కండోమ్ పై కూడా యుద్ధ ప్రభావం.. ఇక ధరలు పెంచక తప్పదా..?

యుద్ధం అంటే కేవలం తుపాకులు, బాంబులు మాత్రమే కాదు.. అది మన దైనందిన జీవితంలోని అత్యంత వ్యక్తిగత వస్తువులపై కూడా ప్రభావం చూపుతుందని నిరూపితమైంది.;

Update: 2026-03-29 04:56 GMT

యుద్ధం అంటే కేవలం తుపాకులు, బాంబులు మాత్రమే కాదు.. అది మన దైనందిన జీవితంలోని అత్యంత వ్యక్తిగత వస్తువులపై కూడా ప్రభావం చూపుతుందని నిరూపితమైంది. పశ్చిమాసియాలో సాగుతున్న ఉద్రిక్తతలు ఇప్పుడు నేరుగా ఫ్యామిలీ ప్లానింగ్, లైంగిక ఆరోగ్య రంగంపై పడ్డాయి. కేవలం ముడిసరుకుల కొరత మాత్రమే కాదు.., వాటి ధరలు ఆకాశాన్ని తాకడంతో హెచ్ఎల్ఎల్ లైఫ్ కేర్, మాన్‌కైండ్ ఫార్మా వంటి దిగ్గజ సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ వింతైన, తీవ్రమైన సంక్షోభం వెనుక అసలు కారణాలను పరిశీలిస్తే..

ముడిసరుకుల సంక్షోభం

కండోమ్‌ల తయారీలో లూబ్రికేషన్ (జారుడు స్వభావం) కోసం సిలికాన్ ఆయిల్ అత్యంత కీలకం. యుద్ధం కారణంగా అంతర్జాతీయ సరఫరా గొలుసు దెబ్బతినడంతో ఈ ఆయిల్ లభ్యత తగ్గిపోయింది. సిలికాన్ ఆయిల్ లేకపోతే కండోమ్‌ల నాణ్యత దెబ్బతినడమే కాకుండా, వాటి వినియోగం కూడా కష్టంగా మారుతోంది. తయారీ కంపెనీలకు ఇప్పుడు ఈ ఆయిల్ సంపాదించడం పెద్ద సవాలుగా మారింది.

అకాశాన్నంటిన అమోనియా ధరలు..

కండోమ్ తయారీలో లాటెక్స్ (రబ్బరు) చిరిగిపోకుండా, దృఢంగా ఉండేందుకు కాపాడేది అమ్మోనియానే. దీని ధరలు పెరగడమే కాకుండా లభ్యత కూడా తక్కువగా ఉంది. భారత్ తన అవసరాలకు కావాల్సిన 86 శాతం అమ్మోనియాను గల్ఫ్ దేశాల నుంచే దిగుమతి చేసుకుంటుంది. హార్ముజ్ జలసంధి మూసివేతతో జలసంధి గుండా రవాణా నిలిచిపోవడంతో అమ్మోనియా ధరలు ఏకంగా 40 నుంచి 50 శాతం పెరిగాయి. దీనివల్ల తయారీ వ్యయం విపరీతంగా పెరిగి కంపెనీలపై అదనపు భారం పడుతోంది.

ధరల పెంపు అనివార్యం

తయారీ ఖర్చులు పెరగడంతో కండోమ్‌ ధరలను పెంచక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే గ్యాస్, పెట్రోల్ ధరల పెరుగుదలతో సతమతం అవుతున్న ప్రజలకు, ఇప్పుడు గర్భనిరోధక సాధనాల ధరలు కూడా పెరగడం ఆందోళన కలిగించే విషయం. ఇది పరోక్షంగా జనాభా నియంత్రణ కార్యక్రమాలపై, సురక్షిత లైంగిక అలవాట్లపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.

---

కుటుంబ నియంత్రణకు 'బ్రేక్'..

భారతదేశం వంటి భారీ జనాభా ఉన్న దేశంలో కండోమ్‌ల లభ్యత తగ్గడం అనేది కేవలం ఒక వస్తువు కొరత మాత్రమే కాదు.. అది ఒక సామాజిక సమస్యగా తలెత్తే ప్రమాదం లేకపోలేదు..

ధరల భారంతో దూరం: మధ్య తరగతి, పేదలు ధరలు పెరిగితే కండోమ్‌ల వాడకాన్ని తగ్గించే ప్రమాదం ఉంది. ఇది అవాంఛిత గర్భధారణలకు దారితీయవచ్చు.

ప్రభుత్వ పథకాలపై ప్రభావం: హెచ్‌ఎల్‌ఎల్ లైఫ్ కేర్ వంటి ప్రభుత్వ సంస్థలు తక్కువ ధరకే కండోమ్‌లను సరఫరా చేస్తాయి. ఇప్పుడు ముడిసరుకుల ధరలు 50% పెరగడం వల్ల ప్రభుత్వంపై సబ్సిడీ భారం పెరుగుతుంది, ఫలితంగా పంపిణీలో జాప్యం జరగవచ్చు.

లైంగిక ఆరోగ్యానికి ముప్పు

కండోమ్ అనేది కేవలం గర్భనిరోధక సాధనం మాత్రమే కాదు, అది ప్రాణాంతక వ్యాధుల నుంచి రక్షణ కవచం. రక్షణ లేని సంబంధాలు: కండోమ్ ల కొరత ఏర్పడితే, సురక్షితం కాని లైంగిక సంబంధాలు పెరిగే అవకాశం ఉంది. ఇది హెచ్‌ఐవీ (HIV), ఇతర లైంగిక సంక్రమణ వ్యాధుల (STDs) వ్యాప్తికి కారణం కావచ్చు.

యుద్ధం తెచ్చిన చిక్కు: ఎక్కడో పశ్చిమాసియాలో హార్ముజ్ జలసంధి మూసివేత వల్ల ఇక్కడ సామాన్యుడి ఆరోగ్య భద్రత దెబ్బతినడం అనేది అంతర్జాతీయ సరఫరా గొలుసులోని లోపాలను ఎత్తిచూపుతోంది. సిలికాన్ ఆయిల్, అమ్మోనియా వంటి రసాయనాల కోసం కేవలం ఒకే ప్రాంతంపై ఆధారపడటం వల్ల ఇలాంటి విపత్తులు ఎదురవుతున్నాయి.

పశ్చిమాసియా యుద్ధం వల్ల అంతర్జాతీయంగా చమురు సంక్షోభమే కాకుండా, ఇలాంటి నిత్యావసర రసాయనాల కొరత ఏర్పడడం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఎంతగా పెనవేసుకుపోయిందో అర్థం చేసుకోవచ్చు. కండోమ్‌ల కొరత ఏర్పడితే అది ఆరోగ్యపరమైన సమస్యలకు దారితీయవచ్చు. ప్రభుత్వం ముందస్తుగా జోక్యం చేసుకొని, ఇతర దేశాల నుంచి అమ్మోనియా, సిలికాన్ ఆయిల్ దిగుమతి చేసుకునేలా ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాల్సిన అవసరం ఉంది.

Tags:    

Similar News