ఇంటర్ స్టేట్ జర్నీ... నిబంధనల్లో క్లారిటీ లేదబ్బా

Update: 2020-05-30 16:00 GMT
ప్రపంచ దేశాలను గడగడలాడించిన కరోనా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో అమల్లోకి వచ్చిన లాక్ డౌన్... మన దేశంలో ఇప్పుడ్పుడే ముగిసేలా లేదు. ఇప్పటికే నాలుగు దశల లాక్ డౌన్ లు ముగిసిపోతుండగా.. కొత్తగా సోమవారం నుంచి ఐదో విడత లాక్ డౌన్ అమల్లోకి రానుంది. మిగిలిన నాలుగు లాక్ డౌన్ల కంటే కాస్తంత సుదీర్ఘంగా నెల రోజుల పాటు అమల్లో ఉండనున్న ఐదో దశ లాక్ డౌన్ లో కంటైన్మెంట్ పరిధిలో లేని ప్రాంతాల్లో పూర్తి స్థాయి సడలింపులు ఇస్తున్నట్లుగా కేంద్రం ప్రకటించినా... అంతరాష్ట్ర ప్రజా రవాణాకు సంబందించి మాత్రం కాస్తంత గందరగోళం నెలకొందన్న వాదన వినిపిస్తోంది. అంతరాష్ట్ర రవాణాకు సంబంధించి ఎలాంటి పాసులు అక్కర్లేదని కేంద్రం చెబుతున్నా... పొరుగు రాష్ట్రాలకు చెందిన ప్రజల ఎంట్రీని ఆయా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రొంతాల అభీష్టం మేరకు వ్యవహరించవచ్చని చెప్పడంతోనే ఈ గందరగోళం నెలకొందన్న వాదనలు వినిపిస్తున్నాయి.

శనివారం సాయంత్రం కేంద్ర ప్రభుత్వం నుంచి ఐదో విడత లాక్ డౌన్ ప్రకటన రాగానే... జనం అంతా అంతరాష్ట్ర రవాణాకు చెందిన నిబంధనలు ఏమైనా వచ్చాయా? అన్న దిశగా ఆసక్తిగా ఎదురు చూశారు. అయితే ఈ విషయంపై పెద్దగా క్లారిటీ లేకుండానే వ్యవహరించిన కేంద్రం... కంటైన్మెంట్ జోన్లు మినహా మిగిలిన ప్రాంతాల్లో ఆంక్షలను భారీ ఎత్తున సడలిస్తున్నట్లుగా ప్రకటించింది. అంతేకాకుండా ఆంక్షలు ఇకపై కేవలం కంటైన్మెంట్ జోన్లకే పరిమితమవుతన్నట్లుగా కూడా కేంద్రం ప్రకటించింది. అయితే ఆయా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు... తమ ప్రాంతాల్లో నెలకొన్న పరిస్థితులను బేరీజు వేసుకుని అంతరాష్ట్ర ప్రజా రవాణాపై నిషేధం విదించుకోవచ్చంటూ కేంద్రం ఓ మెలిక పెట్టేసింది. దీంతో ఐదో విడత లాక్ డౌన్ లో అంతరాష్ట్ర ప్రజా రవాణాపై గందరగోళం నెలకొందనే చెప్పక తప్పదు.
Read more!

కేంద్రం ఇచ్చిన ఈ వెసులుబాటుతో ఏదేని రాష్ట్రంగా గానీ, కేంద్రపాలిత ప్రాంతం గానీ.. తన పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చే ప్రజలను తమ ప్రాంతంలోకి అనుమతించేందుకు నిరాకరించొచ్చు. అంటే ఐదో విడత లాక్ డౌన్ లో కూడా మనకు ఏదేనీ రాష్ట్రంలో పని ఉందని ఆ రాష్ట్రానికి స్వేచ్ఛగా వెళ్లే అవకాశం లేదన్న మాట. ఎందుకంటే... కేంద్రం ప్రకటించిన లాక్ డౌన్ నిబంధనలను అదనంగా మనం వెళ్లానుకునే రాష్ట్రం ఎలాంటి నిబంధనలు పెట్టిందన్న విషయాన్ని తెలుసుకున్న తర్వాత గానీ మన ప్రయాణం ముందుకు సాగదన్న మాట. మొత్తంగా ఐదో విడత లాక్ డౌన్ ను ప్రకటిస్తూనే... కంటైన్మెంట్ జోన్ల వెలుపలి ప్రాంతాలకు భారీ ఊరటనిచ్చిన కేంద్రం.. అంతరాష్ట్ర ప్రజా రవాణాకు సంబంధించి మాత్రం పూర్తి క్లారిటీ ఇవ్వలేదనే చెప్పాలి.
Tags:    

Similar News