మేం వెన‌క్కు పోవ‌ట్లే..నువ్వు ప్ర‌శ్నించు ప‌వ‌న్‌

Update: 2018-02-20 13:52 GMT
కేంద్ర ప్ర‌భుత్వంపై అవిశ్వాసం విష‌యంలో జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ కామెంట్లు బాధాక‌ర‌మ‌ని వైఎస్‌ ఆర్‌ సీపీ సీనియర్‌ నాయకులు బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. కేంద్రంపై అవిశ్వాస తీర్మానం పెట్టడంలో వెనుకడుగు వేసే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. ప్రత్యేక హోదా సాధనకు వైఎస్‌ ఆర్‌ సీపీ ఎంతటి పోరాటానికైనా సిద్ధమే అని వెల్లడించారు. అయితే అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇవ్వాలని టీడీపీకి పవన్‌ చెప్పలేరా అని నిలదీశారు. ప్ర‌శ్నించేందుకు ఉన్నాన‌ని చెప్పే ప‌వ‌న్ ఈ ఒక్క విష‌యాన్ని అయినా..ప్ర‌జ‌ల కోసం ప్ర‌శ్నించాల‌ని కోరారు.

ప్రత్యేక హోదా సాధనకు వైయస్‌ ఆర్‌ సీపీ చిత్తశుద్ధితో పోరాడుతుందని బొత్స స‌త్య‌నారాయ‌ణ‌ తెలిపారు. టీడీపీ - జనసేన పార్టీలు చేస్తున్న ప్రయత్నాలు పక్కదారి పట్టించేలా ఉన్నాయని మండిపడ్డారు. టీడీపీ దోపిడీ చేస్తుంటే పవన్‌ కళ్యాణ్‌ ప్రశ్నించా అని నిలదీశారు. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ ఇటీవల పార్లమెంట్లో కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ లో ఏపీకి  ప్రజలను నిరాశపరిచిందన్నారు. ఇది రాష్ట్రానికి మంచిది కాదని మేం పలు దపాలుగా ఉద్యమించామన్నారు. బడ్జెట్‌ ప్రవేశపెట్టిన 16 రోజుల తరువాత  ముఖ్యమంత్రి చంద్రబాబు అజ్ఞాతం వీడి బయటకు వచ్చి అప్పుడు బడ్జెట్‌లో కేటాయింపులు లేవని సన్నాయి నొక్కులు నొక్కడం - మొసలి కన్నీరు కార్చాడం మొదలుపెట్టారన్నారు. ఆఖరి అస్త్రం కోసం బాబు ఇంకెన్నాళ్లు ఎదురుచూస్తారని ప్రశ్నించారు.

పవన్‌ కళ్యాణ్‌ జేఎఫ్‌ ఎఫ్‌ సీ అనే పేరుతో సదస్సులు పెట్టి కేంద్రం ఏం ఇచ్చిందో లెక్కలు తీసి మిత్రపక్షాన్ని వెనుకేసుకొచ్చారని బొత్స మండిప‌డ్డారు. మీ మిత్రపక్షాన్ని ఏమి అనకుండా ప్రతిపక్షంపై విమర్శలు చేస్తారా అని బొత్స సత్యనారాయణ పవన్‌ ను నిలదీశారు. ఇదేనా ప్రజలపై మీకుండే ప్రేమ అని ప్రశ్నించారు. `ఇది తప్పు పవన్‌. ఒక్క పార్లమెంట్‌ సభ్యుడు అవిశ్వాస తీర్మానం పెట్టవచ్చు అని చంద్రబాబుకు ఎందుకు చెప్పలేకపోయారు?` అని నిలదీశారు. ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకురావడానికి మా మిత్రపక్షానికి ఓటు వేయమని పవన్‌ అడిగింది వాస్తవం కాదా అన్నారు. ఈ నాలుగేళ్లలో ఏ ఒక్కసారైనా మీరు మీ మిత్రపక్షాన్ని ప్రశ్నించారా అని ధ్వజమెత్తారు.

పవన్‌ మీడియా ముందుకు వచ్చి మాట్లాడిన తీరు బాధాకరమని బొత్స అన్నారు. చంద్రబాబు మాత్రం అవిశ్వాసం అఖరి అస్త్రం..ఈ మూడున్నరేళ్లు బీజేపీ చేయాల్సిన సాయం చేయలేదని - వైఎస్‌ జగన్‌ కు సభా సంప్రదాయాలు తెలియవని చంద్రబాబు హేళనగా మాట్లాడారన్నారు. కేంద్రంపై ఒత్తిడి తీసుకురాకుండా - ప్రతి బడ్జెట్‌ అనంతరం అన్ని రాష్ట్రాల కంటే ఏపీకి కేంద్రం ఎక్కువే ఇచ్చిందని చంద్రబాబు చెప్పారన్నారు. ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఇవాళ ఉసరవెళ్లి మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఆయన మిత్రపక్షమైన జనసేన అవిశ్వాసం పెట్టమని అడిగితే బాధ్యతగల ప్రతిపక్షంగా, ప్రత్యేక హోదానే సంజీవనిగా భావించి వైఎస్‌ జగన్‌ ముందుకు వచ్చారన్నారు. మీ మిత్రపక్షాన్ని కూడా సపోర్టు చేయమని మా నాయకుడు కోరితే పవన్‌ కళ్యాణ్‌ మీడియా ముందుకు వచ్చి వైఎస్‌ జగన్‌ కు సవాల్‌ చేస్తున్నాం.. మీరు అవిశ్వాస తీర్మానం పెట్టండి - మీకు అవకాశం ఇస్తున్నామని - లేదంటే ఆ అవకాశాన్ని టీడీపీకి ఇస్తామని పవన్‌ చెప్పడం విడ్డూరంగా ఉంది` అని అన్నారు. `వైఎస్‌ జగన్‌ కు ఉన్న చిత్తశుద్ధి మీకుంటే మేం అవిశ్వాస తీర్మానం పెడుతున్నాం..మీరు మద్దతి ఇవ్వండి అని సూచించేవారు. చట్టాలు - సభా సంప్రదాయాలు తెలియవని చంద్రబాబు మాట్లాడుతుంటే మీకు వినపడటం లేదా?` అని ప్రశ్నించారు.
4

టీడీపీకి సమస్య వస్తే పవన్‌ బయటకు వస్తారని - చంద్రబాబును రక్షించే ప్రయత్నం చేస్తున్నారని బొత్స‌ మండిపడ్డారు. మీరు ప్రజలకు ఎలాంటి సందేశం ఇవ్వబోతున్నారని ప్రశ్నించారు. పవన్‌..మీ తీరుతో రాష్ట్రానికి నష్టం వాటిల్లుతుందని హెచ్చరించారు. ప్రత్యేక హోదా సాధనకు వైయస్‌ ఆర్‌ సీపీ కృతనిచ్చయంతో ఉందని, పార్లమెంట్‌ సమావేశాల్లో మా వంతుగా ఒత్తిడి తీసుకువస్తామన్నారు. అన్ని అవకాశాలను ఉపయోగించుకుంటామని - కేంద్రంపై పోరాడేందుకు వెనుకడుగు వేసేది లేదని వెల్లడించారు. పవన్‌..మీ మిత్రపక్షాన్నికి చెప్పండి..వారు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడితే మేం మద్దతిస్తామని స్పష్టం చేశారు. మేం పోలవరం ప్రాజెక్టును చూసేందుకు వెళ్తే మా కంటే ముందు పవన్‌ వెళ్లారు. అయితే పవన్‌ చంద్రబాబును ఒక్క మాట కూడా అడగలేకపోయారని విమర్శించారు. పోలవరం రాజకీయ సమస్య కాదని - అలాంటప్పుడు ఎందుకు ప్రశ్నించలేకపోయారని నిలదీశారు. మా ఎమ్మెల్యేలను టీడీపీ సంతలో పశువుల్లాగా కొనుగోలు చేస్తే పవన్‌ ఎందుకు ప్రశ్నించలేదన్నారు. చట్టంలో పెట్టే అంశాలన్నీ కూడా కేంద్రం నెరవేర్చాలని - ఇందుకోసం అందరం కూడా కలిసికట్టుగా పోరాటం చేద్దామని ఆయన పిలుపునిచ్చారు.  వైఎస్‌ జగన్‌ ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తేనే ప‌లు అంశాల్లో కీల‌క నిర్ణ‌యాలు వెలువ‌డ్డాయ‌ని బొత్స‌ గుర్తుచేశారు. ప్రత్యేక హోదానే సంజీవని - పరిశ్రమలు వస్తాయనే ఉద్దేశ్యంతో వైయస్‌ జగన్‌ గతంలో చేసిన ఉద్యమాల కంటే ఉధృతం చేశారని తెలిపారు.  పార్లమెంట్‌ సమావేశాల కంటే ముందుగా మన డిమాండ్‌ వినిపించేందుకు ఉద్యమ కార్యాచరణ రూపొందించారన్నారు. కేంద్రం స్పందించకపోతే త‌మ ఎంపీలు రాజీనామాలు చేస్తారని త‌మ నాయకుడు ప్రకటించారన్నారు.
Tags:    

Similar News