీజేపీలోకి చేరాలని చంద్రబాబు నాయుడు స్వయంగా చూసిస్తున్నారనే అభిప్రాయాలు వినిపిస్తుండటం గమనార్హం.

కేసీఆర్ మీద కోపం - బీజేపీని ప్రసన్నం చేసుకోవాలనే తాపత్రంతో చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీని కూడా తాకట్టు పెట్టడానికి వెనుకాడంటం లేదని విశ్లేషకులే కాదు, తెలుగుదేశం నేతలు కూడా వ్యాఖ్యానిస్తూ ఉండటం గమనార్హం!
Tags:    

Similar News