బాబు ఓట్ల రాజ‌కీయం..రోజా కొత్త లెక్క‌

Update: 2019-02-10 09:24 GMT
ఓట్ల కొనుగోలు రాజ‌కీయంలో ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు ఎత్తుగ‌డ‌లు తారాస్థాయికి చేరాయ‌ని చిత్తూరు జిల్లా నగరి శాసన సభ్యురాలు, వైసీపీ నేత రోజా మండిప‌డ్డారు. ఎన్నికలు సమీపిస్తుండడంతో సీఎం చంద్రబాబు పథకాల పేరుతో ఓట్లు కోనుగోలు చేస్తున్నారని విమర్శించారు. పసుపు కుంకుమకి పదివేలు ఇస్తామని చెప్పి.. మూడువేలు చెక్కులు ఇవ్వడానికి చంద్రబాబుకు సిగ్గులేదా అని ఘాటుగా ప్రశ్నించారు. పసుపు కుంకుమలను తుడిచే విధంగా పాలన చేస్తున్నారని రోజా మండిపడ్డారు.

రోజా ఆదివారం ఉదయం వీఐపీ దర్శన సమయంలో శ్రీ‌వారి ఆలయానికి చేరుకుని స్వామివారి సేవలో పాల్గొన్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో అర్చకులు ఎమ్మెల్యే రోజాకు తీర్థ ప్రసాదాలు అందించారు. అనంతరం రోజా మీడియాతో మాట్లాడుతూ... డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేస్తాను అని మోసం చేసిన చంద్రబాబును.. మహిళలు అన్నా అని కాదు దున్నా అని పిలుస్తారని రోజా అన్నారు. గతంలో వెయ్యి పింఛను ఇవ్వడానికే అష్టకష్టాలు పడ్డ చంద్రబాబు ఎన్నికలు ఉన్నందునే ఇప్పుడు రెండవేలు ఇస్తున్నారని అన్నారు. పథకాలను అరకొరగా అమలు చేసి టీడీపీకే ఓటు వెయ్యాలని ప్రమాణం చేయిస్తున్నారంటే ఆయన ఎంత దిగజారిపోయారో అర్థమవుతోందని వ్యాఖ్యానించారు.  డ్వాక్రా మహిళల రుణాలు, రైతులరుణాల మాఫీ చెసిన తరువాతనే టీడీపీ ఎన్నికలకు వెళ్లాలని రోజా డిమాండ్‌ చేశారు.

ప్ర‌త్యేక హోదాపై చంద్ర‌బాబుది పూర్తిగా ఎన్నిక‌ల రాజ‌కీయ‌మ‌ని రోజా మండిపడ్డారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని తిరుపతి సభలో ప్రధాని మోదీతో సహా, చంద్రబాబు, పవన్‌ కళ్యాన్ చెప్పార‌ని పేర్కొంటూ నాలుగేళ్ల పాటు ఎందుకు ఆ విష‌యం ప్ర‌స్తావించ‌లేద‌న్నారు. ప్యాకేజీ కోసం చంద్రబాబు యూటర్న్‌ తీసుకున్నారని, వైఎస్‌ జగన్‌ కారణంగా హోదా పోరాటం ఇంకా కొనసాగుతోందని ఆమె వ్యాఖ్యానించారు. చంద్రబాబుకు నిజంగా హోదాపై చిత్తశుద్ధి ఉంటే మోడీ ఎదుట నిరసన వ్యక్తం చేయాలని సవాలు చేశారు. త‌మ పాల‌న వైఫ‌ల్యాలు ఎక్క‌డ బ‌య‌ట‌ప‌డతాయో అని బాబు తాజాగా కేంద్రంపై విమ‌ర్శ‌లు చేస్తున్నార‌ని వ్యాఖ్యానించారు.


Tags:    

Similar News