పోలవరంపై మోడీ సర్కారు మరో కొర్రీ.. విన్నంతనే కాలుద్ది

Update: 2020-10-31 06:30 GMT
ఇవ్వటం ఇష్టం లేకుంటే.. ఎలాంటి మాటలు వస్తాయో.. తాజాగా పోలవరం ప్రాజెక్టు విషయంలో మోడీ సర్కారు చెబుతున్న మాటలు ఇదే విషయాన్ని గుర్తు చేస్తున్నాయి. ఇప్పటికే ప్రాజెక్టు వ్యయంపై భారీగా కోత పెట్టి షాకిచ్చిన కేంద్రం.. పునరావాసంతో సంబంధం లేదన్న బాంబు పేల్చటం తెలిసిందే. ఇవన్ని సరిపోనట్లుగా.. తాజాగా మరో షాకింగ్ నిర్ణయాన్ని తీసుకుంది. తాజాగా పెట్టిన కోత గురించి తెలిస్తే.. ఒళ్లు మండిపోవటమే కాదు.. అసలు పోలవరం ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టేనా? అన్న సందేహం కలుగక మానదు.,

కొర్రీల మీద కొర్రీలు పెడుతూ షాకులిస్తున్న కేంద్ర ప్రభుత్వం.. పోలవరంపై  తనకున్న కమిట్ మెంట్ ఏ పాటిదన్న విషయాన్ని చెప్పకనే చెప్పేస్తుందని చెప్పాలి. పోలవరం ప్రాజెక్టులో భాగంగా తాగునీటి సరఫరా.. విద్యుత్ కేంద్రం నిర్మాణానికి నిధులు ఇవ్వరాదని నిర్ణయించటం గమనార్హం. కేంద్ర జలశక్తి శాఖ తీసుకున్న ఈ నిర్ణయం వెనుక ఎవరున్నారన్నది తెలిసిందే. ఇప్పటివరకు ప్రాజెక్టు అంచనాలపై కొర్రీలు పెట్టిన కేంద్రం.. తాజాగా చెబుతున్న అంశాల్ని చూస్తుంటే.. పోలవరం ప్రాజెక్టును పూర్తి కావాలన్న ఉద్దేశంలో లేదా? అన్న సందేహం కలుగక మానదు.

తాజా లెక్కల ప్రకారం తాగునీటి విభాగానికి.. విద్యుత్ కేంద్ర నిర్మాణానికి నిధులు ఇవ్వమని తేల్చటమే కాదు.. మరో ఫిట్టింగ్ కూడా పెట్టేసింది. 2014 ఏప్రిల్ ఒకటి నాటి ధరల పరకారం అంనాలు లెక్కించి మాత్రమే ఇస్తామని.. ఇప్పటికే ఇచ్చిన మొత్తంలో తాగునీటి సరఫరా.. విద్యుత్ కేంద్రం నిర్మాణానికి ఏమైనా నిధులు ఇచ్చి ఉంటే.. రాబోయే రోజుల్లో ఇచ్చే నిధుల్లో ఆ మొత్తాల్ని కట్ చేసుకొని ఇస్తామని చెప్పిన వైనం షాకింగ్ గా మారింది.

పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటివరకు ఖర్చు చేసిన మొత్తానికి.. కేంద్రం నుంచి రావాల్సిన బకాయిలే రూ.2234 కోట్లు ఉన్నాయి. ఈ మొత్తాన్ని వెంటనే విడుదల చేయాలని ఏపీ ప్రభుత్వం కోరుతోంది. తాజాగా పెట్టిన కొర్రీ చూస్తుంటే.. నిధుల విడుదల విషయంలో కేంద్రం అంత ఆసక్తి లేదన్న విషయాన్ని తాను పెట్టే కొర్రీలతో స్పష్టం చేస్తుందని చెప్పాలి. ఒక ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టు అనుకున్న తర్వాత.. దానికి ఆ హోదా వచ్చిన తర్వాత.. ప్రాజెక్టులో పలానా అంశం తమకు సంబంధం లేదన్నట్లు మాట్లాడటం సరికాదంటున్నారు.

అందుకు భిన్నంగా కేంద్రం వ్యవహరిస్తున్న తీరు చూస్తే..పోలవరం ప్రాజెక్టు విషయంలో కేంద్రాన్ని నమ్మితే మిగిలేది గుండు సున్నా అన్న అభిప్రాయాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు. కేంద్రం నుంచి రావాల్సిన మొత్తాల్ని ముక్కుపిండి వసూలు చేయాలంటే రాజకీయ ఒత్తిడి చాలా అవసరం. బీజేపీకి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అలాంటి అవసరాలేమీ లేవన్నది నిజం. ఇలాంటప్పుడు కొత్త కొత్త కొర్రీలతో.. పాత అంచనాలకు చెందిన మొత్తాల్ని ఇచ్చేందుకు సైతం సిద్ధంగా లేదన్న భావన కలుగక మానదు. అదే జరిగితే.. ఏపీకి జరిగే నష్టం భారీగా ఉంటుందని చెప్పక తప్పదు. తాజాగా పెట్టిన కొర్రీ గురించి విన్నంతనే ఒళ్లు మండక మానదు.
Tags:    

Similar News