వ్యాక్సిన్​ పంపిణీ పై కేంద్రం సంచలన నిర్ణయం.. తొలి దశలో కోటి మందికి..!

Update: 2020-11-25 04:00 GMT
ప్రపంచవ్యాప్తంగా పలు ఫార్మా కంపెనీలు తయారు చేస్తున్న వ్యాక్సిన్లు విజయవంతమవుతున్నాయి. ఇప్పటికే మొదటి, రెండో దశ క్లినికల్ ట్రయల్స్​ పూర్తిచేసుకొన్నాయి. మూడోదశ ట్రయల్స్​ పూర్తైన వెంటనే వ్యాక్సిన్​ అందుబాటులోకి రానున్నది. ఇంకో రెండు మూడు నెలల్లో వ్యాక్సిన్ వచ్చే అవకాశం ఉంది. అయితే కేంద్రప్రభుత్వం వ్యాక్సినేషన్​పై సమాలోచనలు చేస్తున్నది. ముందుగా ఆరోగ్యకార్యకర్తలకు ఇవ్వాలని ఇప్పటికే నిర్ణయించారు. ఈ మేరకు అన్ని రాష్ట్రాల నుంచి సమాచారాన్ని సేకరిస్తున్నారు. నిన్న వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో జరిగిన సమావేశంలో ప్రధాని నరేంద్రమోదీ ఈ మేరకు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

దేశంలో ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్​ ఆస్పత్రులు అక్కడ పనిచేస్తున్న సిబ్బందిపై కేంద్రప్రభుత్వం సమాచారం సేకరిస్తున్నది. ఇప్పటికే దేశవ్యాప్తంగా 92 శాతం ప్రభుత్వ ఆస్పత్రులు, 55 శాతం ప్రైవేట్​ ఆస్పత్రుల నుంచి సమాచారం సేకరించారు. అయితే తొలిదశలో కోటిమంది ఆరోగ్యకార్యకర్తలకు వ్యాక్సిన్​ ఇవ్వనున్నారు. ప్రధాని నరేంద్రమోదీ మంగళవారం వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్​ నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన పలు విషయాలపై మాట్లాడారు. వ్యాక్సిన్​ పంపిణీకి అన్ని రాష్ట్రాలు సహకరించాలని కోరారు. ముందుగా ఆరోగ్య సిబ్బందికి వ్యాక్సిన్​ అందజేయాలని ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు వ్యాక్సిన్ వచ్చేవరకు ప్రజలకు తగిన జాగ్రత్తలు ఇవ్వాలని కూడా కోరారు.

దేశ ప్రజలందరికీ ప్రభుత్వం వ్యాక్సిన్​ పంపిణీ చేస్తుందనికూడా ప్రధాని స్పష్టం చేశారు. ఇందుకోసం ఆయా రాష్ట్రాలు సహకరించాలన్నారు. ఈ సమావేశంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్​, ఏపీ సీఎం జగన్​ పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర ఆరోగ్యశాఖ అధికారులు పాల్గొన్నారు. తెలంగాణలో ఇప్పటికే వ్యాక్సిన్ పంపిణీకి ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నట్లు మంగళవారం సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఏపీలో కూడా కేంద్రం వ్యాక్సిన్ పంపిణీ చేస్తే పంపిణీ చేయడంపై తగిన సన్నాహాలు చేస్తున్నారు.
Tags:    

Similar News