వాడు యమా డేంజర్..రైల్వే బ్రిడ్జ్ మీద ఒంటరి మహిళలకు ముద్దులు పెట్టేస్తాడు

Update: 2020-02-07 08:06 GMT
దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో మహిళలకు ఈ మధ్య పెద్ద తలనొప్పి పట్టుకుంది. రైల్వే బ్రిడ్జులపై ఒంటరిగా వెళ్లే మహిళలపై ఒక్కసారిగా మీద పడి ముద్దులు పెట్టేసే శాడిస్టు ఒకడు తయారయ్యాడు. వీడికి సంబంధించిన సమాచారాన్ని ముంబయి పోలీసులు సీసీ టీవీ ఫుటేజ్ తో గుర్తించారు.

ఈ ముద్దుల శాడిస్ట్ కారణంగా ఇబ్బందులకు గురైన మహిళలు.. తమకు ఎదురైన దారుణ అనుభవాన్ని ఎవరికి చెప్పుకోలేక కుమిలిపోతున్నారు. కంప్లైంట్ చేసేందుకు ముందుకు రావటం లేదు. దీంతో.. పోలీసులే స్వయంగా రంగంలోకి దిగారు. సివిల్ వేషంలోకి మారిపోయిన పోలీసులు.. ఎలాంటి అనుమానం రాకుండా రైల్వే బ్రిడ్జిల మీద కాపు కాశారు.

ఈ క్రమంలో ఒంటరి మహిళపై ముద్దులు పెట్టేందుకు ప్రయత్నించే క్రమంలో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొన్నారు. తమదైన స్టైల్లో విచారణ షురూ చేసిన తర్వాత అతగాడికి సంబంధించిన వివరాలు బయటకు వచ్చాయి. ఇతడిది ఉత్తరప్రదేశ్ కు చెందిన రాయ్ జూర్ హబీబర్ గా గుర్తించారు. వడ్రంగి పని చేసే ఇతగాడు.. రైల్వే వంతెనల మీద ఒంటరిగా వెళ్లే మహిళల్ని టార్గెట్ చేసుకొని ముద్దులతో దాడి చేస్తుంటాడు. వారు ఆ షాక్ లో ఉండగానే పారి పోతుంటాడు.

తాజాగా అదుపులోకి ఇతగాడికి ఇప్పటికే పెళ్లై.. పిల్లలు ఉండటం గమనార్హం. ఒంటరిగా ఉన్న మహిళల పై వేధింపులకు దిగుతున్న ఇతగాడి పై ఐపీసీ సెక్షన్ 379 కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. గతంలో ఇతగాడి మీద ఎవరూ ఫిర్యాదు చేయకపోవటంతో.. బాధిత మహిళలు ఎవరైనా ముందుకు రావాలని కోరుతున్నారు. ఎవరైనా వచ్చి కంప్లైంట్ చేస్తే కేసు మరింత బలంగా మారుతుందన్నది పోలీసుల వాదన. దీంతో.. ఇతగాడి చేష్టల గురించి సమాచారాన్ని మీడియా కు అందించారు. మరి.. ముంబయి పోలీసుల ప్లాన్ వర్కవుట్ అవుతుందేమో చూడాలి.
Tags:    

Similar News