పేటీఎంకు ఆర్ బీఐ షాక్ వేళ.. సామాన్యుల సంగతేంటి?

అంతేకాదు.. పేటీఎం యాప్, యూపీఐ, సౌండ్‌బాక్స్, క్యూఆర్ కోడ్ తో పాటు.. ఇతర మర్చంట్ సేవలు ఇతర భాగస్వామ్య బ్యాంకులతో కలిసి యథావిధిగా కొనసాగుతాయని భరోసా ఇచ్చింది.;

Update: 2026-04-25 05:28 GMT

నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించటం.. తాము ఎన్నిసార్లు చెప్పినా తన తీరు మార్చుకోని పేటీఎంకు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యేలా భారత రిజర్వు బ్యాంకు భారీ షాకిచ్చింది. ఏప్రిల్ 24 (శుక్రవారం) సాయంత్రం పని గంటలు ముగిసిన వెంటనే లైసెన్స్ రద్దు నిర్ణయం అమల్లోకి వస్తుందని ఆర్ బీఐ ప్రకటించింది. అంతేకాదు.. బ్యాంకును పూర్తిగా మూసివేసే ప్రక్రియ కోసం ఆర్ బీఐ హైకోర్టును ఆశ్రయిస్తారని చెబుతున్నారు.

రిజర్వు బ్యాంక్ నిర్ణయంపై పేటీఎం స్పందించింది. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ అనేది ఒక ప్రత్యేక విభాగంగా పేర్కొంటూ.. దానికి వన్ 97 కమ్యూనికేషన్స్ (పేటీఎం మాతృ సంస్థ)కు నేరుగా సంబంధం లేదని పేర్కొంది. లైసెన్స్ రద్దు వల్ల తమ ప్రధాన వ్యాపారంపై ఎలాంటి ఆర్థిక ప్రభావం ఉండదని పేర్కొంది. ఎందుకంటే ఇప్పటికే ఆ బ్యాంకులో ఉన్న పెట్టుబడుల విలువను సున్నాగా పరిగణించామని తెలిపింది.

అంతేకాదు.. పేటీఎం యాప్, యూపీఐ, సౌండ్‌బాక్స్, క్యూఆర్ కోడ్ తో పాటు.. ఇతర మర్చంట్ సేవలు ఇతర భాగస్వామ్య బ్యాంకులతో కలిసి యథావిధిగా కొనసాగుతాయని భరోసా ఇచ్చింది. అయితే.. ఇలాంటి వేళ సగటు జీవి ఏం చేస్తే మంచిది? అన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్న. ఆర్ బీఐ చెప్పే వాదనకు.. పేటీఎం ఇచ్చే వివరణ లోతుల్లోకి వెళ్లే కన్నా.. సామాన్యుడు.. సగటు జీవి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏం చేయటం అత్యుత్తమ మార్గం అన్నది అసలు ప్రశ్న. ఇక్కడ సామాన్యులు ఒకటైతే.. వ్యాపారులు మరో తీరు. వీరిద్దరి విషయంలో ఏమేం చేస్తే మంచిది? అన్న ప్రశ్నకు సమాధానాలు వెతికితే.. ఆసక్తికర అంశాలు కనిపిస్తాయి. ఈ అంశంపై పలువురు నిపుణులను సంప్రదించినప్పుడు వారిస్తున్న సలహాలు.. సూచనలు ఇవే.

తొలుత సామాన్యుల విషయానికి వస్తే..

- మీ బ్యాంక్ ఖాతాలో ఉన్న బ్యాలెన్స్ ను మీరు వాడుకోవచ్చు. విత్ డ్రా చేసుకోవచ్చు.

- అయితే.. ఆ ఖాతాలోకి కొత్తగా డబ్బులు జమ చేయటం కుదరదు

- మీ జీతం.. గ్యాస్ సబ్సిడీ లాంటివి పేటీఎం బ్యాంక్ ఖాతాలో పడుతుంటే మాత్రం వెంటనే దాన్ని వేరే బ్యాంక్ ఖాతాలోకి మార్చుకోవాలి.

- మీ వాలెట్ లో ఉన్న డబ్బును ఖర్చు చేసుకోవచ్చు. లైసెన్స్ రద్దుతో వాలెట్ ను కొత్తగా రీఛార్జ్ చేసుకోవటం నిలిచిపోతుంది.

- ఒకవేళ మీరు యూపీఐ ఐడీ వాడుతుంటే.. అది వేరే బ్యాంకులతో లింక్ అయి ఉంటే ఎప్పటిలానే ఇది పని చేస్తు8ంది.

- ఒకవేళ మీ యూపీఐ అకౌంట్ నేరుగా పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ఖాతాకే లింకు చేసి ఉంటే మాత్రం.. అది పని చేయదు. అలాంటప్పుడు వేరే బ్యాంక్ ఖాతాను లింక్ చేసుకోవాల్సి ఉంటుంది.

- పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ జారీ చేసిన ఫాస్టాగ్‌లు ఇకపై రీఛార్జ్ చేయడానికి వీలుండదు. బ్యాలెన్స్ అయిపోయిన తర్వాత కొత్త బ్యాంక్ ఫాస్టాగ్ తీసుకోవాల్సిందే.

వ్యాపారస్తుల సంగతేంటి?

- పేటీఎం క్యూఆర్ కోడ్, సౌండ్‌బాక్స్, కార్డ్ మెషీన్లు ఎప్పటిలాగే పనిచేస్తాయి.

- ఎందుకంటే పేటీఎం ఇప్పుడు ఇతర ప్రధాన బ్యాంకులతో కలిసి ఈ సేవలను అందించటమే.

- వ్యాపారులు తమ పేటీఎం క్యూఆర్ కోడ్ ద్వారా వచ్చే డబ్బుల్ని ఒకవేళ పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ఖాతాలోకి వెళుతుంటే మాత్రం వెంటనే వేరు ఇతర బ్యాంకు ఖాతాకు మార్చుకోవాలి.

- ఒకవేళ అలా చేయకుంటే.. డబ్బులు వస్తాయి కానీ, సదరు పేటీఎం ఖాతా నుంచి వాడుకోవటం కష్టమవుతుంది.

- సౌండ్‌బాక్స్/ క్యూఆర్ కోడ్ ప్రస్తుతం పనిచేస్తుంటే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే.. పేటీఎం ఇప్పటికే ఇతర బ్యాంకులు (యాక్సిస్.. హెచ్ డీఎఫ్ సీ, ఎస్ బ్యాంక్) ఒప్పందం చేసుకుంది.

- ఈ కారణంగా అవి పని చేస్తాయి. అయితే.. ఏ బ్యాంకుకు లింక్ అయి ఉన్నాయని చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది.

- వ్యాపార లావాదేవీలకు సంబంధించి పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ఖాతాలో ఇకపై ఎలాంటి కొత్త డిపాజిట్లు లేదంటే క్రెడిట్స్ జరగవు. ఈ నేపథ్యంలో కస్టమర్ల నుండి వచ్చే పేమెంట్లు నేరుగా ఇతర బ్యాంక్ అకౌంట్‌కు వెళ్లేలా సెట్టింగ్స్ మార్చుకోవాలి.

- పేటీఎం ద్వారా ఏదైనా బిజినెస్ లోన్ తీసుకుని, దానికి సంబంధించిన ఈఎంఐలు పేటీఎం బ్యాంక్ అకౌంట్ నుండి కట్ అవుతుంటే, ఆ ఆటో-డెబిట్ ఆప్షన్‌ను వేరే బ్యాంక్ ఖాతాకు మార్చుకోవాలి. లేదంటే ఈఎంఐ బౌన్స్ అయ్యే అవకాశం ఉంది.

- పేటీఎం యాప్‌లో వచ్చే 'బిజినెస్ నోటిఫికేషన్స్'ను తరచూ చూస్తూ ఉండండి. బ్యాంకింగ్ భాగస్వాముల మార్పు గురించి వారు ఇచ్చే సూచనలను పాటించాలి.

Tags:    

Similar News